శనివారం 06 జూన్ 2020
Telangana - May 06, 2020 , 03:36:38

తెలంగాణలో లాక్‌డౌన్‌ 29 దాకా కొనసాగింపు

తెలంగాణలో లాక్‌డౌన్‌ 29 దాకా కొనసాగింపు

 • ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి.. 
 • ఏడు గంటలపాటు క్యాబినెట్‌ సుదీర్ఘ సమీక్ష
 • బెల్లం కొట్టిన రాయిలా కేంద్రం
 • రాష్ర్టాలకు కేంద్ర ఆర్థిక సహకారం ఏది? 
 • ఎన్నిసార్లు అడిగినా ఉలకరు.. పలుకరు
 • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఎందుకు పెంచరు?
 • రుణ చెల్లింపులను వాయిదా వేయరేం?
 • తమాషా మాటలు మాట్లాడితే నడువదు
 • ఇలాగైతే దేశం భారీ మూల్యం చెల్లిస్తుంది
 • వారు మరింత బాధ్యతగా  ఉండాలి: సీఎం
 • కేంద్ర మార్గదర్శకాల అమలు
 • మండలాలు, పల్లెల్లో దుకాణాలు ఓపెన్‌
 • పట్టణాల్లో విడుతల వారీగా అవకాశం
 • నేటి నుంచి పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్లు
 • రైతు రుణమాఫీకి నేడే నిధుల విడుదల
 • వలస కార్మికులు ఇక్కడే ఉండిపోవచ్చు
 • పేద లాయర్లకు 25 కోట్లు సాయం
 • 15న మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష
 • ఆర్టీసీ బస్సులపై అదేరోజు నిర్ణయం
 • గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోనే సడలింపులు
 • లాక్‌డౌన్‌పై కేంద్ర నిబంధనలు యధాతథంగా అమలు
 • రూరల్‌లో 100%.. అర్బన్‌లో 50% షాపులకు అనుమతి
 • 15 తర్వాత మరోసారి రివ్యూ: సీఎం కే చంద్రశేఖర్‌రావు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించుకోవాలంటూ కేంద్రం చెప్పిన మార్గదర్శకాలను తుచ తప్పకుండా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అయితే, వాటిని ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లకు మాత్రమే పరిమితం చేస్తామని.. రెడ్‌జోన్లలో నిబంధనలు కఠినంగానే అమలవుతాయని పేర్కొన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలో రెడ్‌జోన్లయిన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. నాకుతెలుసు హైదరాబాద్‌ సిటీవాళ్లు నామీద కోపానికి వస్తారు. కానీ వేరే గత్యంతరం లేకపోతున్నది.

‘ఇప్పటిదాకా చాలా స్ట్రిక్ట్‌గా అమలుచేశారు.. ఇక్కడ సడలింపులు ఇవ్వొద్దు.. దయచేసి నగరాన్ని కాపాడుకోవాలె’ అంటూ వైద్యులు, ఇతర ఉన్నతాధికారులు పట్టుబట్టిన్రు. రెడ్‌జోన్‌లో షాపులు ఓపెన్‌ చేసుకోవచ్చని కేంద్రంచెప్పింది కానీ, మనం మాత్రం ఈ ఆరుజిల్లాల్లో ఓపెన్‌ చేయడం లేదు. నిన్నటినుంచి దేశంలో ఓపెన్‌ అయిన రాష్ర్టాల్లో పరిస్థితిని చూశాం. పలుచోట్ల లాఠీచార్జీలు జరిగాయి. ఏం జరిగినా ఇన్నిరోజులు మనం చేసిన తపస్సు నీళ్లల్లో పోసినట్టవుతుంది. 15వ తేదీ వరకు చూద్దాం. అప్పటివరకు అనుభవాలొస్తాయి. సీఎం స్థాయిలో స్పెషల్‌ రివ్యూ మీటింగ్‌ ఉంటుంది. అందులో రివ్యూ చేస్తాం. ఆరు రెడ్‌జోన్లు తప్పితే మిగతా 27 జిల్లాల్లో సడలింపులు ఇస్తున్నాం. అన్ని షాపులు నడుస్తయ్‌. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రూరల్‌ ఏరియాల్లో అన్నిషాపులు తెరుస్తారు. అదే మున్సిపాలిటీల్లో ఫిఫ్టీ పర్సంట్‌ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయి. లాటరీ తీసి ఈరోజు యాభైశాతం, రేపు యాభైశాతం చొప్పున షాపులు తీస్తారు. భౌతికదూరం పాటించకుంటే తెల్లారే షాపులు క్యాన్సిల్‌ చేస్తాం. ప్రజలు, షాపులవాళ్లు ఈ సదావకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఎక్కడైనా మరీ అన్‌రూల్‌గా ఉంటే, మీడియా వాళ్లు దయచేసి వెంటనే రిపోర్టు చేయండి. తగిన చర్యలు తీసుకుంటాం. షాపులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరువరకూ తెరిచి ఉం టాయి. రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల దాకా గ్రీన్‌లేదు.. రెడ్‌లేదు.. ముప్ప య్‌ మూడుజిల్లాల్లో కర్ఫ్యూ ఉంటుంది. 

