బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 02:17:47

దిగజారిన కాంగ్రెస్‌

దిగజారిన కాంగ్రెస్‌
  • అధికారమే పరమావధి కావొద్దు..
  • కావాల్సిన వారిని ప్రజలే గెలిపించుకుంటారు
  • ఎన్నిక ఏదైనా మెజార్టీ స్థానాలు మావే..
  • ఏ మాత్రం ధైర్యం చెడినా రాష్ట్రం వచ్చేదికాదు
  • తెలంగాణ విఫలప్రయోగమని చెప్పేందుకు కుట్ర..
  • నల్లగొండ జిల్లాలో డబ్బు ఖర్చు పెట్టేది ఎవరో ప్రజలకు తెలుసు
  • కాంగ్రెస్‌-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం..
  • గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజాస్వామిక రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, ఇందుకు ఎవరూ అతీతులుకారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల రెండోరోజున.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రజాదరణపొందిన ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లాంటి గొప్పగొప్ప నాయకులు సైతం ఓటమిని చవిచూడక తప్పలేదన్నారు. దేశాన్ని దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు శాతం ఓట్లకు దిగజారిపోయిందని, అయినా ఆ పార్టీ నాయకుల్లో మార్పురావడంలేదని విమర్శించారు. రాజకీయాల్లో అధికారమే పరమావధి కాకూడదని పేర్కొన్నారు. ప్రజలే తమకు కావాల్సినవారిని నియమించుకుంటారన్నారు. తమ పాలనకు ప్రజాతీర్పే గీటురాయిగా నిలుస్తున్నదని చెప్పారు. 2014లో 63 సీట్లు సాధిస్తే 2018లో 88 సీట్లు గెలిచామన్నారు. తెలంగాణ ప్రజలు 25 సీట్లు ఎక్కువిచ్చి రాష్ట్రాన్ని బాగుచేయాలని తమకు దిశానిర్దేశం చేశారని చెప్పారు.


ప్రణబ్‌ముఖర్జీ సైతం అభినందించారు 

సమైక్య పాలకుల చేతుల్లో తెలంగాణ పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా మారినస్థితిలో, తెలంగాణ ఏర్పాటయ్యే పనికాదన్న నిర్వేదంలో ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించామని సీఎం చెప్పారు. ప్రజల్లో కూడా ‘తెలంగాణ రాదు.. మన ఖర్మ ఇంతే’ అన్న భావన ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డెల్టా ప్రాంతానికి ఇచ్చిన తర్వాతే తెలంగాణ రైతులకు ఎరువులు ఇస్తామనేవారని, అసెంబ్లీలో కనీసం తెలంగాణ పదం ఉచ్ఛరించవద్దు అన్న ఆంక్షలను ఎదుర్కొన్నామని సీఎం గుర్తుచేశారు. ఎంతో మేధోమథనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి తానే స్వయంగా శ్రీకారం చుట్టానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆనాటి పరిస్థితులు గుర్తుచేసుకుంటే ఒక సినిమారీల్‌లాగా కండ్లముందు తిరుగతదని అన్నారు. ఏ మాత్రం ధైర్యంచెడినా ఈ రాష్ట్రం వచ్చేదికాదని అన్నారు. ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ‘ది కోయలిషన్‌ ఇయర్స్‌'లో ప్రస్తావించారు. ఇజ్రాయిల్‌లో ఓ ప్రొఫెసర్‌ తన దేశం కోసం నిరంతరం తాపత్రయపడినట్లు నువ్వు కూడా పోరాడుతున్నావు. ఉద్యమాలు ప్రారంభించినోళ్లే.. ఆ కలను సాకారం చేసుకోవటం అతికొద్దిమందికే దక్కుతుంది. అందులో నువ్వు ఉండటం అదృష్టం’ అని ప్రణబ్‌ తనతో చెప్పిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. 


