మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 02:35:26

అందరి బాగు ముందుకు సాగు

అందరి బాగు ముందుకు సాగు

దాపరికాలు లేవు. దాగుడుమూతలు లేవు. మాటలతో ఆటలు లేవు. మభ్యపెట్టే మాయలు లేవు. ఉన్నదున్నట్టు, కుండబద్దలు కొట్టినట్టు,నిప్పులాంటి నిజాలను నికార్సుగా జనం కండ్ల ముందు నిలబెట్టినట్టు, చేసింది చెప్తాం, చేసేదీ చెప్తాం, చేయలేనిది కూడా బాజాప్తా చెప్తాం... ..అన్న రీతిలో సాగింది సీఎం కేసీఆర్‌ సమాధానం. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఉభయసభల్లో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి స్ఫూర్తిదాయకంగా ప్రతిస్పందించారు. అలుపు లేకుండా, విసుగు పడకుండా ఐదున్నరగంటలపాటు సుదీర్ఘంగా జవాబిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎదుర్కొంటున్న పరిస్థితిని సభ ద్వారా ప్రజలకు నివేదించారు. రాష్ట్రం వచ్చిన నిన్నటి నుంచి, 30 ఏండ్ల రేపటి దాకా తెలంగాణ గత వర్తమాన భవిష్యత్తును కండ్లకు కట్టారు. ఏ రంగాన్ని ఎట్లా మెరిపించిందీ, సకల జనుల్ని ఎట్లా మురిపించిందీ వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణను తామెట్లా పైకి తెచ్చిందీ సోదాహరణంగా వివరించారు. పేదలకు 57 ఏండ్లకే పెన్షన్‌ హామీని అమలు చేయబోతున్నట్టు ప్రకటించారు. మాంద్యంలో చిక్కుకున్న ఈ తరుణంలో నిరుద్యోగభృతిని అమలు చేయలేమనీ స్పష్టంచేశారు. ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. వేతన సవరణ తక్కువే చేయాల్సి వస్తే ఆ మేరకు ఉద్యోగుల్ని ఒప్పించి అమలు చేస్తామనీ విశదీకరించారు. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా, నిరుపేదను ఆదుకొంటామని, రైతును రాజును చేసితీరుతామని భవిష్యద్దర్శనం చేశారు.

 • వచ్చే జూన్‌ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు
 • రైతును రాజునుచేసేదాకా నిద్రపోను
 • కేసీఆర్‌ బతికున్నంతకాలం రైతుబంధు పథకం అమలు
 • కాళేశ్వరం నుంచి 530 టీఎంసీల నీటి వినియోగం
 • భగీరథతో 30 ఏండ్లదాకా సమృద్ధిగా తాగునీరు
 • 57 ఏండ్లు నిండిన పేదలకు ఈ ఏడాది నుంచే పెన్షన్‌
 • ఈబీసీలకు రిజర్వేషన్లు వందశాతం అమలు
 • ఏప్రిల్‌లో నూతన రెవెన్యూచట్టం
 • ఈ ఏడాది నిరుద్యోగభృతి సాధ్యంకాదు
 • ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ
 • లక్ష ఉద్యోగాలు ఇస్తున్నాం
 • కంటోన్మెంట్‌ భూమిపై హక్కు మనదే
 • హరితహారంలో విస్తృత భాగస్వామ్యం
 • ఖైదీలకు క్షమాభిక్ష అంశం పరిశీలన
 • ప్రజలకు కల్తీలేని ఆహారాన్ని అందిస్తాం
 • వందశాతం 24 గంటల కరంట్‌ సరఫరా
 • అధికారమే పరమావధి కారాదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి వచ్చే ఏడాది జూన్‌ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రైతును రాజునుచేసేదాకా నిద్రపోనన్నారు. శాసనసభ, మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా శనివారం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాలు, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయడం ద్వారా 20 లక్షల ఎకరాల్లో అద్భుతమైన పంటలు పండుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పంటలసాగు 123.5 శాతం పెరిగిందన్నారు. 