ఆహారంలో స్వావలంబన కోల్పోవద్దు

భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకు తిండిపెట్టే శక్తి ఏ దేశానికైనా ఉన్నదా? తెలంగాణ కంటే చిన్నదేశాలే వందకు పైచిలుకుంటాయి. వాటికంత శక్తి లేదు. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఆహారరంగంలో దేశం సాధించుకున్న స్వావలంబనను కోల్పోవద్దు. కరోనా కంటే పెద్ద ప్రమాదంలో పడతాం. వ్యవసాయరంగ పనులు యథాతథంగా కొనసాగుతాయి. వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, స్పేర్‌ పార్ట్స్‌ షాపులు ఎక్కడున్నా సరే అనుమతిస్తారు. ఫర్టిలైజర్‌ షాపులు, పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ షాపులు తెరిచి ఉంటాయి. నిత్యావసర షాపులు ఓపెన్‌గా ఉంటాయి. దాంతోపాటు సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్‌, గృహాలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌ షాపులు కూడా తెరిచి ఉంటాయి.  ఎలాంటి మత ప్రార్థనలకు, రాజకీయపార్టీల మీటింగ్‌లకు, ర్యాలీలకు అనుమతించేదిలేదు. 


ముంబై దుస్థితి హైదరాబాద్‌లో రావొద్దు

రెడ్‌జోన్‌లోఉన్న హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే భయంకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఏమాత్రం రిస్క్‌ తీసుకున్నా పాపం మూటకట్టుకున్న వాళ్లమవుతాం. మొత్తం 1,096 కరోనా కేసు లుంటే ఈ జిల్లాల్లోనే 726 (66 శాతం) ఉన్నాయి. 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఈ మూడు జిల్లాల్లోనే చనిపోయారు.. తాజాగా నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్‌ఎంసీ నుంచే వస్తున్నాయి. సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు రెడ్‌నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి వచ్చినట్టే. ఇక ఉండేవి జీహెచ్‌ఎంసీలోని మూడుజిల్లాలే. ఎక్కువ జనసాంద్రత ఉండేది ఈ జిల్లాల్లోనే. దాదాపుగా కోటికిపైగా జనాభా ఉంటుంది. ఇక్కడే కమ్యూనిటీస్ప్రెడ్‌ అయ్యే అవకాశంఉంది. ముంబైని చూస్తున్నాం. భయంకరంగా ఉన్నది.. ఆ దుస్థితి మనకు రావొద్దు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సౌత్‌ఇండియాలో హైదరాబాద్‌కు వస్తున్నామని విచారిస్తున్నారు.  ఉజ్వలమైన భవిష్యత్‌ ఉన్న రాజధానిని కాపాడుకుందాం. ఇలాంటి వైరస్‌ వచ్చినప్పుడు 70 రోజులు సైకిల్‌పాస్‌ అయితే చాలావరకు కంట్రోల్‌ అయి మన స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుందని గొప్పగొప్ప శాస్త్రవేత్తలు చెపుతున్న అభిప్రాయం. మన వైద్యశాఖకు పైచేయి వచ్చే అవకాశం ఉంటుంది. 