ఎంత నీచానికైనా దిగజారే పార్టీ కాంగ్రెస్‌ 

కాంగ్రెస్‌ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతరని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మార్క్‌ఫెడ్‌ ఎన్నికల సందర్భంగా కిడ్నాప్‌ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ‘మేం ఎందుకు కిడ్నాప్‌ చేస్తం. వాళ్లు కాళ్లు మొక్కినాకూడా చేయం. దండం పెట్టినా చేయం. 94 శాతం సింగిల్‌విండో చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఎన్నిక ఏదైనా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటున్నం. ఇంకెందుకు కిడ్నాపులు?’ అని సీఎం ప్రశ్నించారు. దిష్టితగిలే గెలుపును తమ పార్టీ సొంతం చేసుకుంటున్నదని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎందుకు ఓడగొడుతున్నారో గుర్తించకపోవటం కాంగ్రెస్‌ నాయకుల ఖర్మ అన్నారు. సీఎల్పీ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధిని కోరుకోవటానికి బదులు.. ప్రభుత్వం కూలిపోతుందని తరుచూ వ్యాఖ్యానించడం ఆయన అధికార దాహానికి నిదర్శనమన్నారు. ఈవీఎం, బ్యాలెట్‌.. రెండు విధానాల్లో నిర్వహించిన ఎన్నికల్లో మెజార్టీతో గెలిచినప్పటికీ కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఇంకా లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.


కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగినందున.. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మైక్కె తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. లోపాయికారి ఒప్పందం చేసుకొని  మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేశాయని తెలిపారు. ఎన్నికలను అడ్డుకొనేందుకు ఆ పార్టీ నేతలు సర్వ ప్రయత్నాలు చేశారన్నారు. కోర్టుల్లో కొట్లాడి ఎన్నికలు అడ్డుకొనే ప్రయత్నం చేశారని విమర్శించారు. 


డబ్బుతో గెలిచిందెవరో ప్రజలకు తెలుసు

‘వరద వచ్చిందని ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వెళ్తే.. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే హెలికాప్టర్‌లో వచ్చినవా, ఇంత ఖర్చుపెట్టే బదులు కార్లో రావచ్చు కదా అంటరు. ఒకవేళ కార్లో పోతే.. కార్లో వచ్చినవా! హెలికాప్టర్‌లో పోతే ఏంబోవు.. మహా అంటే నాలుగు లక్షలు ఖర్చయ్యేది. ప్రజల బాధ నీకు కనబడుతలేదా? అంటరు. ఇలా రెండు రకాల స్టేట్‌మెంట్లు వాళ్లే ఇస్తరు’ అని సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి అన్నారు. రాజకీయాల్లో సహనశీలత అవసరమని చెప్పారు. ‘మేం గెలిస్తే నిజాయితీగా గెలిచాం. వేరే వాళ్లు గెలిస్తే డబ్బు పంచి గెలిచారు’ వంటి వ్యాఖ్యలకు అర్థంపర్థం లేదన్నారు. ‘నల్లగొండ జిల్లా రాజకీయ చరిత్రలో అతి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు.. డబ్బుతో అహంకారం ప్రదర్శించేది ఎవరు.. ఆ కుటుంబం ఎవరిదో ప్రజలందరికీ తెలుసు’ అ న్నారు. తాము తప్పుగా మాట్లాడితే ప్రజలే శిక్ష విధి స్తారని సీఎం చెప్పారు. 


పాలమూరు ప్రాజెక్టుకు వాళ్లే అడ్డంకి  

పాలమూరు ప్రాజెక్టుకు ఎలాంటి నిధులివ్వొద్దని ప్రభుత్వానికి నిధులిచ్చే సంస్థలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖలు రాశారని సీఎం గుర్తుచేశారు. వారి చర్యలపై హైకోర్టు చీవాట్లు పెట్టిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు తండ్లాడుతుంటే, వాళ్లు మాత్రం కేసులు వేస్తుండటం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఒకే అంశంపై డబుల్‌ స్టేట్‌మెంట్లు ఇస్తూ, మాట మార్చుతున్నారని సీఎం మండిపడ్డారు.


్రప్రతికూలతల మధ్య ప్రయాణం

తెలంగాణ వచ్చేవరకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ వచ్చినా కూడా అపాయింటెడ్‌ డే పేరును అడ్డుగాపెట్టి నాటి బీజేపీ సర్కార్‌ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఏడు మండలాలు, సీలేరు పవర్‌ప్లాంటును గుంజుకున్నదని తెలిపారు. ఇవన్నీ తలుచుకుంటే దుఃఖం వచ్చేదన్నారు. దీనికి నిరసనగా తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణబంద్‌కు పిలుపుఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇలాంటివి ఎన్నో చూశామని, మరెన్నో ప్రతికూలతల మధ్య ప్రయాణం మొదలుపెట్టామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫలప్రయోగమని చెప్పేందుకు జరిగిన కుట్రలను ఛేదించి ఇక్కడిదాకా వచ్చామని

తెలిపారు.   


logo
>>>>>>