సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 02:02:42

కేంద్రం నుంచి కోతలే

కేంద్రం నుంచి కోతలే
  • ప్రత్యేకంగా నిధుల కేటాయింపుల్లేవు
  • విద్యాశాఖకు ఇతరశాఖల నిధులు
  • పీఆర్సీపై త్వరలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం
  • శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి వచ్చేవాటిలో మినహాయింపులు, రద్దు వంటివాటిని వెంటనే అమలుచేస్తున్న కేంద్రప్రభుత్వం.. నిధుల విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నదని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రనుంచి కోతలు తప్ప.. నిధులు రావడం లేదని తెలిపారు. బడ్జెట్‌ సమావేశంలో భాగంగా మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆర్థికమాంద్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామ ని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వం లో ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పా టుపడుతున్నదన్నారు. బడ్జెట్‌పై ప్రజ లు హర్షం వ్యక్తంచేస్తుంటే..ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా కన్పిస్తున్నదని విమర్శించారు. కేంద్రం నుం చి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధు ల్లో కోత పెడుతున్నదని, ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీఎస్టీ బకాయిలు రూ.9,033 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. రాష్ట్ర అప్పులను జీఎస్డీపీని దృష్టిలోపెట్టుకొని చూడాలని సూ చించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి 21.3 శాతానికి లోబడే అప్పులు తీసుకున్నామన్నారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి చేయాలనేది సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ, ఎంపీల నిధులను పాఠశాలల అభివృద్ధికి ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. విద్యారంగానికి 9.4శాతం నిధులు కే టాయించారనడంలో వాస్తవం లేదని, అనేక శాఖల నుంచి విద్యారంగానికి బడ్జెట్‌లో 12.4శాతం నిధులు ఖర్చుచేస్తున్నట్టు వివరించారు. తెలంగాణ ఏర్పడ్డాక లక్షా 23వేల మంది కొత్తగా ఉద్యోగాల్లో నియమించినట్టు చెప్పారు. పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ అతి త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మండల, జిల్లా పరిషత్‌లకు కూడా గ్రామపంచాయతీ తరహాలో నిధులు కేటాయిస్తామని.. 15వ ఆర్థికసంఘం ఈమేరకు రాష్ట్రాలకు అవకాశం కల్పించిందని హరీశ్‌రావు తెలిపారు. కొత్త పంచాయతీల్లో రేషన్‌దుకాణాలను ఏర్పాటు చేసే అంశంపై సివిల్‌సప్లై శాఖ కసరత్తు చేస్తున్నదని.. ఈ ఏడాది రూ.18 వేల కోట్లతో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక నాలుగు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ఏర్పాటుచేశామని, అన్ని ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో దశలవారీగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 


కుదుటపడుతున్న ఆర్టీసీ :అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

మూడు నెలలుగా అమలుచేస్తున్న సంస్కరణల వల్ల టీఎస్‌ఆర్టీసీ కుదుటపడుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో  ఎమ్మెల్యే అబ్రహం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చా రు. గతంలోనెలకు రూ.11కోట్లుగా ఉన్న ఆ దాయం ప్రస్తుతం రూ.12.5 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడానికి ఆర్టీసీలో 1,334 అద్దెబస్సులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.  


1685 మందికి ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌:సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ముఖ్యమంత్రి విదేశీ ఉపకార వేతన పథకం కింద 1,685 మంది మైనార్టీ విద్యార్థులు లబ్ధిపొందినట్టు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు షకీల్‌, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, స్టీఫెన్‌సన్‌ ఎల్విస్‌, కౌసర్‌ మొయినుద్దీన్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. షెడ్యూల్‌ కులాలు, మైనార్టీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. 


నల్లమలలో పగటిపూట సఫారీ:పర్యాటకశాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌

నల్లమల అటవీప్రాంతాన్ని పర్యావరణ, పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కాటేజీలు నిర్మించినట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. పగటిపూట సఫారీపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద అచ్చంపేటలో అభివృద్ధికి రూ.56.84కోట్లు ఇచ్చిందన్నారు. 


18,501 మందికి శిక్షణ: కార్మికశాఖ మంత్రి  మల్లారెడ్డి 

రాష్ట్రంలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం కింద మొత్తం 18,501 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మొత్తం శిక్షణ పొందినవారిలో 5,964 మందికి ఉపాధి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ పథకం కింద రూ.22.94 కోట్లు వ్యయంచేసినట్టు వెల్లడించారు.


వేగంగా డబుల్‌ ఇండ్లు:మంత్రి వేముల 

డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి కేంద్రం 14 శాతమే నిధులు ఇస్తున్నదని, మిగతావి  రాష్ట్రం భరిస్తున్నదని గృహ నిర్మాణశాఖ  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. 2 లక్షల ఇం డ్లకు టెండర్లు పిలువగా,40 వేల ఇండ్లు పూర్తయ్యా యని, 1.1 లక్షల ఇండ్లు తుదిదశలో ఉన్నాయన్నారు.


1.7 లక్షల బీసీలకు గురుకుల విద్య

ఉమ్మడిరాష్ట్రంలో 19 గురుకులాలే ఉండగా, స్వరాష్ట్రంలో 2015-16లో 119 గురుకులాలను  ఒకేసారి ప్రారంభించామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో  6,500 మంది బీసీ విద్యార్థులు చదువుకొంటే తెలంగాణలో 1.7 లక్షల మంది చదువుతున్నారన్నారు. 


రిజర్వేషన్లపై గతంలోనే తీర్మానం 

గిరిజన ఆదివాసీ రిజర్వేషన్ల పెంపుపై గతంలోనే అసెంబ్లీ తీర్మానంచేసి కేంద్రానికి పంపిందని, అది కేంద్రం పరిశీలనలో ఉన్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఎస్సీ, మైనార్టీ, గిరిజన, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పద్దులపై అసెంబ్లీలో సభ్యులు చర్చించారు. మంత్రుల వివరణ అనంతరం సభ ఆమోదించింది. 


logo