రిజిస్ట్రేషన్లు.. ఇసుక మైనింగ్‌కు అనుమతి 

ప్రభుత్వ సంస్థలన్నీ పనిచేస్తయ్‌. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖలో కార్యకలాపాలు కొనసాగుతాయి. రాష్ర్టానికి ఆదాయం తెస్తుంది కాబట్టి వందశాతం పనిచేస్తున్నది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతధంగా చేసుకోవచ్చు. కాకపోతే భౌతికదూరం పాటించాలె. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, సంబంధిత అధికారులు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలె. ఇసుక మైనింగ్‌ కూడా రేపట్నుంచి (బుధవారం) ప్రారంభిస్తారు. భవన నిర్మాణాలకు ఇసుక అవసరం ఉంటుంది కాబట్టి పనిచేస్తుంది. రవాణారంగానికి సంబంధించిన ఆఫీసులు అంతటా పని చేసుకోవచ్చు. వాహనాల యొక్క రిజిస్ట్రేషన్లు యథాతథంగా అమలు జరుగుతాయి.

లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలు

 • ఉత్పాదక, నిర్మాణ కార్యకలాపాలకూ అనుమతి

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో కేంద్రప్రభుత్వం పలు మార్పులు చేసింది. కేసుల ఉధృతినిబట్టి ప్రాంతాలకు రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా విభజించిన కేంద్రం ఆయా జోన్లలో కార్యకలాపాలపై కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జోన్లలోనూ అత్యవసర సేవలు కొనసాగనుండగా, ఇతర కార్యకలాపాల విషయంలో కూడా కొన్ని సడలింపులిచ్చింది.  కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో పాటించనున్న నేపథ్యంలో ఆ వివరాలు మరోసారి..