ఈ యాసంగిలో 38,19,419 ఎకరాలో వరి నాటారని, దీనికి 24 గంటల కరంట్‌ ఇవ్వొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. బోర్లల్ల నీళ్లు వస్తున్నాయి కాబట్టి వరిపంట వేస్తున్నారని చెప్పారు. వరి వెయ్యొద్దని అపోహలు ప్రచారంచేస్తున్నారని, అవి పట్టించుకోకుండా వరి సాగుచేయాలని రైతులను కోరారు. వచ్చే ఏడాది వానకాలం, యాసంగి కలిపి 225 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. తెలంగాణలో వంద లక్షల టన్నుల ధాన్యం తింటారని,  మిగిలిన 125 లక్షల టన్నుల ధాన్యాని ఎఫ్‌సీఐ కొనడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఇవి కాకుండా మనకు 2 వేల మిల్లులు ఉన్నాయని, వాటికి ఎగుమతుల అనుమతి ఇస్తే చాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, కాకతీయ కాలువ కోదాడ వరకు 120 రోజులు చరిత్రలో మొదటిసారిగా నీళ్లు పారాయని చెప్పారు.


ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో రోహిణి కార్తెలో నారు పోసుకోవచ్చునా అని అడిగారని, నీళ్లున్నాయి, నార్లు పోసుకోవచ్చునని చెప్పానని గుర్తుచేశారు. ఈ ఏడాది వరి సాగు  88.98 లక్షల ఎకరాలనుంచి కోటి ఎకరాల్లో వరి పండించడానికి ప్లాన్‌ చేయాలని సూచించారు. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. సోనా వైరైటీ సన్నరకాన్ని అభివృద్ధి  చేసిందని.. షుగర్‌ వ్యాధిగ్రస్థులు కూడా ఈ అన్నాన్ని నిరభ్యంతరంగా తినొచ్చన్నారు. రైతు కమిటీల ద్వారా సన్నరకాలు పండించేలా ప్రచారంచేసి, జూన్‌ నాటికి రైతాంగాన్ని సిద్ధంచేయాలని పేర్కొన్నారు. పోడు భూములకు  రైతుబంధు రాదని, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న భూములకే రైతుబంధు వస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. సీఎస్‌, మంత్రులతోసహా స్వయంగా తానే వచ్చి పోడుభూముల సమస్య పరిష్కరిస్తానన్నారు.రైతులకు భూరికార్డుల నమోదు సమస్యగా మారిందని, రెవెన్యూ అధికారులు ఒకరి భూమిని మరొకరి పేరుపై ఎక్కించి గొడవలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పదివేలమంది ఉద్యోగులకోసం లక్షల మంది రైతులను ఇబ్బందికి గురిచేయలేమన్నారు. రైతులకు భూరికార్డుల నమోదు సమస్య లేకుండా ఏప్రిల్‌ నుంచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. రైతుబీమా పథకాన్ని అరవైఏండ్ల లోపు రైతులందరికీ వర్తింపజేస్తున్నామని, ప్రారంభంలో బీమా ప్రీమియం రూ.600 కోట్లు అనుకొన్నప్పటికీ, రైతులసంఖ్య పెరుగటంతో ఈ ఏడాది రూ.1368 కోట్లు ప్రీమియంగా చెల్లించామని పేర్కొన్నారు. 


రైతుబంధు సమితి

రైతు సమన్వయ సమితి పేరును త్వరలో రైతుబంధు సమితిగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమితుల్లో 1.60 లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తారని, వీళ్లు ఆర్గనైజింగ్‌గా రైతులు పంటలు వేసినప్పటి నుంచి మార్కెట్‌కు తరలించేవరకు సంఘటితంగా వ్యవహరిస్తారన్నారు. రైతులను మరింత సంఘటితంగా మార్చేందుకు క్లస్టర్లవారీగా రైతువేదికల నిర్మాణాలు చేపడతామని, దీనికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. 


కేసీఆర్‌ బతికినంతకాలం రైతుబంధు

రైతుబంధు పథకం కేసీఆర్‌ బతికి ఉన్నంతకాలం కొనసాగిస్తామని సీఎం చెప్పారు. రైతుబందు అమలుకు ఒక ప్రత్యేకమైన సిస్టం అమలులో ఉన్నది. బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా.. సిస్టం ప్రకారం అమలవుతుంది. నిధుల సర్దుబాటు సందర్భంగా ఫ్రీజింగ్‌ ఉన్నప్పుడు కొంత  ఆలస్యం కావొచ్చన్నారు. రైతుబంధు పథకం అమలుకు పరిమితి లేదని, అందరికీ వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. 


