శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 02:54:44

నిశ్చింతగా ఉండొచ్చు

నిశ్చింతగా ఉండొచ్చు

  • వలసకార్మికులను సీఎం కేసీఆర్‌ భరోసా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస కార్మికులు రాష్ట్రంలో నిశ్చింతగా ఉండొచ్చని సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. మంగళవారం మీడియాతో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే ‘తెలంగాణ డైనమిక్‌ స్టేట్‌.. ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చి పొట్ట పోసుకుంటున్నారు. మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టేట్‌గా తెలంగాణ ప్రూవ్‌ చేసుకున్నది. తెలంగాణలో ఎన్ని లక్షలమంది పనిచేస్తున్నారు. దాదాపు ఏడున్నర లక్షల మంది కార్మికులను ఆదుకుంటున్నాం. అన్ని వసతులు కల్పించాం. మన వాళ్లకు ఇచ్చినట్లే వాళ్లకు బియ్యం, నగదు ఇచ్చినం. 

వలస కార్మికులకు అండగా

వలస కార్మికులు మా సహోదరులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో పనిచేస్తున్నరు. మీరు మా బిడ్డలు. మిమ్మల్ని తెలంగాణ అభివృద్ధి ప్రతినిధులుగా భావిస్తున్నం. ఇకనుంచి ఇక్కడ అన్ని పనులకు అనుమతులు ఇచ్చినం. మీరు ప్రశాంతంగా, బాజాప్తాగా పనులు చేసుకోవచ్చు. గృహనిర్మాణం, రియల్‌ఎస్టేట్‌, పరిశ్రమలు తెరుచుకుంటయి. స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నవారిని ఆపబోం. అయితే ఒకేసారి వేలసంఖ్యలో పంపలేం. వెళ్లాలనుకున్నవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. మీ విషయమై ఈ రోజు పలువురు సీఎంలతో మాట్లాడాను. వాళ్లు ఒప్పుకున్నరు. అందరూ ఒక్కసారి పోయేందుకు వీలుపడదు. అంచెలంచెలుగా పంపిస్తం. 

బీహార్‌ నుంచి 25 వేల మంది తిరుగు ప్రయాణం

ఇక్కడ రైసు మిల్లుల్లో బీహార్‌వాళ్లు పనిచేస్తరు. 20 నుంచి 25వేల మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నాం. వలస కార్మికులను తీసుకొని బీహార్‌ వెళ్లిన రైలులోనే రైసు మిల్లు కార్మికులు వస్తారు. కేవలం ఇక్కడినుంచి పోయేవాళ్ల్లే కాదు ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇకముందూ తెలంగాణలో పనిచేసేందుకు రావచ్చు.


logo