రెడ్‌జోన్‌

 • సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, అంతర్‌ జిల్లాతోపాటు జిల్లా లోపల బస్సు ప్రయాణాలు, బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్లపై నిషేధం.
 • కార్లలో డ్రైవర్‌ కాకుండా ఇద్దరు, ద్విచక్రవాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. 
 • పట్టణ ప్రాంతాల్లో సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లు, ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌లకు అనుమతి. 
 • మందులు, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు, వాటి ముడిసరుకుల ఉత్పత్తుల సంస్థలకు అనుమతులిచ్చారు.
 • నిరంతరం కొనసాగించాల్సిన ఉత్పత్తి యూనిట్లు వాటి సప్లయ్‌ చైన్లకు అనుమతి.
 • ఐటీ హార్డ్‌వేర్‌ తయారీ సంస్థలు పనిచేస్తాయి.
 • షిఫ్టులతో జూట్‌ పరిశ్రమలకు అనుమతి
 • ప్యాకేజింగ్‌ మెటీరియల్‌ తయారీ సంస్థలకు గ్రీన్‌సిగ్నల్‌. 
 • స్థానిక కూలీలతో పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి. 
 • పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాల అనుమతి.
 • పట్టణాల్లో అత్యవసరమా కాదా అన్నదానితో నిమిత్తం లేకుండా సింగిల్‌ షాపులు, కాలనీలు, నివాస గృహ సముదాయాల్లో ఉండే దుకాణాలకు అనుమతి. 
 • అత్యవసర సరుకుల అమ్మకాలకు మాత్రమే ఈ-కామర్స్‌ సంస్థలకు అనుమతి. 
 • 33 శాతం సిబ్బందితో ప్రైవేట్‌ సంస్థలు నడిపేందుకు అనుమతి. మిగిలినవారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం. 
 • అన్ని ప్రభుత్వ సంస్థలు పనిచేస్తాయి. డిప్యూటీ సెక్రటరీ ఆ పై స్థాయి అధికారులు అందరూ హాజరుకావచ్చు. మిగతా సిబ్బందిలో 33% మందికే అనుమతి. రక్షణ, భద్రతా సేవలు, వైద్య, కుటుంబ సంక్షేమం, పోలీస్‌, జైళ్లు, హోం గార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తు నియంత్రణ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌, కస్టమ్స్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్సీసీ, నెహ్రూ యువ కేంద్ర, మున్సిపల్‌ సేవలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. 
 • గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఇటుకల బట్టీలుసహా అన్ని పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. షాపింగ్‌ మాల్స్‌ తప్ప అన్ని దుకాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌.
 •  వ్యవసాయ కార్యక్రమాలకు ఆమోదం.
 • పశుపోషణ కార్యకలాపాలకు అనుమతి 
 • ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌తోసహా అన్ని ప్లాంటేషన్‌ కార్యక్రమాలకు అనుమతి.
 • అన్నిరకాల వైద్యసేవలు కొనసాగుతాయి. 
 • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్‌, క్యాపిటల్‌ మార్కెట్‌, క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీల సేవలు కొనసాగుతాయి. 
 • వృద్ధాశ్రమాలు, అనాథలు, వితంతువులు, మహిళా సంరక్షణ కేంద్రాలు పనిచేస్తాయి. 
 • అంగన్‌వాడీ కేంద్రాలకు అనుమతి.
 • విద్యుత్‌, నీరు, శానిటేషన్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఇంటర్నెట్‌, కొరియర్‌, పోస్టల్‌ సేవలు కొనసాగుతాయి.
 • ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, కాల్‌సెంటర్లు, శీతల గిడ్డంకులు, గోదాములు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలకు అనుమతినిచ్చారు. 
 • బార్బర్లు మినహా స్వయం ఉపాధి పొందే వ్యక్తులు పనిచేసుకొనేందుకు అనుమతి.

ఆరెంజ్‌ జోన్లు

 • కేవలం డ్రైవర్‌, ఒక ప్రయాణికుడితో క్యాబ్‌ సేవలకు అనుమతి.
 • అనుమతించిన కార్యకలాపాలకు అంతర్‌జిల్లా ప్రయాణాలకు ఆమోదం.
 • నాలుగు చక్రాల వాహనంలో డ్రైవర్‌ కాకుండా గరిష్ఠంగా ఇద్దరికి అనుమతి. ద్విచక్రవాహనాల్లో ఇద్దరు ప్రయాణించవచ్చు.

గ్రీన్‌ జోన్లు

 • జోన్లతో నిమిత్తంలేకుండా దేశవ్యాప్తంగా నిషేధం విధించిన కార్యకలాపాలకు మినహా మిగిలిన అన్నింటికీ అనుమతి. 
 • అన్ని జోన్లలో (కంటైన్మెంట్‌ జోన్లు మినహా) లిక్కర్‌, పాన్‌, టొబాకో విక్రయాలకు నిర్ణీతదూరం పాటించే షరతుపై అనుమతి. 
 • బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి. 
 • శుభకార్యాలకు 50 మందికి  అనుమతి.
 • అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే .. 
 • నిబంధనలు ఉల్లంఘించినవారికి ఏడాది వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ. ఉల్లంఘన వల్ల ప్రాణనష్టం సంభవిస్తే రెండేండ్ల జైలు శిక్ష.

అన్ని జోన్లలో నిషేధం ఉన్న రంగాలు

 • దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సేవలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా
 • స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్య, శిక్షణా సంస్థలు
 • హోటళ్లు, రెస్టారెంట్లు
 • సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, క్రీడా కాంప్లెక్సులు తదితరాలు
 • సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు
 • అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మతపరమైన కార్యక్రమాలు

పంటి బిగువునో..ఒంటి బిగువునో..