ఫలితాలిస్తున్న కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 530 టీఎంసీలను వినియోగించుకుంటామని సీఎం పునరుద్ఘాటించారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌తో 75 టీఎంసీల నీటిని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వినియోగంలోకి తీసుకువస్తామని, ఐదారు లక్షల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాతోపాటు సాగర్‌ ఆయకట్టులోని 2.60 లక్షల ఎకరాలను స్థిరీకరిస్తామని వివరించారు. కృష్ణా నదిలో ఒక ఏడాది వరద పారితే మరో ఏడాది ఎండుతున్నదని, దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు నష్టపోతున్నారన్నారు. సీతారామా ద్వారా 175 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని సీఎం వెల్లడించారు.  


పెద్ద దేవులపల్లి లిప్ట్‌ను పరిశీలిస్తున్నాం

నల్లగొండ జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు నీరందించేందుకు పెద్ద దేవులపల్లి ఎత్తిపోతలను పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం గోదావరిలో మన 950 టీఎంసీల నీటివాటాను వినియోగించుకొని తెలంగాణ కోటి ఎకరాల మాగాణి చేస్తామని సీఎం పేర్కొన్నారు.


మూడు రాష్ర్టాల ఒప్పందం ఓ రికార్డు 

ఆనాడు నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అప్పటి నేతలు బాబ్లీ దగ్గర డ్రామాలు చేశారని సీఎం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మూడు రాష్ర్టాలతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఒక రికార్డన్నారు. మహారాష్ట్ర అప్పటి సీఎం దేవేంద్రఫడ్నవిస్‌తో ఏడుసార్లు సమావేశమయి వారి సందేహాలను నివృత్తిచేశామని, ఏపీలో తొలి ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టినీ.. తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ సహకారంతో సమస్యలను తీర్చుకొన్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రారంభానికి ఎగువ, దిగువన ఉన్న రాష్ర్టాల సీఎంను పిలిచి ప్రారంభం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆర్డీఎస్‌ పనులను ఆధునీకరిస్తున్నామని, తుమ్మిళ్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే రెండేండ్లలో రాష్ర్టాన్ని కరువు, వలసలు లేని తెలంగాణగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 


కల్తీలేని ఆహారం అందిస్తాం

రాష్ట్రంలో అతి త్వరలో లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని, దాన్ని స్థానికంగా మనం వినియోగించుకున్న తర్వాతే ఎక్స్‌పోర్ట్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో భాగంగా కల్తీలేని ఆహారాన్ని అందించే లక్ష్యంతో శుద్ధికేంద్రాల ఏర్పాటు ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఐకేపీ సిబ్బందిని రెగ్యులర్‌ చేసి, మహిళా సంఘాల ను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. పసుపు రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరగా, దీనిపై చర్చించేందుకు సమగ్రంగా నివేదిక రూపొందించాలని, ఇందులో జీవన్‌రెడ్డిని భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. పసుపునకు మద్దతు ధర కల్పించే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. 


హరితహారంలో విస్తృత భాగస్వామ్యం

‘రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ, మున్సిపాలిటీల ప్రణాళికా సైన్యంతోపాటు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. హరితహారంలో విస్తృత భాగస్వామ్యం ఉండాలి’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 1985లోనే హరిత సిద్దిపేట కార్యక్రమం చేపట్టానని, అప్పుడు 10 వేల మొక్కలు కావాలంటే దొరకలేదన్నారు. కష్టపడి మొక్కలు నాటామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేసి కోట్ల మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 


వందశాతం 24 గంటల కరంటిస్తం

సాగుతోపాటు అన్నివర్గాలకు వందశాతం 24 గంటల కరంట్‌ బరాబర్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి కరంట్‌ వద్దంటున్నారని, ఆయన ఇంటికి రేపటినుంచి కరంట్‌ బంద్‌ చేద్దామన్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాను యావత్‌ దేశం పొగుడుతుంటే వీళ్లు వద్దంటున్నారని చెప్పారు. విద్యుత్‌ చార్జీలు పెంచుతారని అంటున్నారని, చార్జీలు తప్పకుండా పెంచుతామని తెలిపారు. ఎందుకు చార్జీలు పెంచాల్సి వచ్చిందో ప్రజలకు చెప్తామని పేర్కొన్నారు. 


మూసీని ఎవరు మురికిచేశారు?

‘మూసీని మురికి చేశామంటున్నారు. మూసీని మురికి చేశామా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మూసీలో ఈ టర్మ్‌లోనే స్వచ్ఛమైన వందశాతం నీరు పారేలా చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. గొంతెత్తి మాట్లాతే అన్నీ నిజం మాట్లాడినట్టు కాదని అన్నారు. పరిశ్రమల్లో 90 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించామని, వ్యర్థాలు లేని ఫార్మా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం అధికారుల బృందాన్ని అమెరికా, యూరప్‌కు పంపించామని తెలిపారు.


