సోమవారం 01 జూన్ 2020
Telangana - May 06, 2020 , 03:20:51

కేసీఆర్‌ బతికున్నంతవరకు రైతుబంధు

కేసీఆర్‌ బతికున్నంతవరకు రైతుబంధు

  • పెట్టుబడిసాయం ఒక్కరూపాయి కూడా తగ్గించం
  • బుధవారం రూ.25 వేల వరకు రైతురుణ మాఫీ
  • రూ.2016 పింఛన్లు కచ్చితంగా పంపిణీ చేస్తం
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేసీఆర్‌ బతికున్నంతవరకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రైతుబంధు కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. పెట్టుబడిసాయాన్ని ఒక్కరూపాయి కూడా తగ్గించబోమని స్పష్టంచేశారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతుబంధు అందరికీ ఇస్తరా? అంటూ కొన్నిపత్రికల్లో రాస్తున్నరు. మేం వందశాతం ఇస్తం. పత్రికలవాళ్లు ఇక రాయకండి.. మీ సమయం, మీ ఇంకు వృథా చేసుకోకండి. ప్రభుత్వం తరఫున నేను స్పష్టంగా చెపుతున్నా. వర్షాకాలం పంటకు కూడా రూ.7 వేల కోట్లు బాజాప్తా ఇస్తం. వాళ్లకు పంటకు అందేటట్టు మంచిగ ఇస్తం’ అని చెప్పారు. ముఖ్యమంత్రి పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా రూ.25 వేల వరకు రైతురుణాలు ఉన్నవారికి ఒకే దఫాలో మాఫీ చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించిన్రు. 5.50 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది. అందుకు సంబంధించిన రూ.1,200 కోట్లు బుధవారం మంజూరుచేస్తున్నం. రెండు, మూడ్రోజుల్లో రైతుల అకౌంట్లలో జమవుతయి. ఇది రైతులకు మేమిచ్చిన కమిట్‌మెంట్‌. కచ్చితంగా నెరవేరుస్తం. 

ఇది రైతు రాజ్యం

తెలంగాణలో ఉన్నది రైతురాజ్యం. రైతులను ధనవంతులను చేసేదాకా, రైతుల అప్పులు తీరేదాకా, తమ పెట్టుబడి తమజేబుల్ల నుంచి పెట్టుకునేదాకా.. ఈ ప్రభుత్వం విశ్రమించదు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత కరంటు ఇచ్చే ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. దేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నరు. ఈ మధ్యకాలంలో కర్ణాటక ఇస్తుందని చెపుతున్నా ఇంకా సమాచారం లేదు. ఎక్కడ ఇచ్చినా 6నుంచి 8 గంటలే ఇస్తున్నరు. కానీ 24 గంటలపాటు నయాపైసా చార్జిలేకుండా నాణ్యమైన కరంటు ఇచ్చేది కేవలం తెలంగాణ మాత్రమే. మాకు చిత్తశుద్ధి ఉన్నది. 

ఎల్లయ్య చెపితేనో.. డిమాండు చేస్తనో ఇవ్వం.. మేం మాట చెప్పినం కచ్చితంగా ఇస్తం. పేదలపట్ల మాకున్న చిత్తశుద్ధిని ఆరునూరైనా అమలు చేస్తం. ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్లు రూ.2,016 పంపిణీ చేస్తం. దాంట్లో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.  భారత దేశంలో ఎప్పుడూ, గత చరిత్రలో రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వమే లేదు ఇప్పటికి. 40 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడూ, ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. మద్దతు ధర ఇచ్చి, వాళ్ల ఊళ్లకే వెళ్లి కొన్న సందర్భం లేదు.  రైతులు కూడా సంయమనం పాటించాలి. తలకుమాసినోళ్లు వచ్చి ఏదో చెప్తరు. ఆ రాజకీయ డ్రామాల్లో ఇరుక్కుంటే మీరే నష్ట పోతరు. ప్రభుత్వానికి చికాకు కల్పిస్తే ప్రభుత్వం వదిలేసిందనుకో ఎవరు కొంటరపుడు. ఈ రోజు బీహార్‌ నుంచి, చత్తీస్‌గడ్‌, చాలా చోట్ల నుంచి మక్కలు వస్తున్నాయి. మేం తక్కువ ధరకే రూ. 1100 లకే ఇస్తామని చెబుతున్నారు. అటువంటప్పుడు వ్యాపారులు, గాని ఇంకొగలు కాని అవ్వే కొనుక్కుంటరు. మా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశ్యంతోని వంద శాతం కొంటున్నాం.