రాష్ట్రంలో రెడ్‌జోన్‌ జిల్లాలైన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. నాకు తెలుసు హైదరాబాద్‌ సిటీవాళ్లు నామీద కోపానికి వస్తారు. కానీ వేరే గత్యంతరం లేకపోతున్నది. ‘ఇప్పటిదాకా చాలా స్ట్రిక్ట్‌గా అమలుచేశారు.. ఇక్కడ సడలింపులు ఇవ్వొద్దు.. దయచేసి నగరాన్ని కాపాడుకోవాలె’ అంటూ వైద్యులు, ఇతర ఉన్నతాధికారులు చాలా పట్టుబట్టినారు. క్యాబినెట్‌ మీటింగ్‌లోనూ కారణాలను వివరించడంతోపాటు, ఏం చేయాలి అనేది చెప్పారు. వారిని అభినందిస్తూ దానిని ఫాలో కావాలని నిర్ణయించాం. కొంచెం పంటి బిగువనో, ఒంటి బిగువనో కొద్దిగా ముందుకుపోతే  విజయం సాధిస్తాం. రెడ్‌జోన్‌లో షాపులు ఓపెన్‌ చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది కానీ, మనం మాత్రం ఈ ఆరుజిల్లాల్లో ఓపెన్‌ చేయడం లేదు. నిన్నటినుంచి దేశంలో ఓపెన్‌ అయిన రాష్ర్టాల్లో పరిస్థితిని చూశాం. పలుచోట్ల లాఠీచార్జీలు జరిగాయి. ఏం జరిగినా ఇన్నిరోజులు మనం చేసిన తపస్సు నీళ్లల్లో పోసినట్టవుతుంది. 15 వరకు చూద్దాం. సీఎం స్థాయిలో స్పెషల్‌ రివ్యూ చేస్తాం. ఓపెన్‌ చేశాక దేశంలో నగరాల పరిస్థితి ఏమిటి? వైరస్‌ బిహేవియర్‌ ఎలా ఉన్నది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనరాష్ట్రంలోనూ గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇస్తున్నాం కాబట్టి, అక్కడ కూడా ఎట్లా ఉంటదో మనకు తెలుస్తది. ఆరు రెడ్‌జోన్లు తప్పితే మిగతా 27 జిల్లాల్లో సడలింపులు ఇస్తున్నాం. అన్ని షాపులు నడుస్తయ్‌..   

- సీఎం కేసీఆర్

త్వరలోనే వ్యాక్సిన్‌!

ఒక మంచి వార్త. రాష్ట్రంలో ప్రఖ్యాత జీనోమ్‌ వ్యాలీలో మొదటి దశలో స్థాపించిన రెండు మూడు ఫ్యాక్టరీల్లో ఒకటైన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. వారే కాకుండా హైదరాబాద్‌లో అతి పురాతనమైన బయలాజికల్‌ ఈ (బీఈ) ఎండీ మహిమా దాట్ల, శాంతా బయోటెక్‌ చైర్మన్‌ వరప్రసాదరెడ్డితో కూడా  నేను మాట్లాడాను. ఆగస్టు నెలవరకే కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని వారంతా అన్నారు.  చాలా సీరియస్‌గా పరిశోధన జరుగుతున్నదని చెప్పారు.  ఆగస్టు, సెప్టెంబర్‌లలో రెండు వ్యాక్సిన్‌లు తెస్తున్నామని, వందశాతం విజయం సాధిస్తామని చాలా విశ్వాసం వ్యక్తం చేశారు.  అనుకున్నట్లు మన తెలంగాణలోని జినోమ్‌ వ్యాలీ నుంచి ఆవిష్కరణలు వస్తే చాలా గ్రేట్‌. ప్రపంచానికే మనం రిలీఫ్‌ ఇచ్చిన వాళ్లం అవుతాం.

- సీఎం కేసీఆర్‌


logo