2/3 సభ్యులు వస్తేనే విలీనం  

‘2018  ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం, ఈ మధ్య హుజూర్‌నగర్‌లో గెలిచాం. ఒక నామినేటెడ్‌ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 120 స్థానాల్లో 90 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తామంటే  తిరస్కరించానని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు సభ్యులు వస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్పగా, 2/3 వంతు సభ్యులు పిటిషన్‌పెట్టి విలీనం అయ్యారని వివరించారు. రాజ్యాంగబద్ధంగా విలీనమైతే ఎలా వద్దంటామని అన్నారు. దేశంలో ఏ పార్టీఅయినా చీలివస్తే వద్దని ఎవరైనా అంటారా?అని ప్రశ్నించారు. మీకు పార్టీని కాపాడుకొనే దమ్ములేక మాపార్టీ వాళ్లను తీసుకున్నారంటే ఎట్లా? అని ఎద్దేవాచేశారు. రాజ్యసభలో టీడీపీ సభ్యులు బీజేపీలో విలీనమైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2/3 వంతు సభ్యులు వస్తే రాజ్యాంగం ప్రకారం తమరు నిర్ణయం తీసుకున్నారని, తమరి అధికారాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని స్పీకర్‌ పోచారంతో అన్నారు. అవసరమైతే అభ్యర్థిని సభ నుంచి బహిష్కరించే విషయం ఆలోచించాలని సూచించారు


82 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు

ఎమ్మెల్యే   క్యాంపు కార్యాలయాల నిర్మాణంపై పోయిన టర్మ్‌లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో 15 మినహా 104 నియోజకవర్గాల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, 82 పూర్తయి వినియోగంలోకి వచ్చాయని తెలిపారు. 14 తుదిదశలో ఉన్నాయని, ఎనిమిదిచోట్ల స్థలవివాదం వల్ల ఆలస్యమైయిందని, వాటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గానికి చెందిన భవననిర్మాణం పూర్తయిందని, కానీ ప్రహరీ తదితర చిన్నపనులకు ఆయన మరో రూ.90 లక్షలకు ప్రతిపాదనలు పంపించారని, అవి పరిశీలన దశలో ఉన్నాయని తెలిపారు.


రిజర్వేషన్లు లేనిచోట కల్పన

తెలంగాణ   వచ్చాక అన్నిరంగాల్లో అన్నివర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రిజర్వేషన్లు లేనిచోట కల్పించామని, ఈ చర్యలతో సామాజిక సమతూకం పెరిగిందని చెప్పారు. 538 జెడ్పీటీసీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 65 శాతం, ఇతరవర్గాలకు 35 శాతం.. ఎంపీపీ అధ్యక్షుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 69 శాతం, ఇతరవర్గాలకు 31 శాతం.. జెడ్పీ చైర్‌పర్సన్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 53 శాతం, ఇతరులకు 47 శాతం.. మున్సిపాలిటీ చైర్మన్లు, సభ్యుల్లో 64 శాతం బలహీనవర్గాలకు, 36 శాతం ఇతరులకు అవకాశం కల్పించామని చెప్పారు. సింగిల్‌ విండో చైర్మన్లలో 44 శాతం వీకర్స్‌, 56 శాతం ఇతరులకు.. ఎప్పుడూ ఓపెన్‌ క్యాటగిరీలో ఉండే సొసైటీల్లో వీకర్స్‌ సెక్షన్స్‌  వచ్చారని, పాలమూరు డీసీసీబీ మైనార్టీకి, అదిలాబాద్‌ డీసీసీబి ఎస్సీకి, ఖమ్మం డీసీసీబీ బీసీలకు ఇచ్చామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సామాజిక సమతుల్యతను పాటించడంతో సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ పాలనంతా లాఠీదెబ్బలే 

కాంగ్రెస్‌ పాలనలో ఒక్క డయాలిసిస్‌ సెంటర్‌ లేదని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. బస్తీ దవాఖానలు లేవని, ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్లు కూడా లేవని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో 84 పీహెచ్‌సీలకు స్టాండర్డ్‌ గుర్తింపు వచ్చిందని, కాంగ్రెస్‌ పాలనలో నకిలీ విత్తనాలు, పాలమూరు వలసలు, విత్తనాలు, యూరియా కోసం లాఠీదెబ్బలు తిన్నారని గుర్తుచేశారు. తెలంగాణ కవులే ‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే..’అని పాటలు పాడారని చెప్పారు. స్థానిక సంస్థలకు ప్రతినెలా రూ.308 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. 


