బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 14, 2020 , 02:15:24

చుక్కనీరు వృథాపోవద్దు

చుక్కనీరు వృథాపోవద్దు
  • ఉమ్మడి కరీంనగర్‌లో 161 చెక్‌డ్యాంలు..
  • మే చివరినాటికి పూర్తిచేయాలి
  • కాళేశ్వరం నుంచి ఎస్సారార్‌ వరకు టూరిజం సర్క్యూట్‌
  • కరీంనగర్‌ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • మీడియాకు వెల్లడించిన మంత్రి ఈటల రాజేందర్‌

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకొని.. ఒక్క చుక్క కూడా వృథా పోకుండా ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి వివిధ వాగులపై 161 చెక్‌డ్యాంలను నిర్మించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఈటల, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. సీఎంతో భేటీలో ప్రధానంగా సాగునీటిరంగంపై సమీక్ష జరిగిందని వెల్లడించారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు తొలిఫలాలు అందుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రతి అంగుళానికి సాగునీరు అందేవిధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వివిధ వాగులపై 161 చెక్‌డ్యాంలను నిర్మించాలని సూచించారన్నారు. సుమారు రూ. 1,200 కోట్లతో చేపట్టే ఈ చెక్‌డ్యాంలను రానున్న మే చివరినాటికి పూర్తిచేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని సీఎం తెలిపారని చెప్పారు. ఆ మేరకు కావాల్సిన ప్రతిపాదనలు, టెండర్ల కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తామని, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో రెండు, మూడు రోజుల్లోనే సమావేశం జరిపి ఇంకా కొత్తగా చెక్‌డ్యాంలు అవసరమైన చోట ప్రతిపాదనలు తీసుకొని, వాటిని కూడా మంజూరు చేసుకుకొంటామని మంత్రి ఈటల అన్నారు. 


ఎక్కడ చెక్‌డ్యాం అవసరమైనా చేపట్టాలని సీఎం సూచించారని తెలిపారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ప్రతి అంగుళానికి సాగునీరు ఇచ్చేందుకు ఎన్ని డబ్బులైనా మంజూరుచేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. చెక్‌డ్యాంల నిర్మాణంతోపాటు నీరు వృథా కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని పనులను ఈ ఎండాకాలంలోపు పూర్తిచేసి జూన్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించిన మేరకు చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. ఇప్పటికే కరీంనగర్‌ వాటర్‌హబ్‌గా మారిందనీ, ఈ నేపథ్యంలో ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని పేర్కొన్నారు. లక్ష్మీ బరాజ్‌ నుంచి మొదలుకొని శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు వరకు.. కాళేళ్వరం ప్రాజెక్టు పొడవునా టూరిజం సర్క్యూట్‌ను డెవలప్‌చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయన్నారు. 


ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపుతున్నారనీ, దేశం అబ్బురపడేలా టూరిజం అభివృద్ధిచేస్తామని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రం, ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటిదని.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న కలెక్టరేట్‌ స్థానంలో బ్రహ్మాండమైన కలెక్టరేట్‌ కట్టడానికి నిధులను మంజూరుచేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. కరీంనగర్‌ను హరితనగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారని మంత్రులు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, మేయర్‌ సునీల్‌రావు, గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo