గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 02:18:46

భారీ వర్షం పడొచ్చు.. అప్రమత్తం

భారీ వర్షం పడొచ్చు.. అప్రమత్తం

  • ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
  • వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • జాగ్రత్తగా ఉండాలని జిల్లాల కలెక్టర్లు, 
  • ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి ఆదివారం సమీక్షించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల ఉన్నతాధికారులను ప్రభుత్వం మరింత అప్రమత్తంచేసింది. 

వరదనీరు చేరే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. కొన్నిచోట్ల చెరువులు అలుగుపోస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని వంతెనలపై నుంచి వరదనీరు ప్రవహించే అవకాశం ఉన్నది. కనుక ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇదివరకే ఇచ్చిన ఫ్లడ్‌ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా అనుసరిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు వారివారి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎస్‌ స్పష్టంచేశారు.


logo