ఏ కరోనా దగ్గరకు రాదు

పల్లెప్రగతిలో  అందరిని కలుపుకొని ముందుకుపోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని, అందరిని కలిపి కమిటీలు వేశామని చెప్పారు. 12,751 పంచాయతీల్లో 8,20,727 మందితో గ్రామీణ సైన్యం ఏర్పడిందని చెప్పారు. సర్పంచ్‌లు, వార్డుసభ్యులు కలిస్తే 10 లక్షల మంది అవుతారని.. గ్రామాలు కళకళలాడుతాయని అన్నారు. మున్సిపాలిటీల్లో 2,04,300 మంది ప్రజాకమిటీల్లో ఉన్నారని, పట్టణాలు, గ్రామాల్లో కలిపి 12 లక్షల సైన్యం ఉన్నదని, అందరూ కలిసిపనిచేస్తే రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందని... ఏ కరోనా దగ్గరకు రాదని చెప్పారు. ప్రజల దీవెనలు ఉన్నంతకాలం రాజీపడకుండా ముందుకుపోదామని సూచించారు. 


57 ఏండ్లకే పింఛన్‌

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినమాట ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏండ్ల వయస్సున్నవారికి పింఛన్‌ అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు. ‘ప్రపంచంలో అన్ని దేశాల్లో నిరుద్యోగ సమస్య ఉన్నది. మన దగ్గర లేబర్‌ పదానికి సరైన నిర్వచనం లేదు. కోటిమందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నదా? లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పి యువతను మభ్యపెట్టకండి. రైల్వే, డిఫెన్స్‌, బ్యాంకింగ్‌రంగాలవైపు మన యువత వెళ్లడంలేదు. ఏ రంగంలో అవకాశాలున్నాయో యువతకు తెలియజేస్తం. అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 


ఈబీసీ రిజర్వేషన్లు 100% అమలు చేస్తాం

ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ)లకు వారి కోటా ప్రకారం రిజర్వేషన్లను వందశాతం, ఎస్టీలకు 12%రిజర్వేషన్లను అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో 70% ఉన్న బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడాలి. 50% రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడాలేదు. సుప్రీంకోర్టు 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని అడ్డుకుంటుంది. అందరం కలిసి ఢిల్లీలో ధర్నా చేద్దాం’ అని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో గిరిజనులకు 12% రిజర్వేషన్‌ కల్పించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు. ఈ సూచన ఇచ్చినందుకు జీవన్‌రెడ్డికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. వర్సిటీల్లో ఖాళీలుంటే పూర్తిచేస్తామన్నారు. 


కేంద్రంతో విభేదాలు లేవు

నిధుల పంపిణీకి సంబంధించి కేంద్రంతో అభిప్రాయ భేదాలే తప్ప విభేదాలు లేవని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘జీఎస్టీ నిధులు రావాల్సి ఉంది. రాష్ర్టాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సిందే. ఈ ఏడాది రూ.3600 కోట్ల నిధులు రావాల్సింది. కేంద్రం రూ.1450 కోట్ల అప్పులు తీసుకోవడానికి రాష్ర్టానికి అనుమతిచ్చింది’ అని తెలిపారు. ‘కేంద్రం నుంచి జీఎస్టీ నిధులు రావడంలేదని అక్బరుద్దీన్‌ చెప్పింది నిజమే. దీన్ని రాజాసింగ్‌ అంగీకరించాలి’ అని పేర్కొన్నారు. రైతులకు కోఆపరేటివ్‌ రుణాలపై వడ్డీ చెల్లించే విషయంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని సీఎం అంగీకరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే విషయమై పరిశీలించాలని హోంమంత్రిని కోరినట్టు సీఎం చెప్పారు. 


