శనివారం 30 మే 2020
Telangana - Mar 26, 2020 , 02:27:38

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

  • సామాజిక దూరం తప్పనిసరి
  • రాత్రి కర్ఫ్యూ విజయవంతం
  • మరింత అప్రమత్తంగా ఉండాలి
  • లాక్‌డౌన్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నదని, రాబోయే రోజుల్లో కూడా ఇంతే పకడ్బందీగా అమలుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక దూరాన్ని మించిన మార్గం లేదని, కాబట్టి లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనావ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. 

పోలీసు, వైద్య శాఖల సీనియర్‌ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులను కోరారు. దవాఖానలో చికిత్స పొందుతున్నవారివిషయంలో, క్వారంటైన్‌లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం కావడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు.

ప్రజలు ఇదేవిధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే, ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ర్టాన్ని, తద్వారా దేశాన్ని కాపాడవచ్చన్నారు. ఎవరికి అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బందిని, శానిటరీ ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo