శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 06, 2020 , 03:20:49

ఎవరైనా చావులు కోరుకొంటరా?

ఎవరైనా చావులు కోరుకొంటరా?

  • వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారు
  • ఇదేం దిక్కుమాలిన రాజకీయం.. విపక్షాలపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రతిపక్షాలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా విపక్షాలు చేస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

దిస్‌ ఈస్‌ వెరీ సీరియస్‌ డెడ్‌ఫుల్‌ వైరస్‌. అది పట్టిందంటే మనిషి చస్తరు. ఏ గవర్నమెంటైనా చావును దాచిపెడ్తతా? చస్తే కాలపెడ్తాం. బొందపెడ్తాం. ఊరికి తీసుకెళ్తాం. ఇంత తెలివితక్కువగా మాట్లాడతరా..? ప్రజలు మాపై బాధ్యత పెట్టిం డ్రు. ఎట్లా కంట్రోల్‌ చేసుకోవాలి? ప్రజలను ఎట్లా కాపాడుకోవాల్నో మాకు తెలవదా? ఇంకో బాధేమంటే.. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిని అవమానపరుస్తున్నరు. మా రాష్ట్ర వైద్యశాఖ గొప్పగా పనిచేసింది. మా వైద్యులు గొప్పోళ్లు.. కంట్రోల్‌ చేసిండ్రు.. దినాం రాత్రి కష్టపడ్డరు అని వారిని మెచ్చుకోవాల్సింది పోయి.. ఇదేం దిక్కుమాలిన రాజకీయం? ఇంత చండాలంగా.. ఇంత నీచంగానా? ఛీ.. ఛీ.. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు వస్తయా? ఇది రాజకీయ డిమాండ్‌ అవుతదా? బుద్ధ్ది తక్కువ యవ్వారం కాకపోతే. కేసుల సంగతి హెల్త్‌ డిపార్టుమెంట్‌ చూసుకుంటది. 

తలకాయ లేనోళ్ళు.. 

మన దగ్గర కొంతమంది దరిద్రులు.. గవర్నర్‌ను కలిసిండ్రు.. మాట్లాడిండ్రు. నాకైతే చాలా బాధనిపించింది. మరణాలు లేవంటా.. మరణాలు కావాల్నా సన్నాసుల్లారా. ఇదేం దరిద్రమండి? మరణాలు కావాలా రాష్ట్రంలో..? మీ రాజకీయం పాడుగాను. ఇదేం దిక్కుమాలిన రాజకీయమండి. మరణాలు కావాలని కోరుతారండి.. తలకాయ లేనోళ్లు. ఇది ధర్మమేనా?

రైతులకు డబ్బు రాలేదని రుజువుచేస్తరా? 

దేశంలో ఇంకెక్కడైనా వందశాతం ధాన్యం, పంటల దిగుబడి కొనుగోలు చేశారా? రైతులు కూడా కాంగ్రెస్‌ నాయకుల చిల్లర రాజకీయాలకు లొంగిపోతే దెబ్బతింటారు. మాకు రైతుల పట్ల చిత్తశుద్ధి, అంకితభావం ఉంది. చెప్పినమంటే వంద శాతం చేస్తం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుచేసిన తర్వాత మిల్లుకు పోతది. అక్కడ అకౌంట్‌ అవుతది. అప్పుడు పౌరసరఫరాలశాఖకు సమాచారం వస్తది. వెంటనే రైతుకు డబ్బులు వేస్తరు. మే నెల అంతా పైసలు వస్తూనే ఉంటయి. రైతులకు లేని బాధ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు ఉంది. రైతులకు డబ్బులు పోతలేవంటూ మాట్లాడుతున్నరు. డబ్బులు రాలేదని ఎక్కడైనా చూపిస్తరా? 

కాంగ్రెస్‌ నాయకులను బఫూన్లుగ చూస్తున్నరు

ఏ అంశం ఎత్తుకోవాల్నో కూడా కాంగ్రెస్‌ వాళ్లకు తెలుస్తలేదు. వందశాతం పంటల దిగుబడిని కొనుగోలుచేసే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దానిని ప్రశంసించాలి. ఇచ్చు లు, కచ్చకాయలు తీస్తే ఎట్ల? ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఉచిత వినోదం పంచే బఫూన్లు, జోకర్లుగా ప్రజలు చూస్తున్నరు. ఇంకొకడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నయంటరు. మాట్లాడేందుకు బుద్ధి, జ్ఞానం ఉండాలి. రైతు ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ ఇండియాలో ఎక్కడైనా ఉందా? రైతుబీమా, రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు..  ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో మీరు జోకర్ల లెక్క మాట్లాడితే మిమ్మల్ని బఫూన్లు అనకుంటే ఏమంటరు. చిల్లర రాజకీయాలు వ్యవసాయరంగంలో చేయకండి. 

సిగ్గులేకుండా దీక్షలు.. 

