బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 02:14:51

యాసంగిలో ఏంవేద్దాం?

యాసంగిలో ఏంవేద్దాం?

  • నియంత్రిత సాగుపై నేడు సీఎం సమీక్ష
  • వానకాలం పంట కొనుగోళ్లపైనా చర్చ
  • అనంతరం రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం
  • అసెంబ్లీలో పెట్టే తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగువిధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి ఈ రెండు శాఖల మంత్రులు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు హాజరుకావాలని ఆదేశించారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏది వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? దేనితో నష్టం? తదితర అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్నదని, దీనివల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, శనివారం నాటి సమావేశంలో ఈ అంశంపైనా విస్తృతంగా చర్చ జరుగుతుందని చెప్పారు. కరోనా ముప్పు ఇంకా తొలుగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపైనా సీఎం సమీక్షించనున్నారు. ‘కరోనా నేపథ్యంలో యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సేకరించాం. ఇంకా కరోనా ముప్పు తొలుగలేదు. కాబట్టి వానకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి. ఆరు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుపాలి. ఇందుకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లుచేయాలి. పంట కొనుగోళ్ల తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బు చెల్లించాలి. దీనికోసం కావాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.  

సాయంత్రం క్యాబినెట్‌ సమావేశం

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. 13, 14 తేదీల్లో శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలను క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నది. దీంతోపాటు యాసంగిలో అమలుచేయాల్సిన నిర్ణీత పంటసాగు విధానం, ధాన్యం కొనుగోలుపై చర్చించే అవకాశం ఉన్నది.

13న అసెంబ్లీ, 14న మండలి సమావేశం

జీహెచ్‌ఎంసీ చట్టాల సవరణ, హైకోర్టు సూచనలతో పలు చట్టాల్లో మార్పులు చేసేందుకు మంగళవారం అసెంబ్లీ సమావేశం కానున్నది. 13న ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. శాసనమండలి ఈ నెల 14న ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.


logo