గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:25

వరదకు..ఎదురీదుతూ..

వరదకు..ఎదురీదుతూ..

  • పౌర చైతన్యం.. సర్కారు సాయం.. రికార్డు వాన నుంచి కోలుకొంటున్న నగరం
  • సీఎం నుంచి సిబ్బంది వరకు అప్రమత్తం
  • ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ 
  • ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన
  • అప్రమత్తంగా పోలీసు, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ, 
  • వైద్య, రెవెన్యూ, ఎన్డీఆర్‌ఎఫ్‌ విభాగాలు
  • రాష్ట్రంలో పరిస్థితిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి ఆరా.. సీఎంకు ఫోన్‌
  • రాష్ర్టానికి అండగా ఉంటామని హామీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎవరూ ఊహించని జలప్రళయమిది. గడచిన మూడున్నర దశాబ్దాల్లో ఈ స్థాయిలో కుంభవృష్టి పడటం ఇది రెండోసారి. సరిగ్గా చెప్పాలంటే 11 దశాబ్దాల క్రితం 1908 తరువాత కురిసిన అతి భారీ వర్షాలివి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు అన్నీ నిండు కుండల్లా మారిపోయాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు క్షణమాగకుండా కురిసిన ఈ అత్యంత భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరం అల్లకల్లోలమైంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అపార్టుమెంట్లలో సెల్లార్లు నీటితో నిండిపోయాయి. పలుచోట్ల వాగులకు గండ్లు పడ్డాయి. మూసీ నదికి ఏకంగా గండి కొట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. అనుకోని ఉత్పాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నది. సీఎం కే చంద్రశేఖర్‌రావు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ రాజధానిలో స్వయంగా పర్యటిస్తూ బాధితులకు దన్నుగా నిలిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి.. కిందిస్థాయి సిబ్బంది వరకు కంటిమీద కునుకులేకుండా సహాయచర్యల్లో పాల్గొన్నారు. విద్యుత్‌ సిబ్బంది 24 గంటలు పనిచేయడంతో కరెంట్‌ సరఫరా బుధవారం సాయంత్రానికల్లా సాధారణస్థితికి చేరుకొన్నది. సామాన్య ప్రజలూ సహాయచర్యల్లో పాల్గొనడంతో ఇంతటి ఉపద్రవంలోనూ నగరం ఉపశమనం పొందింది.

సీఎం సమీక్ష


హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం నుంచే సమీక్షిస్తున్నారు. వర్షపాతం వివరాలు, వాతావరణశాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులతో సీఎం పరిస్థితిని సమీక్షిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా ఆదేశాలిస్తున్నారు. విద్యుత్‌ పరిస్థితిపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ తదితరశాఖల మంత్రులు, అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షలు నిర్వహించారు. ఉన్నతాధికారులుకూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరద పరిస్థితిని అంచనావేస్తూ, బాధితులను తరలించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలనూ రంగంలోకి దింపారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీఎంవో అధికారులు నీటిపారుదల శాఖాధికారులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పరిస్థితిని అంచనావేస్తున్నారు. అలాగే వ్యవసాయ పంటల పరిస్థితి, ధాన్యం కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

ఇదే స్ఫూర్తితో.. వంద శాతం పునరుద్ధరణ..!

బీభత్సమైన వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలోనూ బాగా కష్టపడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్‌ ఉద్యోగులను ప్రశంసించారు. వందశాతం కరెంట్‌ పునరుద్ధరణ జరిగేవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. మంగళవారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు, వాటివల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్‌శాఖ తీసుకొంటున్న చర్యలను ప్రభాకర్‌రావు.. సీఎం కేసీఆర్‌కు వివరించారు. విద్యుత్‌ అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలను కూడా విద్యుత్‌ విషయంలో అప్రమత్తంచేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల విద్యుత్‌శాఖను భారీ నష్టం వాటిల్లిందని సీఎం అన్నారు. 

24 గంటలు పునరుద్ధరణ పనులు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని, పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని సీఎం కేసీఆర్‌కు ప్రభాకర్‌రావు వివరించారు. స్తంభాలు ఒరిగిపోయాయని, వైర్లు తెగిపోయాయని చెప్పారు. జలమయమైన ప్రాంతాలకు సిబ్బంది వెళ్ళడంకూడా సాధ్యపడటం లేదన్నారు. హైదరాబాద్‌తోపాటు చాలా పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు నీటితో నిండి ఉండటం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం అనివార్యమైందన్నారు. కొన్నిచోట్ల విద్యుత్‌ ప్రమాదాలు నివారించేందుకు సరఫరా నిలిపివేశామని తెలిపారు. పరిస్థితిని బట్టి మళ్ళీ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వీలున్నచోట్ల 24 గంటల పాటు విద్యుత్‌ పునరుద్ధరణ పనులుచేస్తున్నామని వివరించారు. 

సహాయ చర్యల్లో మంత్రి కేటీఆర్‌

లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకుంటున్నామని, మరిన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ శాసనసభ మండలిలో బుధవారం తెలిపారు. అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలతోపాటు నైట్‌ షెల్టర్లలో ఉన్న జనాలనుకూడా పునరావాస కేంద్రాలను తరలిస్తున్నామని చెప్పారు. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను జోన్లవారీగా నియమించి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మూసీనది ఉధృతంగా ప్రవహిస్తున్నదని, హుసేన్‌సాగర్‌కు వరదనీరు భారీగా రావడంతో నీటిని దిగువకు విడుదలచేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్‌లో సహాయచర్యల పర్యవేక్షణకు కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయమే జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్ళి వరద పరిస్థితిని సమీక్షించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

బాధితులను ఆదుకొంటామని హామీ ఇచ్చారు. మంత్రులు శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీ హైదరాబాద్‌ నగరంలో పర్యటిస్తున్నారు. కాలనీలు, వార్డులు, వరద ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌ రోడ్ల పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రోడ్లు, వంతెనలకు వాటిల్లిన నష్టం, వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎంవో నుంచి మొదలుకొని జిల్లాలు, నియోజకవర్గాలవారీగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితులను సీఎంఓకు నివేదిస్తూ.. అక్కడినుంచి వచ్చే ఆదేశాలమేరకు చర్యలు తీసుకొంటున్నారు. రిజర్వాయర్లు, డ్యాముల వద్ద ఉన్నతాధికారులు ఉండి వరద పరిస్థితులను అంచనావేస్తూ.. అవసరమైతే గేట్లు తెరుస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వైద్యారోగ్య బృందాలను అలర్ట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

రాష్ట్రపతి, ప్రధాని, షా ఆరా!

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆరాతీశారు. బుధవారం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాట్లాడానని రాష్ట్రపతి ట్వీట్‌చేశారు. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల కలిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు ధ్వంసమవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జాతి మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల అనంతరం నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. సహాయచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌చేశారు. ‘భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడాను. సహాయ చర్యలకు అవసరమైతే కేంద్రం సాయం ఉంటుందని చెప్పాను. బాధితుల ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. భారీ వర్షాల అనంతరం నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ప్రజలను అన్ని రకాలుగా ఆదుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. 

ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నది

ప్రజలు ఎన్నుకొన్న పౌర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వ విధుల్లో మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. అయితే ప్రభుత్వం అలర్ట్‌గా ఉన్నదన్న విషయాన్ని కూడా గమనించాలి.  రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఏం జరుగుతున్నదో మాకు అవగాహన ఉన్నది.

-  హైకోర్టు ధర్మాసనం


logo