గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 02:12:11

ఆధారాలు చూపిస్తే రాజీనామా

ఆధారాలు చూపిస్తే రాజీనామా
  • ‘తుమ్మిడిహట్టి’పై కాంగ్రెస్‌ ఒప్పందం చేసుకున్నదా?
  • అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఆధారాలు చూపిస్తారా?
  • అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టికి ముఖ్యమంత్రి సవాల్‌

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ‘ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్‌ నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ఎలాంటి అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒకవేళ చేసుకున్నట్టు ఆధారాలు చూపితే రాజీనామా చేస్తా’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సవాల్‌ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తులో లక్ష్మీ బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని పూర్తి చేసుకున్నదని గుర్తుచేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన ఆరోపణపై సీఎం కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. తుమ్మిడిహట్టిపై ఆనాడు అగ్రిమెంట్‌ కాలేదని, ప్రొసీజర్‌ లేదని.. ఉంటే చూపించాలని డిమాండ్‌చేశారు. తాము చేసుకున్న అంతరాష్ట్ర ఒప్పందంపై అసెంబ్లీలో చెప్పానని, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తే సభ నుంచి కాంగ్రెస్‌ నాయకులు పారిపోయారని, తాము సైతం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తానని అటే పోయారని ఎద్దేవాచేశారు. నాడు పారిపోయి, ఇప్పుడు ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు.   


ఎన్పీఆర్‌పై దీర్ఘకాలిక పోరాటం 

ఎన్పీఆర్‌ విషయంలో దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నిరంతరాయంగా అంకితభావంతో పోరాటం చేయాల్సి ఉంటుందని, దేశంలో భావసారూప్యత కలిగినవారిని సమీకరించి పోరాడుతామని చెప్పారు. ఇప్పటివరకు కేరళ, బెంగాల్‌ రాష్ట్రాలు స్టే ఇచ్చాయని, రాజస్థాన్‌వంటి రాష్ట్రాలు ఇంకా స్టే ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేరళ సీఎస్‌తో మాట్లాడారని, కేరళ, ఇతర రాష్ట్రాల కంటే మనం మెరుగైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్పీఆర్‌పై దేశంలో అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ ముందంజలో ఉంటుందని స్పష్టంచేశారు. అఫీషియల్‌ లాంగ్వేజ్‌ కమిషన్‌లో ఒకరిని నియమిస్తామని అక్బరుద్దీన్‌ అడిగిన క్లారిఫికేషన్‌కు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. వక్ఫ్‌బోర్డు పరిస్థితిపై వ్యక్తిగతంగా సమీక్ష నిర్వహిస్తానని, అక్బరుద్దీన్‌ను పిలుస్తామని పేర్కొన్నారు. 


రేటు పెంచకున్నా ఇసుకపై ఆదాయం 

ఉమ్మడి రాష్ట్రంలో ఇసుకపై రూ.40 కోట్ల ఆదాయమే వచ్చిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తాము నాటి నుంచి నేటి వరకు ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ఇసుక విక్రయాలు చేపట్టి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని తెలిపారు. అప్పుట్లో ఇసుక ఆదాయం నేతల జేబుల్లోకి వెళ్తే, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు వస్తున్నదని అన్నారు. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి రేటు పెంచకున్నా ఖజానాకు రూ.3000 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రమాదవశాత్తు కాలిపోయిన ఇండ్లకు డబ్బులు ఇస్తున్నామని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. కార్మికుల కసీన వేతనాలు కేంద్రం చట్టం ప్రకారం ఇస్తామని,  ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని స్పష్టంచేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మెతో ఏకీభవించబోమని, సమ్మెచేస్తే వారు ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టేనని తెలిపారు. ఏ జిల్లా పరిధిలో ఆ జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారని తెలిపారు. 


logo
>>>>>>