మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:46:39

కోరితే వీఆర్‌ఏ పిల్లలకు ఉద్యోగాలు

కోరితే వీఆర్‌ఏ పిల్లలకు ఉద్యోగాలు

  • లిటిగేషన్లు ఉండవు
  • కుటుంబాలకే ఫుల్‌ పవర్‌
  • వీఆర్వో వ్యవస్థ రద్దుకు ప్రజల ఆమోదం
  • రాష్ట్రమంతా సంబురాలు చేసుకుంటున్నారు
  • ఉంటేగింటే సివిల్‌కోర్టుకే
  • ఇంకా భ్రమల్లోనే భట్టి
  • ఇది కాంగ్రెస్‌ సర్కారు కాదు..
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. 
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దుచేస్తే పీడ విరగడైందని ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని, పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వీఆర్‌ఏలు కోరుకుంటే వారి బదులుగా పిల్లలకు ఉద్యోగాలిస్తామని తెలిపారు. నూతన రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘వీఆర్‌ఏ లేదా విలేజ్‌ సర్వెంట్లలో ఎక్కువ శాతం వీకర్స్‌ సెక్షన్లవారే ఉన్నరు. వీరిని స్కేల్‌ ఉద్యోగులుగా మార్చుతున్నం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్లకంటే ఎక్కువ భారం పడుతుంది. వీరి జీతాలు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ.10 వేలకు పెంచాం. వీరు ఏండ్ల తరబడి గ్రామాలకు వివిధరూపాల్లో సేవచేస్తున్నారు. వీరి ఉద్యోగాలకు వయస్సు పరిమితి లేకపోవటంతో 70 ఏండ్లు అయినా కొందరు పని చేస్తున్నారు. కాబట్టి సమాజానికి వీరి పట్ల బాధ్యత ఉండాలి. వీఆర్‌ఏ వ్యవస్థలో మొత్తం 20 వేల పై చిలుకు మంది పని చేస్తున్నారు. నేరుగా వారే ఉద్యోగాలు చేస్తానంటే ఒకే. లేదు వారి పిల్లలు అర్హత ఉండి చేస్తామంటే.. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందులో ఎలాంటి అనుమానం లేదు.

వీఆర్వోల రద్దుతో సంబురాల్లో ప్రజలు

అధికారులను పిలిచి అడిగినపుడు పహాణీలో 33 కాలమ్‌లు ఉన్నాయని చెప్పినరు. ఎందుకయ్యా 33 కాలమ్స్‌, ఏం పని? అని అడిగిన. పహాణీల వ్యవస్థ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? భూమిశిస్తు వసూలుచేసేందుకు ఇదంతా వచ్చింది. శిస్తు వసూలుకే సాలార్జంగ్‌ కాలం నుంచి పటేల్‌, పట్వారీ వ్యవస్థ కొనసాగింది. భూమి శిస్తు రద్దు అయిపోయి, మనమే ఎకరానికి పదివేల రూపాయల రైతుబంధు ఇస్తున్నంక గ్రామాల్లో అధికారులెందుకు? తాకట్లు పెట్టడానికా?  ఎందుకు వీఆర్వో వ్యవస్థ రద్దు చేయాల్సివచ్చింది? ప్రభుత్వం ఏదైనా ఒట్టిగ చేయదు. ప్రజానాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఒక వ్యవహారం ప్రజల్లోకి పోతే ఏమనుకుంటరనేది అధ్యయనం చేస్తం. వీఆర్వో వ్యవస్థ రద్దుచేస్తే ప్రజలు సంబురాలు చేసుకుంటున్నరు. పటాకులు కాల్చుకుంటున్నరు. స్వీట్లు పంచుకుంటున్నరు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉన్నది. మాకేదో పీడ విరగడయిందని మాట్లాడుతున్నరు. 

కొత్త రెవెన్యూ చట్టం భూ వివాదాలన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. శాసనసభలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క లేవనెత్తిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ విస్పష్టంగా జవాబిచ్చారు. ‘కొత్త రెవెన్యూ చట్టంతో వందశాతం పారదర్శకత వస్తుంది కాబట్టి లిటిగేషనే తగ్గిపోతది. ఆ తర్వాత కూడా లిటిగేషన్‌ ఉంటే ఆ మకిలి మనం పెట్టుకునే బదులు సివిల్‌ కోర్టుకు పోతే అక్కడే పరిష్కారం దొరుకుతది. అందుకే ఇకపై రెవెన్యూ కోర్టులు ఉండవు. ట్రిబ్యునల్స్‌ ఉండవు. ప్రస్తుతం వివిధస్థాయిల్లో  16 వేల భూ సమస్యల కేసులు పెండింగ్‌లో ఉన్నయి. వాటి పరిష్కారం కోసం తాత్కాలికంగా ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటుచేస్తున్నాం. ఇవి తాత్కాలికమైనవే.. వెయ్యి కేసులకు ఒక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పెట్టి.. నిర్ణీత సమయంలో కేసులను పరిష్కరిస్తం. వీఆర్వో వ్యవస్థ రద్దయింది తప్ప.. మిగతా రెవెన్యూ వ్యవస్థ మొత్తం యథాతథంగా ఉంటుంది. అందరూ ఉంటరు.. అన్ని రికార్డులూ ఉంటయి. సర్వే, సెటిల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా ఉం టుంది’ అని సీఎం అన్నారు. 

