శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 13:06:26

కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జ‌న‌గామ : జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. రైతు వేదిక ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

కొడ‌కండ్ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌దించారు. అర్చ‌కుల మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య రైతు వేదిక శిలాఫ‌ల‌కాన్ని సీఎం ఆవిష్క‌రించారు. రైతులు పెద్ద ఎత్తున చ‌ప్ప‌ట్లు కొట్టి సీఎం కేసీఆర్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. రైతు వేదిక అందుబాటులోకి రావ‌డంతో రైతులంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. 

రైతులు సాగు సమస్యలపై చర్చిండం, అధిక దిగుబడులు, సస్యరక్షణ కోసం అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై అవగాహన పెంచుకొనేందుకు నిర్మించిన రైతు వేదికలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇందులో 2,462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా, 650 నిర్మాణ దశలో ఉన్నాయి. పక్షం రోజుల్లో వీటన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భూవిరాళంతో నిర్మిస్తున్న రైతు వేదికలు 139 ఉన్నాయి. రైతు వేదికలో రెండు గదులు, మరుగుదొడ్లు, విశాలమైన హాలు నిర్మిచడంతోపాటు మిషన్‌ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. ప్రతి వేదికకూ విద్యుత్తు సదుపాయం కల్పించారు.