బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 02:03:22

మనమంతా ఒక్కటే!

మనమంతా ఒక్కటే!

  • దేన్నైనా ఎదుర్కొంటాం 
  • కరోనాపై ఏకమైన యావత్‌ తెలంగాణ
  • వైద్య సిబ్బందికి, ఇతర ఉద్యోగులకు సంఘీభావ సంకేతంగా మార్మోగిన చప్పట్లు
  • జనతా కర్ఫ్యూకు సకల జనుల మద్దతు 
  • ఆగిన ప్రజారవాణా వ్యవస్థ
  • దుకాణాలు, మాల్స్‌ సర్వం మూసివేత 
  • సీఎం పిలుపునకు అపూర్వ స్పందన

ప్రత్యేక ప్రతినిధి/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా అమలైన 24 గంటల జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ఆదివారం ఉదయం నుంచే ఊరూ, వాడ, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం మొత్తం అష్టదిగ్బంధమైంది. అన్ని దిక్కులా జనసంచారం స్తంభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఆదేశాలతో విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. దుకాణాలు, మాల్స్‌ సర్వం మూసివేశారు. రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. కరోనా వైరస్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, రెవెన్యూ, పోలీసులతోపాటు ఇతర ఉద్యోగులకు సంఘీభావ సంకేతంగా సాయంత్రం ఐదు గంటలకు ఐదు నిమిషాలపాటు జనం చప్పట్లతో జేజేలు పలికారు. భయంకర మహమ్మారి కొవిడ్‌-19పై సర్కార్‌ జరుపుతున్న పోరాటానికి తాము సైతం అంటూ పూర్తిగా సహకరించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. మనమంతా ఒక్కటే.. దేన్నైనా ఎదుర్కొంటాం అంటూ ఇండ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ కూడా రోడ్లపైకి రాకుండా సమూహంగా తిరగకుండా క్రమశిక్షణ పాటించారు.


చప్పట్లతో కృతజ్ఞతలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకోసం కృషిచేస్తున్న వైద్యులు, నర్సులు, వైద్యరంగంలోని సిబ్బందికి, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ సిబ్బందికి ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చప్పట్లతో జై కొట్టారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, ఈటల రాజేందర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులు చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో చినజీయర్‌స్వామి స్వీయ పర్యవేక్షణలో వేద విద్యార్థులు, ఆశ్రమ, అర్చక పండితులు, ఉద్యోగసిబ్బంది, భక్తులు చప్పట్లు కొట్టారు. కోటి మంది హైదరాబాదీయులు చప్పట్లు కొట్టారని, అందులో 10 వేల మంది పోలీసులు కూడా ఉన్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 

ఉదయం నుంచే నిర్మానుష్యం 

సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు 24 గంటల జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించి శభాష్‌ అని అనిపించుకున్నారు. తెల్లవారుజాము నుంచే వారివారి పరిధిలోని వాహనాలు తిరగడకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పనులపై వెళ్లే వారిని మినహా అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి నచ్చజెప్పడంతోపాటు అవగాహన కల్పించారు. అక్కడక్కడ రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు చేతులు జోడించి నమస్కరిస్తూ సున్నితంగా తిప్పిపంపారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం కళకళలాడే భాగ్యనగరం రోడ్లు బోసిపోయాయి. దుకాణాలు, హోటళ్లు, మాల్స్‌ అన్ని బంద్‌ కావడంతో రోడ్డు మీద జన సంచారం కనిపించలేదు. ఎవరికి వారే కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ఇండ్లకే పరిమితమయ్యారు. ఆటోలు, కార్లు, క్యాబ్‌ సేవలు సహా సొంత వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో మొత్తం కోటి పైగా వ్యక్తిగత వాహనాలు ఉండగా దాదాపు రోడ్డెక్కని పరిస్థితి నెలకొన్నది. ఇక పూర్తి స్థాయిలో బస్సులను నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించడంతో దాదాపు పది వేల దాకా బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. హైదరాబాద్‌లో మెట్రో, ఎంఎంటీఎస్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర సేవల నిమిత్తం మొత్తం 121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో 12 రైళ్లను అందుబాటులో సిద్ధంగా ఉంచారు.


ఎగరని విమానాలు

కరోనా ఎఫెక్ట్‌తో ప్రయాణికులెవరూ రాకపోవటంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మానుష్యంగా మారిపోయింది. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలు పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నది. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తున్నారు. విమానాల్లో వచ్చిన వారికి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించిన వెంటనే క్వారంటైన్‌ సెంటర్లకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే దేశీయంగా 480 విమానాలకు ప్రస్తుతం సగం వరకే నడుస్తున్నాయి. ఆదివారం నుంచే అంతర్జాతీయ విమానాలను రద్దుచేశారు. దీంతో నిత్యం రాకపోకలు కొనసాగించే 70 అంతర్జాతీయ విమానాలు పూర్తిగా రద్ధయ్యాయి.

ఆన్‌లైన్‌ ఫుడ్‌ జాడే లేదు

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా జనతా కర్ఫ్యూకు పిలుపిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉబెర్‌, జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు నిలిచిపోయాయి. ప్రతిఒక్కరూ ఇండ్లకే పరిమితం కావడంతో ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చేవారు కరవయ్యారు. అలాగే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలందించే సంస్థలు సైతం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పా టించాయి. దీంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ జాడే లేకుండా పోయింది. 

ఏకమైతే  ఏదైనా సాధ్యమే

జనతా కర్ఫ్యూ సక్సెస్‌పై ఎంపీ సంతోష్‌కుమార్‌ ట్వీట్‌


అసాధారణ చర్యకు జనతా కర్ఫ్యూ ఒక ఉదాహరణని ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. జనతా కర్ఫ్యూ విజయవంతం కావడంపై ఆదివారం ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘మనమంతా ఏకమైతే.. ఏదైనా సాధించగలుగుతామని నిరూపించాం. జనతా కర్ఫ్యూ విజయవంతం చేసినవారికి అభినందనలు. ఇదే ఉత్సాహంతో కొవిడ్‌-19ను అంతంచేద్దాం’ అని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్మానుష్యంగా మారిన రహదారుల ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

చప్పట్లతో సంఘీభావం

సమాజహితం కోసం కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారందరికీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లతో సంఘీభావం తెలిపామని ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, డీజీపీతోపాటు పలువురు పాల్గొన్నారని పేర్కొన్నారు. ‘మా కుటుంబసభ్యులు కూడా ఇంటి వద్ద వారివంతు సంఘీభావం తెలిపారు’ అని సంతోషం వ్యక్తంచేశారు. 

2.83 కోట్ల మందికి ఉచిత రేషన్‌

ట్విట్టర్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌


కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వరకు సీఎం కేసీఆర్‌.. తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.83 కోట్లమంది (87.59 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు) ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించనున్నది. దీంతోపాటు రూ.1500 ఆర్థికసాయం కూడా అందజేస్తుంది. రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.2,417 కోట్లు కేటాయించింది’ అని ఆయన ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
logo