శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 01:35:48

ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం

ఏపీ తీరు ఏకపక్షం ఎదిరిస్తాం

  • స్నేహహస్తం అందించినా.. సంప్రదించకుండా నిర్ణయమా?
  • ఏపీ ఎత్తిపోతలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం
  • అపెక్స్‌ కమిటీ అనుమతి లేకుండా ప్రాజెక్టు
  • తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం
  • పరస్పరం సహకరించుకోవాలన్న స్ఫూర్తికి విఘాతం
  • కృష్ణా జలాల వాటాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి
  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు. దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేయాలని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

రోజుకు 10 టీఎంసీలపైనే తరలింపు!

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్‌ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది. ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల జలాల తరలింపు లక్ష్యంగా అందులో పేర్కొంది. కానీ ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి ఐదున్నర టీఎంసీల వరకు జలాల్ని తరలించే వ్యవస్థ ఉండగా అదనంగా ఈ పనులు చేపట్టడంతో 1.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో రోజుకు 10 టీఎంసీల జలాల్ని ఏపీ తరలించుకుపోతుందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణను సంప్రదించకుండానే శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తామని స్పష్టంచేశారు. 


మూడు ఉమ్మడి జిల్లాలకు నష్టం

రెండు రాష్ర్టాలలో కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అందుకు అపెక్స్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నదని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్‌ కమిటీ ఆమోదం తీసుకోలేదన్నారు. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిలోని నీటిని రెండు రాష్ర్టాలు వాడుకోవాలని చెప్పారు. కానీ తెలంగాణను కనీసం సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి జీవో కూడా జారీ చేసిందని తెలిపారు. ఇది తీవ్ర అభ్యంతకరమని సీఎం మండిపడ్డారు. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ వెంటనే కేఆర్‌ఎంబీలో ఫిర్యాదు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.

స్నేహబంధానికి ఇది విఘాతం

పొరుగు రాష్ర్టాలతో సఖ్యతగా ఉండాలని తాము ఆశిస్తే.. ఏపీ సర్కార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని స్నేహబంధానికి విఘాతం కలిగించిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కనపెట్టి రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించిందని ఆయన గుర్తుచేశారు. బేసిన్లు, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానని చెప్పారు. అయినప్పటికీ ఏపీ సర్కార్‌ కనీసం తమను సంప్రదించకుండానే శ్రీశైలంలో నీటిని తరలించుకుపోవడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీపడే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 


కృష్ణాలో వాటాపై సుప్రీంకోర్టుకు వెళ్లాలి

కృష్ణా నదిలో రాష్ర్టాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయంకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గోదావరి నది నికరజలాల్లో తెలంగాణ రాష్ర్టానికి ఉన్న 950 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని అంటూ రాష్ట్రంలో ఇంకా నీటి అవసరం ఉందని అన్నారు. తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, విద్యుత్‌ ప్లాంట్లకు నీరు కావాలి కాబట్టి, గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సీఎం అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్‌కే జోషి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, అటార్నీ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, అడిషనల్‌ ఏజీ రాంచందర్‌ రావు, లీగల్‌ కన్సల్టెంట్‌ రవీందర్‌ రావు, రిటైర్డ్‌ ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, నీటి పారుదలశాఖ సీనియర్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

జనవరిలోనే కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి కృష్ణాజలాల్ని తరలించేందుకు కొంతకాలంగా కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఏపీ సీఎం జగన్‌ సమీక్ష సమావేశాల్లో, మంత్రివర్గ భేటీల్లో తీసుకుంటున్న నిర్ణయాలు పత్రికల్లో రావడంతో గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ అప్రమత్తం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు ఈ ఏడాది జనవరి 13న కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదును కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖకు పంపి వివరణ ఇవ్వాలనిలేఖ రాసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాత్రం ఇప్పటివరకు సమాధానం రాలేదు. 

 పొరుగు రాష్ర్టాలతో సఖ్యతగా ఉండాలని మేము ఆశిస్తే.. ఏపీ సర్కార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని స్నేహబంధానికి విఘాతం కలిగించింది. గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కనపెట్టి రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, భేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. అయినా ఏపీ సర్కార్‌ కనీసం మనల్ని సంప్రదించకుండానే శ్రీశైలంలో నీటిని తరలించుకుపోవడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం.

తెలంగాణ రాష్ర్టాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలు.  ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంబిస్తాం.  

- సీఎం కేసీఆర్‌


logo