బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 13:51:27

రేపు సాగునీటిశాఖ‌పై, ఎల్లుండి ఆర్అండ్‌బీశాఖ‌పై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష‌

రేపు సాగునీటిశాఖ‌పై, ఎల్లుండి ఆర్అండ్‌బీశాఖ‌పై సీఎం కేసీఆర్‌ స‌మీక్ష‌

హైద‌రాబాద్ : రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సాగునీటిశాఖ ప్రాధాన్య‌త‌ను పునర్‌వ్య‌వ‌స్థీక‌రించి బ‌లోపేతం చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం నీటిపారుద‌ల‌శాఖ చిలువ‌లు, ప‌లువ‌లుగా ఉంది. భారీ, మ‌ధ్య‌త‌ర‌హా, చిన్న‌త‌ర‌హా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీల పేరుతో విభ‌జించి ఉంది. ఇదంతా ఒకే గొడుగు కిందికి రావాల‌ని త‌ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ ప‌టిష్టంగా ఉంటుందని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ర్టంలో రెండు కీల‌క‌మైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యుల‌తో సీఎం రేపు, ఎల్లుండి విస్ర్త‌త‌స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నీటి పారుద‌ల‌శాఖ‌పై అదేవిధంగా ఎల్లుండి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆర్అండ్‌బీశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 

స‌మైక్య రాష్ర్టంలో నీటిపారుద‌ల రంగంలో తెలంగాణ దారుణ‌మైన ప్రాంతీయ వివ‌క్ష‌కు గురైందన్న సీఎం గోదావ‌రి, కృష్ణా న‌దుల మ‌ధ్య ఉన్న జీవ‌గ‌డ్డ తెలంగాణ కాబ‌ట్టే ఈ ప్రాంతానికి పుష్క‌ల‌మైన నీటి వ‌స‌తి క‌ల్పించే అవ‌కాశం ఉంద‌న్నారు. స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌తో ప్ర‌ణాళిక‌లు వేసి వాటిని అమ‌లు చేయ‌డంతో ప్ర‌త్యేక రాష్ర్టంగా ఏర్ప‌డిన ఆరేళ్ల‌లోనే నీటి పారుద‌ల‌రంగంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించింద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేప‌ట్ట‌డం, చెరువులు పున‌రుద్ధ‌రించ‌డం వంటి చ‌ర్య‌ల‌తో సాగునీటి స‌మ‌స్య శాశ్వ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని తెలిపారు. సాగునీటి ల‌భ్య‌త పెరిగి పంట‌లు పుష్క‌లంగా పండుతున్నాయన్నారు. ఆయ‌క‌ట్టు పెర‌గ‌డంతో వ్య‌వ‌సాయ సాగు విస్త‌రించింద‌న్నారు. 

2019-20 యాసంగిలో తెలంగాణ నుంచే దాదాపు 55 శాతం ధాన్యం సేక‌రించిన‌ట్లు ఎఫ్‌సీఐ ప్ర‌క‌టించ‌డం తెలంగాణ వ్య‌వ‌సాయంలో సాధించిన పురోగ‌తికి నిద‌ర్శ‌నమ‌ని సీఎం అన్నారు. తెలంగాణ గొప్ప వ్య‌వ‌సాయ రాష్ర్టంగా రూపుదిద్దుకుంటోందన్నారు. వ్య‌వ‌సాయానికి ప్రాణాధారం సాగునీరు. రాష్ర్టంలో సాగునీటి రంగానికి ప్రాధాన్య‌త పెరిగింది. ఈ నేప‌థ్యంలో సాగునీటిశాఖ ప్రాధాన్య‌త‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించి బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నీటిపారుద‌ల శాఖ‌ను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి ఒక్కో దానికి ఒక్కో సీఈని ఇంఛార్జ్‌గా నియ‌మించాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలిపారు. సీఈ ప‌రిధిలోనే ప్రాజెక్టులు, రిజ‌ర్వాయ‌ర్లు, లిఫ్టులు, కాలువ‌లు, చెరువులు, చెక్‌డ్యాంలు స‌మ‌స్తం ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ముసాయిదా త‌యారు చేయాల‌ని గ‌త‌వారం జ‌రిగిన స‌మీక్ష‌లో అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ఆదేశించారు.


logo