బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 18:40:48

యువతను మభ్య పెట్టొద్దు : సీఎం కేసీఆర్‌

యువతను మభ్య పెట్టొద్దు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : నిరుద్యోగం పేరిట యువతను మభ్యపెట్టొద్దని విపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిరుద్యోగ సమస్య ఉందన్నారు సీఎం. మన దగ్గర ల్యాబర్‌ పదానికి సరైన నిర్వచనం లేదని సీఎం తెలిపారు. కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పి యువతను మభ్య పెట్టకండి అని చెప్పారు. డిఫెన్స్‌, రైల్వే, బ్యాంకింగ్‌ రంగాల్లోకి మన యువత వెళ్లడం లేదు. ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో యువతకు తెలియజేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాను ఎక్కడా చెప్పలేదని సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోతే మనకు లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌లో దాదాపు 7 లక్షల మంది పని చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించి లక్షల మంది బతుకుతున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రం వదిలి పరాయి దేశాలు పోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు రూ. 500 సంపాదిస్తే.. దుబాయి పోయి రూ. 10 వేలకు పని చేస్తున్నారు. అప్పులు చేసి దుబాయి పోయి తిరిగి వచ్చారని సీఎం అన్నారు. 


logo