సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 16:30:43

మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే : సీఎం కేసీఆర్‌

మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. బీజేపీ వాళ్లకు లేకలేక అధికారం వచ్చింది. ఇంతకుముందు ఎన్డీఏకు వచ్చింది. యూపీఏ పాలనపై విసుగుతోనే దేశ ప్రజలు బీజేపీకి ఓటేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం లేకలేక రాలేదు. రాష్ర్టాన్ని సాధించుకుని మొదటిసారి పోటీ చేశాం.. అధికారంలోకి వచ్చామని సీఎం తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అట్టర్‌ప్లాఫ్‌ అయ్యాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని బీజేపీ తీవ్రంగా దుర్వినియోగం చేస్తోంది.

కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే కేంద్రం తెలంగాణకు ఇచ్చింది. పన్నులు వసూలు చేసే బాధ్యతను మాత్రమే కేంద్రానికి ఇచ్చారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని చట్టంలో చేర్చారు. సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌, జీఎస్టీ పేరుతో బీజేపీ రాష్ర్టాలకు నిధులను ఎగ్గొట్టాయి. వసూలు చేసిన పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వడం కేంద్ర దయాదాక్షిణ్యాలు కాదు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ర్టానికి ఏ సంవత్సరంలోనూ రూ. 10 వేల కోట్లు ఇవ్వలేదు. దేశానికి అన్నం పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీ తాతలా మారింది. బీజేపీ నేతలు నీచపు బుద్ధి మానుకోవాలి అని సీఎం హెచ్చరించారు. 


logo