సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 02:25:30

నాయకుడంటే కేసీఆరే!

నాయకుడంటే కేసీఆరే!

  • ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శం 
  • వలసకూలీలకు భరోసాపై దేశవ్యాప్త ప్రశంసలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జాతీయస్థాయిలో పలువురు ప్రముఖులు మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. నాయకుడంటే కేసీఆరేనని కొనియాడారు. ఉపాధి కోసం రాష్ర్టానికి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వివిధ రాష్ర్టాల వలస కూలీలకు అండగా నిలువడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వలస కూలీలను తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్లుగా చూస్తున్నామని, వారికి ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరికి రూ.500, 12 కిలోల బియ్యం అందిస్తామని ప్రకటించి అమలుచేస్తుండటంపై ప్రశంసలు తెలుపుతూ పలువురు ట్వీట్‌చేశారు. వాటిలో కొన్ని...

సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కేంద్ర పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలకు, వలస కూలీలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన భరోసా అభినందనీయమని కేంద్ర సహాయమంత్రి డాక్టర్‌ సంజీవ్‌ బాల్యన్‌ ట్వీట్‌చేశారు. ‘వలస కూలీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇదే, ఇంత స్పష్టమైన విశ్వాసం కల్పించిన సీఎంకు ధన్యవాదాలు’అని ఏఎన్‌ఐ మేనేజింగ్‌ ఎడిటర్‌ స్మితాప్రకాష్‌ ట్వీట్‌చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస కూలీలను వెనక్కి పంపిస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగా భావించి అండగా నిలుస్తున్న తీరు అద్భుతమని న్యూస్‌ 18 మేనేజింగ్‌ ఎడిటర్‌ అమీష్‌ దేవగన్‌ ట్వీట్‌చేశారు. ‘భారతదేశం రాష్ర్టాల సరిహద్దులతో విభజింపబడిలేదని కేసీఆర్‌ నిరూపించారు. మిగతా రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా వసుధైక కుటుంబమనే విధానం పాటించాలి’ అని భారత్‌ సమాచార్‌ ఎడిటర్‌ ఇన్‌చీఫ్‌ బ్రజేశ్‌మిశ్రా ట్వీట్‌చేశారు. 

‘ముఖ్యమంత్రి పాటించాల్సిన ధర్మాలు ఏమిటో తెలంగాణ సీఎం నుంచి వినండి. మీరు (కేసీఆర్‌) హృదయాలను గెలుచుకున్నారు’అని న్యూస్‌ 18 సీనియర్‌ జర్నలిస్టు రవిప్రతాప్‌ దూబే తెలిపారు. కేసీఆర్‌ నుంచి ఇతర సీఎంలు నేర్చుకోవాలని, ఇలాంటి నాయకుడు అవసరమని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల అభిప్రాయపడ్డారు. ఇంతకంటే విశ్వాసం కలిగించే విషయం మరొకటి ఉంటుందా?అని సీఎన్‌ఎన్‌ సీనియర్‌ జర్నలిస్టు పాయల్‌ మెహతా ట్వీట్‌చేశారు. ‘మీరు హృదయాలు గెలుచుకున్నారు. మిగతా రాష్ర్టాల సీఎంలు, కేసీఆర్‌లా వలస కార్మికుల హృదయాలను గెలుచుకోవడం నేర్చుకోవాలి’అని ఏబీపీ న్యూస్‌ సీనియర్‌ జర్నలిస్టు పింకీ రాజ్‌ పురోహిత్‌ ట్వీట్‌చేశారు. తెలంగాణ ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకున్నారని మిస్‌ సౌత్‌ఇండియా శివాని ట్వీట్‌చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన భరోసా దేశమంతా వ్యాపించాలని సినీ నిర్మాత శోభుయార్లగడ్డ ట్వీట్‌ చేశారు.

ప్రభుత్వానికి ధన్యవాదాలు


హైదరాబాద్‌లో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచితంగా పేదవారి ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లోని మరికొన్నిచోట్ల అన్నపూర్ణ కేంద్రాలను నెలకొల్పాలి.

- అసదుద్దీన్‌ ఒవైసీ, మజ్లిస్‌ , అధినేత, హైదరాబాద్‌ ఎంపీ


logo