వచ్చే వానకాలం సీజన్‌కు రైతులు సిద్ధంకావాలి. మన దగ్గర చాలా పెద్దఎత్తున వరిపంట వచ్చే ఆస్కారం ఉన్నది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలన్నీ గ్రీన్‌ జోన్‌లోకి మారిపోతాయి. అందుకే వ్యవసాయ కార్యకలాపాలు మొదలుపెడతం. జంటనగరాలు మినహాయిస్తే.. కొన్నిప్రాంతాలకు నేను కూడా పోతా. వ్యవసాయశాఖమంత్రి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ముమ్మరంగా పర్యటనలు చేస్తరు. రైతుబంధు కమిటీలను కూడా క్రియాశీలకంగా మారుస్తం. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుతం. సన్నరకం ఎక్కువగా పండిస్తం. కరోనా ఉన్నదని ఈసారి వందశాతం ధాన్యం కొనుగోలు చేసినం. కానీ, ప్రతిసారీ కొనడం సాధ్యం కాదు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే పంటలు పండించాలి. సన్నరకాలు కూడా దాదాపు 30-35 లక్షల ఎకరాల్లో నాట్లు వేసుకునేందుకు చాలా అద్భుతంగా విత్తనాలు సమకూర్చినం. ఎరువులు సిద్ధంగా ఉన్నయి. పెట్టుబడి ప్రభుత్వం ఇస్తది. ఇప్పటికే రూ.2,500 కోట్లు జమ అయినవి. మిగతావి కూడా త్వరలోనే ఇస్తం. 

నికార్సయిన రైతు తాలు అమ్ముతడా?

ఎవరైనా మంచిరైతు, నికార్సయిన రైతు తాలు అమ్ముతడా? నేను కూడా రైతునే. అది ధర్మమా? తాలు అమ్మి డబ్బులు ఇయ్యమని ఏ రైతయినా అడుగుతడా? అమ్మకూడదు. మనకు లత్త కొడ్తది... మిల్లర్లు కొన్న తర్వాత ఆ ధాన్యం ప్రభుత్వమే తీసుకుంటది. క్వింటాల్‌ వడ్లు తీసుకుంటే 67-68 కిలోల బియ్యం జోకాలి. తాలు తీసుకుంటే ఎంత జోకాలి? ఇది చిన్న వ్యవహారం.. స్థానిక నాయకుడు చేయాల్సిన పని. తెలివిగల్ల ఎమ్మార్వో, ఆర్డీవో ఉంటే తూర్పారబట్టిస్తే తాలుపోయి వడ్లు వస్తయి. రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు.. కానీ, కాంగ్రెస్‌ దరిద్రులు పోయి చెప్తరు. వాళ్లకాలంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉందనే భ్రమలోపోయి ఒక వివాదం చేద్దామనే తెలివి తక్కువ పని చేస్తున్నరు. ఈ రాష్ట్రంలో రైతుధాన్యం మీద ధర్నా చేసేందుకు సిగ్గుపడాలి. కాంగ్రెస్‌, బీజేపీ పాలించే రాష్ర్టాల్లో ఒక్కదగ్గరైనా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నరా? కేవలం ఒకే ఒక్కరాష్ట్రం వందశాతం కొనుగోలు చేస్తుంటే ఏ మొహం పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నరు. ఎట్ల మాట్లాడతరు? కాంగ్రెస్‌ పాలనలో ఎప్పుడైనా కొన్నరా? దేశంలో ఎక్కడైనా కొంటున్నరా? ఛత్తీస్‌గఢ్‌లో మీరు వాగ్దానం చేసి ఎందుకు కొనుగోలు చేస్తలేరు?


logo