సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:48

90 రోజుల్లో రైతువేదికలు

90 రోజుల్లో రైతువేదికలు

  • ఊరే వేదికగా.. రైతు సంఘటిత శక్తిగా..
  • దసరా నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి
  • రూ.25 కోట్లతో కోల్డ్‌ స్టోరేజి నిర్మాణం
  • వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు సంఘటితశక్తిగా మారేందుకు ఊరే వేదికగా మారబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయ అధికారులతో సమావేశం కావడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ వేదికలే.. రైతుకు రక్షణ వేదికలు కాబోతున్నాయని అన్నారు. ఇప్పటికే మెజార్టీ చోట్ల వేదికల నిర్మాణం ప్రారంభమైందన్నారు. దసరానాటికి అన్ని గ్రామాల్లో రైతు వేదికలు రాబోతున్నాయని ప్రకటించారు. 

రైతు వేదికలను 75-90 రోజుల్లోగా పూర్తిచేస్తామని కలెక్టర్లు ప్రతిజ్ఞచేసినట్టు తెలిపారు. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పర్యవేక్షణలో రైతు వేదికల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. రైతు వేదికలు పూర్తయితే రైతులు ఒకవద్ద కూర్చొని మాట్లాడుకోవడం, పంటలకు ధరలు నిర్ణయించుకునే అవకాశం దొరుకుతుందని వెల్లడించారు. రైతువేదికల నిర్మాణం అనేది.. రైతును రాజుగా చేసేందుకు, రైతు శాసించే రాజ్యం తెచ్చే క్రమంలో పెద్ద ముందడుగన్నారు. మొత్తం 2604 రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకు రూ.573 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. 

రూ.25 కోట్లతో కోల్డ్‌ స్టోరేజీ

రైతులకు అవసరమైన మేలురకం విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపట్టాయన్నారు. అలా తయారుచేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ 25 కోట్ల వ్యయంతో భారీస్థాయిలో అల్ట్రా మోడల్‌ కోల్డ్‌ స్టోరేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. దీనికి కావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదలచేస్తామన్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి కోల్డ్‌ స్టోరేజీని అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు.


logo