గురువారం 09 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:08:04

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

  • రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసిన సీఎం కేసీఆర్‌.. గవర్నర్‌ పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రికి గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు, తెలంగాణ అవతరణ దినోత్సవం ఒకేరోజు కావడం ఆనందంగా ఉన్నదని అన్నారు. జూన్‌2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి అదేరోజు పుట్టిన తాను గవర్నర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వారిద్దరి మధ్య రాష్ట్ర అవతరణకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 

స్వాతంత్య్ర పోరాటం తర్వాత సుదీర్ఘకాలం నడిచిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం నిలుస్తుందని గవర్నర్‌ తమిళిసై అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని.. వారి త్యాగఫలమే తెలంగాణ ఉద్యమం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ర్టావతరణ దినోత్సవం రోజున అమరులకు నివాళులర్పించిన తర్వాతే పతాకావిష్కరణ చేస్తామని వెల్లడించారు. సీఎం  వెంట రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు,  ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, దానం నాగేందర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.logo