సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 20:18:12

నిర్లక్ష్యం చేసిన చోటే వైరస్‌ విజృంభించింది.. సీఎం కేసీఆర్‌

నిర్లక్ష్యం చేసిన చోటే వైరస్‌ విజృంభించింది.. సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ముగిసింది. కరోనా నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కరోనా వైరస్‌ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించాం. ఎలా ముందుకు పోవాలో అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

 ఇప్పటి వరకు తెలంగాణలో 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మాత్రమే విదేశాల నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగారు. మిగిలిన వారు ఇతర ఎయిర్‌పోర్టుల్లో దిగి బస్సులు, రైళ్లలో రాష్ర్టాలకు వచ్చారు. వేరే ఎయిర్‌పోర్టుల్లో దిగి రాష్ర్టానికి వచ్చిన వారిని గుర్తించడం కష్టం. ఇండోనేషియా నుంచి వచ్చిన వారు కూడా రోడ్డు, మార్గాల ద్వారా వచ్చిన వారే. వియత్నాం చైనా పక్కనే ఉంటుంది. అయినా ఆదేశానికి ఇబ్బంది లేదు. ఏ దేశంలో చర్యలు తీసుకోలేదో అక్కడ ఇబ్బంది ఉంది. 

చైనా ఇటలీ నిర్లక్ష్యం చేశాయి కాబట్టే ఇబ్బంది పడ్డాయి. మార్చి 1 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చాం. మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరికి వారు రిపోర్టు చేయాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ సిబ్బంది, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నాం. వారం పాటు మూసివేయాలని ఆదేశించిన వాటి గడువు మార్చి 31 వరకు పొడగిస్తున్నాం.

సినిమాహాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు అమ్యూజ్మెంట్‌ పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌ , జిమ్స్‌ ఇండోర్‌, అవుట్‌ డోర్‌ స్టేడియాలు, జూపార్క్‌లు, మ్యూజియమ్స్‌ బంద్‌ ఉంటుందని తెలిపారు. బహిరంగసభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్స్‌, ఉత్సవాలు, ర్యాలీలకు, ఎగ్జిబిషన్‌, ట్రేడ్‌ఫేర్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌లకు అనుమతులు ఇవ్వబడవు. అన్ని విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు 31 వరకు బంద్‌.  దేవాలయాలు, మసీదులు, చర్చీలకు ప్రజలు అనుమతించవద్దు. మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్య సూత్రమన్నారు. logo