శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:20

సత్ప్రవర్తన ఉన్న ఖైదీలను విడుదల చేయండి

సత్ప్రవర్తన ఉన్న ఖైదీలను విడుదల చేయండి

  • పోలీసు శాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
  • రెండ్రోజుల్లో మార్గదర్శకాలు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదలచేయాలని పోలీస్‌శాఖను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన జాబితా రూపొందించాలని సూచించారు. బుధవారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేదీ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. 

రెండురోజుల్లో గైడ్‌లైన్స్‌!

ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో విడుదలకు అర్హత కలిగిన ఖైదీల వివరాలు, మార్గదర్శకాలపై జైళ్లశాఖ కసరత్తు చేస్తున్నది. గైడ్‌లైన్స్‌ను రెండురోజుల్లో రూపొందిస్తామని జైళ్లశాఖ డీజీ రాజీవ్‌త్రివేది ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఏయే క్యాటగిరీలు, ఎలాంటి వారిని విడుదల చేయాలనేది ఈ మార్గదర్శకాల్లో ఉంటుంది. దీనిప్రకారం అర్హులైన ఖైదీల జాబితా రూపొందిస్తారు. దానిని జైళ్లశాఖ డీజీ, ఇతర ముఖ్యఅధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం జాబితాను సీఎం ఆమోదంకోసం పంపుతారు. క్యాబినెట్‌ అనుమతి తర్వాత గవర్నర్‌ ఆమోదముద్రపడిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.

ఎంపీ సంతోష్‌ హర్షం

సీఎం ఆదేశాలపై ఎంపీ సంతోష్‌కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. ‘చర్లపల్లి జైలుకు వెళ్లినప్పుడు అక్కడి ఖైదీలు మంచి ప్రవర్తన ఉన్నవారిని విడుదలచేయాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లా. ఆయన ఔదార్యంతో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితా తయారు చేయాలని ఆదేశించడం ఆనందంగా ఉన్నది’ అని ట్వీట్‌చేశారు.


logo