శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 02:43:44

ఘనంగా గాంధీ జయంతి

ఘనంగా గాంధీ జయంతి

  • బాపూఘాట్‌ వద్ద గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి 
  • అసెంబ్లీ ఆవరణలో పోచారం, గుత్తా నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాత్మాగాంధీ 151వ జయంతిని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుష్పాంజలి ఘటించారు. తొలుత బాపుఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..గవర్నర్‌ తమిళిసైకి స్వాగతం పలికారు. ఇరువురు కలిసి బాపు సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసి, పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అక్కడి నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. సీఎం కేసీఆర్‌ వెంట శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మండలి ఛీప్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, దానం నాగేందర్‌, ప్రకాశ్‌గౌడ్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న గాంధీజీ ఆశయాన్ని సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని అన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయని, సీజనల్‌ వ్యాధులు లేవన్నారు. మిషన్‌ భగీరథతో తాగునీటి కష్టాలూ లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, చీఫ్‌ విప్‌ బీ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్‌వద్ద టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ గాంధీజీకి నివాళులర్పించారు.