గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 28, 2021 , 21:18:01

సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే

సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్ర‌తి ఆలోచ‌న ప్ర‌జ‌ల అభివృద్ధి కోణంలోనే ఉంటుంద‌ని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేర‌కు నూతన సెక్రటేరియట్, జిల్లాల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పై ఆర్అండ్‌బీ శాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ, ఆర్కిటెక్ట్ లతో ఆర్అండ్‌బీ కార్యాలయంలో మంత్రి గురువారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం అనుకున్న సమయానికి పూర్తి కావాలన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం పనులు జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. నిర్మాణానికి ఏయే సామగ్రి అవసరమో నెలలోపు ఫైనల్ చేసుకుని వాటిని సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. సమకూర్చుకునే మెటీరియల్‌ను ఐదు పేజ్ లలో ఫైనలైజ్ చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 

ఫిబ్రవరి మొదటి వారంలో చేప‌ట్టే ఫస్ట్ పేజ్‌లో స్టోన్, డోమ్, జీఆర్సీ(గ్లాస్ రెయిన్ ఫోర్స్ కాంక్రీట్), రెయిలింగ్స్, ఫౌంటైన్. రెండో వారంలో చేప‌ట్టే రెండో ఫేజ్‌లో వుడ్ వర్క్, లిఫ్ట్, జనరేటర్, ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌, ఏసీ యూనిట్స్(MEP). మూడో వారంలో చేప‌ట్టే మూడో ఫేజ్‌లో ఫర్నిచర్, విండోస్, సీలింగ్ వర్క్స్. నాలుగో వారంలో చేప‌ట్టే నాలుగో పేజ్‌లో శానిటరీ, పెయింటింగ్స్, ఎలక్ట్రికల్, నెట్ వర్కింగ్, సీపీ, ఆడియో, వీడియో కాన్ఫరెన్స్. మార్చి మొదటి వారంలో చేప‌ట్టే ఐదో పేజ్‌లో మిగతా అలంకరణ పరికరాలను స‌మ‌కూర్చుకోవాల‌న్నారు.

ఎప్పటికప్పుడు పని తీరును మానిటరింగ్ చేసుకోవడానికి ఆర్ అండ్ బి అధికారులు, నిర్మాణ సంస్థ,ఆర్కిటెక్ట్ తో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా పనిలో జాప్యం జరగకుండా పూర్తి ప్రణాళిక బద్దంగా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మెయిన్ గేట్, ప్రహరిగోడ గ్రిల్స్ కు సంబంధించిన ఫైనల్ నమూనాను వారం రోజుల్లో అందించాలని ఆర్కిటెక్ట్ ఆస్కార్ ను మంత్రి ఆదేశించారు. ఫౌంటైన్ నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజైన్లను పరిశీలించాలని నిర్మాణ సంస్థ వారికి సూచించారు. వీలైతే ఢిల్లీ వెళ్లి అక్కడి ఫౌంటైన్‌ను పరిశీలించి రావాలన్నారు.

ఇప్పటికే నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కలెక్టరేట్లలో ఫర్నిచర్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు అన్ని కలెక్టరేట్లు నిర్మాణ పూర్తి దశలో ఉన్నాయని, భూపాలపల్లి, మహబూబబాద్, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని చాటి చెప్పే విధంగా, ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారకచిహ్నం వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీతో అన్నారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, వసంత్ నాయక్, పలువురు ఈఈలు షాపూర్ పల్లోంజి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ ఆస్కార్, పలువురు పాల్గొన్నారు.

VIDEOS

logo