గురువారం 09 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 00:56:49

ఉజ్వల ప్రస్థానానికి నాంది

ఉజ్వల ప్రస్థానానికి నాంది

  • నియంత్రిత సాగుతో బహుళ ప్రయోజనాలు
  • రైతు శ్రేయస్సే కేంద్ర బిందువు.. భూసార పరిరక్షణ ధ్యేయం
  • వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నియంత్రిత సాగు విధానం ద్వారా తెలంగాణ వ్యవసాయరంగంలో ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విధానంద్వారా భూసారాన్ని పరిరక్షించవచ్చని, అనేక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. సోమవారం వ్యవసాయంపై ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నియంత్రితసాగు లక్ష్యాల్ని సీఎం వివరించారు. రైతు కేంద్రంగానే సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ‘నియంత్రిత సాగు కేవలం ఒక పంట కోసమో, ఒక సీజన్‌ కోసమో ఉద్దేశించిన విధానంకాదు. తెలంగాణలో వ్యవసాయ విప్లవం చోటుచేసుకొంటున్నది. ఈ నేపథ్యంలో ముందుచూపుతో ఆలోచించి రైతు కేంద్ర బిందువుగా సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాం. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానం చేశాం. కరెంటు సమస్య తీరిపోయి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ సమృద్ధి కలిగిన రాష్ట్రంగా రూపుదాలుస్తుంది. ఈ యాసంగిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశవ్యాప్తంగా 1.15 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 64 లక్షల టన్నులు తెలంగాణ నుంచే సమీకరించింది. అంటే, దేశం మొత్తంలో 55% ధాన్యం తెలంగాణ దేశానికి అందించింది. తెలంగాణ సాధించిన ఈ అభివృద్ధిని ఎఫ్‌సీఐ చైర్మన్‌ స్వయంగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు వ్యవసాయం సరిగా చేయడం రాదన్నారు. పాలన చేతకాదని, తెలంగాణ ఏర్పడితే అంధకారం అలుముకొంటుందని, తెలంగాణ రైతాంగం తీవ్ర కష్టాల పాలవుతుందని అప్పటి పాలకులు అవాకులు, చవాకులు పేలారు. కానీ తెలంగాణ అద్భుతంగా పురోగమించింది. గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకొంటుందనడానికి పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి గొప్ప తార్కాణం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

వ్యవసాయం ఉజ్వల ప్రస్థానం 

‘రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి 1.30 కోట్ల ఎకరాల్లో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది. ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం తెలంగాణ.. వ్యవసాయరంగంలో చేయబోయే ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతుంది.’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

పంజాబ్‌ అనుభవంతో..

‘గతంలో పంజాబ్‌ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశంలోనే ప్రథమస్థానాన్ని సాధించింది. కానీ పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడంవల్ల అక్కడ వ్యవసాయ వైపరీత్యం (పంజాబ్‌ డిజాస్టర్‌) సంభవించింది. పంజాబ్‌ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనంచేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పనచేసింది’ అని ముఖ్యమంత్రి వివరించారు.

ఎరువులపైనా అవగాహన రావాలి

‘నియంత్రిత పంటల సాగు విధానంతోపాటు, ఎరువుల వాడకంపై కూడా రైతులకు అవగాహన పెరుగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. వేసిన ఎరువంతా వినియోగం కాకపోవడం వల్ల భూమిలోనే చాలా ఫాస్పేట్‌ (భాస్వరం) నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పేరుకుపోయిన భాస్వరాన్ని తొలిగించడానికి ఫాస్పేట్‌ సాలబుల్‌ బ్యాక్టీరియా (పీఎస్బీ) ని వదలడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఇలాంటి పద్ధతులను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతోపాటు, మార్కెట్లోకి క్రమపద్ధతిలో సరుకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్‌ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోధన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయి. వ్యవసాయంతోపాటు వ్యవసాయానికి అనుగుణమైన ఇతర వ్యవస్థలు కూడా వృద్ధిచెందాలి. మిల్లింగ్‌ వ్యవస్థ పెరుగాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జరుగాలి. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ల ఏర్పాటు దిశగా పభుత్వం అడుగులు వేస్తున్నది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

నియంత్రిత సాగు ద్వారా కలిగే  ప్రయోజనాలు 

  • మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు సమస్య, మద్దతు ధర సమస్య తలెత్తదు. 
  • భూమి నుంచి పంటలను తీసుకోవడమే కాకుండా, ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది.
  • ఒకేరకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్ఠవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్ఠవేసే ప్రమాదం ఉండదు. 
  • నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది. 
  • భూమిలో లవణీయత పెరిగి చవుడుబారిపోయే ప్రమాదం ఉండదు. 


logo