పాతబస్తీ మెట్రో పూర్తిచేస్తం

పాతబస్తీలో తాగునీటి సరఫరా మెరుగైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గతంలో 119 ఎంజీడీలు (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) వస్తే ఇప్పుడు 127 ఎంజీడీలు వస్తున్నాయన్నారు. పాతబస్తీకి మెట్రో విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్‌అండ్‌టీని పిలిచి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతోపాటు పాతబస్తీ ఎమ్మెల్యేలంతా ముందుండి ఈ ప్రాజెక్టును పూర్తిచేయించాలని, వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. ఉస్మానియా దవాఖానకు  కొత్త భవనంతోపాటు పాతబస్తీకి సంబంధించి ఇంకో దవాఖాన అవసరమని తెలిపారు. గుడుంబా పునరావాసం కింద రాష్ట్రంలో రూ.125.99 కోట్లు ఖర్చు పెట్టామని, ఇందులో 6,299 మందికి తలా రూ. 2 లక్షల చొప్పున ఇచ్చి పునరావాసం కల్పించామని సీఎం చెప్పారు. ధూల్‌పేటకు వస్తానని తాను గతంలోనే రాజాసింగ్‌కు మాటఇచ్చానని, కచ్చితంగా వస్తానని హామీఇచ్చారు. 


అందరి భాగస్వామ్యంతోనే ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌

నిరక్షరాస్యతలో  తెలంగాణ దేశంలో కింది నుంచి మూడోస్థానంలో ఉండటం బాధాకరమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇది గత ప్రభుత్వాల పుణ్యాన వచ్చిన వారసత్వమేనని పేర్కొన్నారు. అందుకే ఈచ్‌వన్‌, టీచ్‌వన్‌ అని ప్రకటించానని, బడ్జెట్‌లో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు డబ్బులు కూడా కేటాయించానున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలందరూ అందులో భాగస్వాములు కావాలని కోరారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల విషయంలో గతంలో చెప్పిన సంఖ్యనే ఇప్పుడూ చెప్పామని, తాము నికార్సయిన మనుషులమైనందునే ఉన్నది ఉన్నట్లు చెప్తున్నామని పేర్కొన్నారు. బాన్సువాడ, ఖమ్మంతోపాటు పలుచోట్ల గృహప్రవేశాలు పూర్తయినట్టు చెప్పారు. సమగ్రసర్వేలో ఏడు లక్షల ఇండ్లు కడితే సరిపోతుందనే రిపోర్టు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ పోటీపడి లక్షల ఇండ్లు కట్టినట్టు చెప్పారని, ఆ లెక్కన  రాష్ట్రంలో 60-70  లక్షల ఇండ్లు ఉండాలని.. కానీ వాస్తవంగా అవేవీ కట్టకుండా డబ్బులు దిగమింగారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. 


దిశ ఘటనపై బాధపడ్డా

దిశ ఘటనలో అందరం బాధపడ్డామని, మహిళల రక్షణలో రాష్ట్రం ముందువరుసలో ఉన్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారని గుర్తుచేశారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 66 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. ఆరు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, ఇన్ని తీసుకొచ్చిన ఘనత డీజీపీ మహేందర్‌రెడ్డిదని కొనియాడారు. వీటికోసం ఎమ్మెల్యేలు నిధులు ఇచ్చారని, ఆర్థికమంత్రి ఏమిస్తరో తెలియదని చమత్కరించారు. వీటికోసం ఎంత కేటాయిస్తే అంత మంచిదని చెప్పారు. 


ధైర్యం చెడితే రాష్ట్రం వచ్చేదికాదు

ఎన్నో ప్రతికూలతల మధ్య రాష్ట్రం సాధించాం. ఏ మాత్రం ధైర్యం చెడినా ఈ రాష్ట్రం వచ్చేది కాదు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కోయెలేషన్‌ ఇయర్స్‌ (సంకీర్ణ సంవత్సరాలు) పుస్తకంలో ప్రస్తావించారు. ‘ఇజ్రాయెల్‌లో ఓ ప్రొఫెసర్‌ తన దేశంకోసం నిరంతరం తాపత్రయపడినట్లు నువ్వు కూడా పడుతున్నావు. ఉద్యమాలు ప్రారంభించినోళ్లే.. ఆ కలను సాకారం చేసుకోవటం అతికొద్దిమందికే దక్కుతుంది. అందులో నువ్వు ఉండటం అదృష్టం’అని ప్రణబ్‌ స్వయంగా నాతో అన్నారు. 


కరంట్‌లో మనమే నంబర్‌వన్‌

24 గంటల విద్యుత్‌ సరఫరాను యావత్‌ దేశం పొగుడుతుంటే వీళ్లు (కాంగ్రెస్‌ సభ్యులు) వద్దంటున్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచుతారని అంటున్నారు. చార్జీలు తప్పకుండా పెంచుతాం. ఎందుకు పెంచాల్సి వచ్చిందో ప్రజలకు చెప్తాం. ఈరోజు తెలంగాణ కరంట్‌లో నంబర్‌ వన్‌గా ఉన్నదని  సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది. 


logo
>>>>>>