బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 21:39:55

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై  సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌:  రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100శాతం వెంటనే ఆన్ లైన్ చేయాలని సీఎం సూచించారు.

నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్ రూపకల్పనపై ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు  రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు  నర్సింగ్ రావు,   స్మితా సభర్వాల్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ  అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ  సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఆన్ లైన్ ప్రక్రియను పూర్తి చేయడానికి డీపీఓలు.. ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు, ప్రతీ ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.



logo