ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 20:54:26

హైకోర్టుకు అన్ని వివ‌రాలు ఇవ్వండి: సీఎం కేసీఆర్‌

హైకోర్టుకు అన్ని వివ‌రాలు ఇవ్వండి: సీఎం కేసీఆర్‌

హైద‌రాబాద్‌: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో ఆ వైరస్ విస్త‌రిస్తున్న తీరు, దాన్ని‌ నియంత్రించ‌డానికి తీసుకుంటున్న చర్యలు త‌దిత‌ర అంశాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి ఈటల రాజేంద‌ర్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నివారణపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. దీంతో కరోనాపై వాస్తవాలను అఫిడవిట్‌ రూపంలో హైకోర్టుకు సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైకోర్టు అడిగిన ప్రతి వివరాన్నీ, చేస్తున్న పనినీ తెలియజేయాల‌ని సూచించారు.

అదేవిధంగా ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు హైకోర్టు 87 పిల్స్‌ను స్వీకరించిందని చెప్పారు. నిత్యం కోర్టు విచారణవల్ల ఇబ్బంది కలుగుతున్న‌ద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్లిష్ట సమయంలో పని వదిలి కోర్టు చుట్టూ తిరగడానికే సమయం కేటాయించాల్సి వస్తోందని చెప్పారు. దీనివల్ల విధులకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నామని తెలిపారు.

కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా నియంత్రణ మ‌న రాష్ట్రంలోనే మెరుగ్గా ఉందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రంలోనే మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాము శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని సీఎంకు వివరించారు. ఎంతమందికైనా వైద్యం అందించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రతిరోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని, ఇంత చేసినా హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండటం బాధ కలిగిస్తోందని సీఎం వద్ద అధికారులు వాపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo