శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 03:20:43

29 వరకు లాక్‌డౌన్‌

29 వరకు లాక్‌డౌన్‌

  • ఉపాయమున్నోడు అపాయంనుంచి తప్పించుకుంటడు 
  • ఆగస్టులోగా వ్యాక్సిన్‌ రావొచ్చు
  • దేశంలో మొదటి కంటైన్మెంట్‌ కరీంనగర్‌ 
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తెలంగాణ రాష్ట్రంలో మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. రాత్రి కర్ఫ్యూ రాష్ట్రమంతటా ఉంటుంది. దీనికి జోన్లకు సంబంధంలేదు. దయచేసి కచ్చితంగా ఫాలోకావాలి. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం 6 గం టల వరకే పనులు ముగించుకొని 6.45 వరకే ఇళ్లలోకి చేరుకోవాలి. లేకుంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కరోనాపై మనం విజయం సాధించాం. దీన్ని అతిక్రమిస్తే దెబ్బతింటాం. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం లాక్‌డౌన్‌, భౌతికదూరాన్ని పాటించడమే. దీన్ని కొందరు సోషల్‌ డిస్టెన్స్‌ అని రాస్తున్నారు. 

భౌతికదూరం అని రాద్దాం. సోషల్‌ డిస్టెన్స్‌ అంటే సాంఘిక బహిష్కరణలాగా ఉన్నది. బాగా లేదు. కొంచెం పంటి బిగువనో,ఒంటి బిగువనో కొద్దిగా ముందుకుపోతే  విజయం సాధిస్తాం. తక్కువ నష్టాలతో మన రాష్ట్రం, మన సమాజం బాగుపడే అవకాశం ఉంటది. కరోనా వచ్చిన తొలిరోజుల్లో దేశానికి ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. మన ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ కష్టపడి బెంగళూరులో 15వేల కిట్లను అర్జంటుగా తీసుకొద్దామనుకొని ప్రయత్నించారు. కానీ అక్కడ అధికారులు వాటిని పట్టుకొని రాష్ర్టానికి రాకుండాచేశారు. ఇప్పుడు అద్బుతమైన దశకు చేరుకున్నాం. 10 లక్షల కిట్లను ఆర్డర్‌ చేశాం. ఇప్పటికిప్పుడు 5.60 లక్షలు కిట్లు మన దగ్గర ఉన్నాయి. ఇంకొకరికి సాయంచేసే పరిస్థితిలో ఉన్నాం. 

తొలి కంటైన్మెంట్‌జోన్‌ కరీంనగర్‌

రాష్ట్రంలో 1096 మందికి కరోనా పాజిటివ్‌ కన్ఫర్మ్‌ అయింది. ట్రీట్‌మెంట్‌ పూర్తయి 628 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు 43 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. మన దగ్గర 439 మంది ట్రీట్‌మెంట్లో ఉన్నారు. కరోనాపై రాష్ట్రం ముందునుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందీ వ్యూహంతో చర్యలు తీసుకొన్నది. ఇందుకు కరీంనగర్‌ ఒక ఉదాహరణ. అప్పటికి దేశంలో గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు..ఎవ్వరికీ కంటైన్మెంట్‌ అనే పదం కూడా తెలియదు. దేశంలో మొదటి కంటైన్మెంట్‌ జోన్‌ కరీంనగర్‌. అక్కడికి వచ్చిన 11 మంది ఇండోనేషియన్లకు పాజిటివ్‌ వచ్చింది. వారిని గుర్తించి  ఢిల్లీ గవర్నమెంటును, కేంద్రాన్ని కూడా హెచ్చరించి పకడ్బందీ చర్యలు తీసుకొన్నాం.  అహోరాత్రులు కష్టపడి ప్రాణనష్టం జరుగకుండా కరీంనగర్‌ను మనం కాపాడుకున్నాం. ఈ రోజు మరణాల రేటు చూస్తే దేశంలో 3.34% ఉంటే, మన దగ్గర 2.64% ఉన్నది. యాక్టివ్‌ కేసుల్లోనూదేశ యావరేజ్‌ 69.21 శాతం ఉంటే మన దగ్గర 42.7% ఉన్నది. రికవరీ రేటులోనూ దేశ సగటు (27.40%)కంటే మనం (57.3%) మెరుగ్గా ఉన్నాం. 

ఓపిక పట్టాలి 

ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తొందరపడితే ఇక్కడికి రారు. అక్కడి నుంచి ప్రభుత్వం పంపించాలి. రవాణా సౌకర్యాలు కావాలి.వాళ్లను మనం తీసుకోవాలి. వాళ్లను క్వారంటైన్‌లో పెట్టాలి. ఉదాహరణకు దుబాయి నుంచి మనోళ్లు రావాలి. కేంద్రప్రభుత్వం చాలా కఠిన నిబంధనలు పెట్టింది. విమానం టికెట్‌ వచ్చేవాళ్లే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చాక  పెయిడ్‌ క్వారంటైన్‌లో పెట్టాలి. హోటల్‌లో ఉండి బిల్లు వాళ్లే కట్టుకోవాలి. ఎంతమంది వస్తరో? రారో తెలియదు. పెయిడ్‌ క్వారంటైన్‌ అంటే వచ్చేవాళ్లు ముందు మనకు చెప్పాలి. వచ్చేవాళ్లకు హోటల్‌ బుక్‌చేయాలి. వాళ్లను అక్కడ పెట్టాలి. 14 రోజులు టెస్టులు చేయాల్సిరావొచ్చు. ఇక్కడ మనం ఒప్పుకోవాలి. అందరూ సహకరించుకోవాలి. పరస్పరం ఓపిక పట్టాలి.

11 రోజుల్లో 18 జిల్లాలు గ్రీన్‌లోకి

కేంద్ర ప్రభుత్వం జోన్ల వారిగా పలు సడలింపులు ఇచ్చింది. వాటిని అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవు. అంతకన్న కఠినంగా నిబంధనలు పెట్టుకోవచ్చు. కానీ వాటిని వాళ్లు ఇచ్చిన నిబంధనలను కచ్చితంగా ఫాలో కావాల్సిందే. కేంద్రం జాబితాలో ఉన్నవాటిలో 5, 6 జిల్లాలు ఈ రోజుకే గ్రీన్‌ జోన్‌లోకి వెళ్తున్నాయి. మంత్రి ఈటల కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి లేఖ రాసి గ్రీన్‌ జోన్‌లోకి మార్పించాల్సి ఉంటుంది. వచ్చే 11 రోజుల్లో ఇప్పుడు ఆరెంజ్‌ జోన్లో ఉన్న 18 జిల్లాలు కూడా గ్రీన్‌జోన్‌లోకి వస్తాయి. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ఏరియాలు 35 ఉన్నాయి. హైదరాబాద్‌లో 19, ఇతర రెడ్‌జోన్‌ జిల్లాల్లో 16 ఉన్నాయి. ఈ రోజుతో 23 కంటైన్మెంట్‌ల సమయం పూర్తవుతుంది. వీటిని కూడా డినోటిఫై చేస్తారు. 12 కంటైన్మెంట్‌ జోన్లు మాత్రమే ఉంటాయి. 

రెడ్‌జోన్‌ జిల్లాలు:సూర్యాపేట, వరంగల్‌ అర్బ న్‌, వికారాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌,హైదరాబాద్‌  

గ్రీన్‌ జోన్‌ జిల్లాలు: యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూలు, పెద్దపల్లి

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, నిజామబాద్‌, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం, జనగామ, నారాయణపేట్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, గద్వాల  


logo