ఆదివారం 24 మే 2020
Telangana - Mar 19, 2020 , 03:19:37

జర పదిలం

జర పదిలం

  • స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తప్పనిసరి
  • విదేశాల నుంచి వచ్చినవారు పరీక్షల తర్వాతే ఇండ్లకు
  • ఎక్కువసంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు వద్దేవద్దు
  • పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉండాలి
  • రాష్ట్ర ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు  పిలుపు
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని చర్యలు
  • నేడు ప్రగతిభవన్‌లో సీఎం అత్యున్నతస్థాయి సమావేశం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలు మరిన్ని స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకొని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుందామని బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారిలోనే కరోనా వైరస్‌ బయటపడుతున్నందువల్ల ఇతరదేశాల నుంచి వచ్చినవారిని ఎవరినైనా తప్పనిసరిగా సంపూర్ణ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఇండ్లకు పంపాలని అధికారులను ఆదేశించారు. 

ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలన్నారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దుచేసుకోవాలని సూచించారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా ప్రజలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలను ప్రజలు అర్థం చేసుకొని రాష్ర్టాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడానికి తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై సీఎం కేసీఆర్‌ గురువారం అత్యున్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. 


మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హైదరాబాద్‌కు చెందిన మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంతమంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణలను అమలుచేస్తున్నది. ఈ అత్యున్నతస్థాయి సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నది. రహదారుల వెంట ప్రజలు గుమిగూడకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


logo