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు..

అవసరాల పేరిట గతంలో పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్నదన్న భట్టి మాటలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘అసలు బిల్లులో అలాంటి ప్రస్తావనే లేదు. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల భూముల్ని తీసుకున్నరు కాబట్టి వాళ్లకు ఆ అలవాటున్నది. మేము అట్ల తీసుకుంటలేం. తీసుకోవద్దని ఆదేశాలు కూడా ఇచ్చిన. ఒకవేళ అత్యవసరమై.. ప్రాజెక్టు కోసమో లేదా కాలువ కోసమో.. అది కూడా ప్రజల కోసమే తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే పట్టాదారుకు ఎంతైతే పరిహారం ఇస్తున్నారో వీళ్లకు కూడా అంతేమొత్తం పరిహారం ఇవ్వాలని నేనే స్వయంగా చెప్పిన. భట్టివిక్రమార్క ఇంకా వాళ్లకాలమే ఉందనుకుంటున్నరు. ఇప్పుడు కాలంమారింది. అధికారంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమున్నది’ అని సీఎం కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

వివాదం ఉంటే వాళ్లే కోర్టుకు పోవాలి : సీఎం

ఫౌతి వ్యవహారంలో కుటుంబానికే పూర్తి అధికారమిస్తున్నామని, దాన్ని కుటుంబసభ్యులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుపై చర్చకు సీఎం సమాధానమిస్తూ ఫౌతిపై ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు. ‘ఫౌతి కేసులో ఇంతకుముందు అధికారులకు పవర్‌ ఉండేది. మేం కుటుంబానికి ఇచ్చినం. కుటుంబం ఆ పవర్‌ను వాడుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఎక్కడైనా ఒకట్రెండు శాతం లిటిగేషన్‌ ఉంటే వాళ్లు కోర్టుకు పోయి సెటిల్‌ చేసుకోవాలి. ఆ మకిలి మేం పెట్టుకోదలచుకోలేదు. ఇంతమంచి అవకాశం ఉన్నప్పుడు కుటుంబానికి విజ్ఞత ఉండాలె. కచ్చితంగా అవకాశాన్ని వాడుకోవాలె. ఇది ఒక రకంగా ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్‌.  

పాస్‌బుక్‌లో కుటుంబసభ్యుల అందరిపేర్లు పెడతాం 

ఫౌతీ వేసే టైమ్‌లో కుటుంబమంతా కలిసి ఒకాయనకు అన్యాయం చేస్తున్నరనుకో.. అలాంటప్పుడు డైరెక్ట్‌గా ఎమ్మార్వో దగ్గరకు పోయి అప్లికేషన్‌ పెట్టుకుంటే ఆ మ్యుటేషన్‌ ఆగిపోతది. దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తరు. అంతకూ కాకపోతే కోర్టుకు పోవచ్చు. ఇంకోమాట.. రైతులకు ఒక రెండు నెలలు టైం ఇచ్చి, మీ కుటుంబసభ్యుల వివరాలు ఇవ్వం డి.. అని తీసుకొని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పాస్‌బుక్‌లో పెడ్తాం. విశ్వప్రయత్నం చేసి లిటిగేషన్‌ జీరోడౌన్‌ చేద్దాం. 

ఇది విప్లవాత్మక చట్టం

రైతులు, ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఒక విప్లవాత్మక, చరిత్రాత్మక బిల్లు ఇది. ఈ ముఠాలు, ఫ్యాబ్రికేటెడ్‌ డాక్యుమెంట్లు, దొంగ వ్యవహారాలకు అన్నింటికీ చరమగీతం పాడి ప్రజలకు మేలు జరగాలె.. 

మైనర్‌ తప్పులకు టైం ఇస్తాం:  సీఎం

రికార్డుల్లో మైనర్‌ తప్పులను సరిచేసుకోడానికి తప్పకుండా టైం ఇస్తాం. దానికి మార్గదర్శకాలు అధికారులు విడుదలచేస్తారు. ఏదో ఒక సందుతోని అనుభదారు కాలమ్‌ రావాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది. కౌలు నష్టపరిహారంతో మాకు సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా నష్టపరిహారం ఏ దేశం ఇవ్వదు. సహాయకచర్యలు చేపడుతారు తప్ప.. నష్టపోయిన మొత్తం పంటకు పరిహారం ఇవ్వరు. అది ఏది ఉన్న రైతు, కౌలుదారు మధ్య వ్యవహారం. రైతు వెంటే ప్రభుత్వం ఉంటుంది. కానీ ఓ పోటీదారును తెచ్చి రైతు మెడకు దూలం కట్టదలచుకోలేదు. logo