మన పక్కకే ఉండే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. రాహుల్‌ గాంధీ స్వయంగా ప్రకంటించాడు. నిన్నగాక మొన్న కరీంనగర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ కూడా మాట్లాడిండు. వరికి మద్దతు ధర రూ. 2500 ఇస్తామన్నరు. ఇయ్యాళ రూ. 800, రూ.1000కు కొంటున్నరు. సిగ్గుచేటు. ఆ కొనేది కూడా ఎకరానికి 15 క్వింటాళ్లు. కడుమది వారి కర్మ అని వదిలేస్తున్నరు. వాళ్లు మన ములుగులో అమ్ముతున్నరు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఇంకో డంబాచారం చెప్పింది. 2లక్షల రుణం ఏకబిగిన మాఫీ చేస్తమన్నరు. ఇది వరకు దిక్కులేదు. మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో నరికిర్రు అయినా చెయ్యలేదు. సిగ్గులేకుండా ఇక్కడ దీక్షలు పడుతరు.  ఈ రాష్ట్రంలో కాంగ్రేసోళ్లు  చిల్లర రాజకీయాలకు అలవాటయ్యారు. బతుకమ్మ చీరలు పంచితే తగులబెడుతరు. పక్కకు పొల్లు పోసి దాన్ని తగులబెడుతరు. మెడ మీద తలకాయ ఉన్న రైతు ధాన్యం తగులబెడుతాడా. 7వేల సెంటర్లలో ఎంత మంది తగుల బెడుతున్నరు. 5లక్షల మంది రైతుల వద్ద కొన్నాం ఇప్పటికీ ధాన్యం. అందులో తగులపెట్టే వెదవలు ఎంతమంది. ఎందుకు తగులబెట్టాలి. ప్రభుత్వం వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఈ పాలసీ పెద్దదా, ఈ చిల్లరగాడెవడో వచ్చి చెప్పేది పెద్దదా.. రైతాంగం ఆలోచించాలి ఇవ్వాలి. 

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి

గొర్రెలు పంపిణీ చేస్తమన్నం.. చేసినం. రెండున్నర కో ట్ల గొర్రెలు ఉన్నయి. మత్స్యకారుల ఆదాయం పెంచినం.  ఒక్కో దగ్గర 20 కిలోల చేపలు పట్టుకొని మత్స్యకారులు సంతోషంగా దుంకుతున్నరు. ఉద్యమ సమయంలో అనేక ఊర్లలో ఏడ్చినం.. ఆ దుఃఖం మాకు తెలిసినందునే తెలంగాణ పల్లెలు ఆర్థికంగా సౌష్టవం కావాలి. పింఛన్లు తీసుకునే తల్లులు విరాళాలు ఇస్తున్నరు. గిలాంటి తెలంగాణల పనికిమాలిన పనులు చేస్తమంటే అది మీకే తెలివి తక్కువ. ప్రజలు మిమ్మల్నే బఫూన్లుగ చూస్తరు. ఆల్‌పార్టీలు సీఎస్‌ను కలుస్తామని వచ్చిండ్రు. ఆల్‌ పార్టీలంటే ఏమిటి? ఒకటి ఇంటిపార్టీ.. ఇంకొకటి పక్కింటి పార్టీ.. వారికి డిపాజిట్‌ కూడా రాదు. వాటిని పరిగణనలోకి తీసుకోవాలా. మీనింగ్‌ఫుల్‌ అపోజిషన్‌ ఉంటే టైం ఇస్తారు. ఇంత డర్టీగా.. దరిద్రంగా మాట్లాడేవాళ్లకు ఎవరు టైం ఇస్తరండి.

లాస్ట్‌ పాయింట్‌కు కాళేళ్వరం 

 లాస్ట్‌ పాయింట్‌కు రాబోతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. మన చరిత్రలో చూసినమా..? మన రాష్ట్రంలో ఎస్సారెస్పీ పుట్టినకాడి నుంచి..  ఆరుమాసాలు.. తడి ఆరకుండా కాకతీయకాల్వ పారింది. మొదటిసారి చరిత్రలో నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ కాళేశ్వరం.. ఇయ్యాల చెరువుల అలుగులు పార్తలేవా.. చూపెడ్దునా.. పోదామా..  

రోహిణి కార్తెలో నాట్లేస్తాం..

హుజూరాబాద్‌కు రోహిణి కార్తెలోనే నాటేసేదానికి నేను రాజేందర్‌ పోతాం. రేపో.. ఎల్లుండో.. అక్కడ ప్రయోగాత్మకంగా రోహిణి కార్త్తెలో మొదలు గావాలె.. సిద్దిపేటలో కూడ ప్రారంభం కావాలె.. రాళ్ల వానల బాధలు తప్పాలె. పంటల షెడ్యూల్‌ ముందుకు రావడానికి పోతున్నం.. మల్లన్నసాగర్‌ దగ్గర, కొండపోచమ్మదగ్గర ఈ పార్టీలు ధర్నాలు చేయలేదా..? రైతులను మిస్‌గైడ్‌ చేసిండ్రు. మాదగ్గర ఇవన్నీ వీడియోలున్నయి..  రేపు  గోదావరి జలాలొచ్చినపుడు వాటినంత డాక్యుమెంటేషన్‌ చేసి ప్రజల ముందు పెడ్తం.  

అన్నింటా ఓడిపోయారు..

మేం బాజాప్తా ఎన్నికలకు బోయినం.. గెల్చినం.. ఈవీఎంలు గోల్మాల్‌ జేసినమంటరు.. మరి తర్వాత అన్ని వరుసబెట్టి బ్యాలెట్లే.. మున్సిపల్‌, జెడ్పీ, కోఆపరేటివ్‌ ఎన్నికలు.. మరి అక్కడ ఎందుకు ఓడిపోతిరి.. మిమ్ముల్ని ప్రజలు తిరస్కరిస్తాండ్రు.. కానీ, ఏం సంస్కరించుకోవాల్నో.. ఏం బుద్ధి జెప్పుకోవాల్నో ఆలోచించకుండా.. అదే పనిగ అడ్డం పొడుగు మాట్లాడ్తమంటే.. గిదే పనైతది. 


logo