బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 00:58:11

దండంపెట్టి చెప్తున్నా మీరంతా మా బిడ్డలే

దండంపెట్టి చెప్తున్నా మీరంతా మా బిడ్డలే

  • మిమ్మల్ని అరెస్ట్‌చేయం.. ఆరోగ్య పరీక్షలు చేస్తాం
  • స్వచ్ఛందంగా చెప్పండి  
  • ప్రభుత్వ సూచనలను పాటించండి   
  • మీకు మీరుగా ఐసొలేషన్‌లో ఉండండి  
  • దాచుకొందామనుకొన్నా దొరికిపోతారు 
  • విదేశాల నుంచి రాష్ర్టానికి 20 వేలమంది  
  • సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విదేశాలనుంచి తెలంగాణకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సమాచారమివ్వాలని, సమాజహితం కోసం ప్రభుత్వం చెప్పినట్లు వినాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తిచేశారు. అనవసరంగా బయట తిరిగి తమ కుటుంబాలను, సమాజాన్ని చెడగొట్టవద్దని కోరారు. శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో సీఎం మాట్లాడుతూ.. విదేశాలనుంచి తెలంగాణకు వచ్చినవారిపై సీరియస్‌గా నిఘాపెట్టామని, అంతా నియంత్రణలోనే ఉన్నదని పేర్కొన్నారు. ‘విదేశాలనుంచి వచ్చినవాళ్లకు నేను మళ్లీ దండం పెట్టి.. నమస్కరించి చెప్తున్నా.. మీరు సమాజహితం కోరి ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. మీకు మీరే స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి. అంతేకానీ మీరు పారిపోతుంటే పట్టుకురావడం సరికాదు. 

ఈరోజు ఒకతను రైల్లో పారిపోతుంటే ఆలేరు దగ్గర పట్టుకొన్నారు. ఇంకెవరో ఇద్దరు ఢిల్లీకి పారిపోతుంటే. వాళ్లను కాజీపేట దగ్గర పట్టుకొని తెచ్చి మళ్లీ గాంధీలో చేర్పించిన్రు. ఎందుకు ఇలాంటి పనులు. స్వీయ నియంత్రణ పాటించండి. ప్రపంచం ప్రపంచమే పరేషాన్‌లో ఉన్న సమయంలో ఈమాత్రం నియంత్రణ లేకపోతే కష్టం. అందుకే విదేశాల నుంచి వచ్చినవాళ్లు దయచేసి మీ స్థానిక పోలీస్‌స్టేషన్‌, లేదంటే తాసిల్‌ ఆఫీస్‌, లేదంటే స్థానిక వైద్యులకు సమాచారమివ్వండి. అంతమాత్రాన మిమ్మ ల్ని ఎవరూ అరెస్టుచేయరు. వ్యాధి లక్షణాలు ఉన్నాయా? లేదా? పరీక్షిస్తారు. వ్యాధి లక్షణాలు ఉంటేనే క్వారంటైన్‌ సెంటర్లకు రిఫర్‌చేస్తారు. 

లేకపోతే చేతికి స్టాంప్‌వేసి మీ ఇంటి దగ్గరే ఉంచి ఉదయం, సాయంత్రం వైద్యులు వచ్చి పరీక్షచేసి వెళ్తారు. అంతేతప్ప మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరు. మీ క్షేమం.. మీ కుటుంబ క్షేమం.. తద్వారా మన రాష్ట్ర, దేశ, ప్రపంచ క్షేమానికి పాటుపడాలని కోరుతున్నాం. మొత్తం మానవజాతి క్షేమమే మీ చేతుల్లో ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారి కుటుంబ సభ్యులు తమవాళ్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలని సీఎం కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి, జ్వరం, జలు బు, దగ్గు లక్షణాలుంటే తక్షణమే అధికారులకు సమాచారమివ్వాలన్నారు. విదేశాలనుంచి వస్తున్నారు కాబ ట్టే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. 

వీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదని, ప్రభుత్వమే అంబులెన్స్‌ ఏర్పాటుచేస్తుందని, అవసరమైన మందులిస్తుందని చెప్పా రు. అన్ని వసతులు ఏర్పాటుచేసి అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండటం ఇష్టంలేకుంటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన దాదాపు వెయ్యి ఐసొలేషన్‌ సెంటర్లలో ఉండవచ్చని సీఎం తెలిపారు. ‘మీరు ఎట్టిపరిస్థితుల్లో దాచుకోలేరు. తప్పించుకోలేరు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో పోలీసులు ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. గ్రామాలవారీగా సమాచారం సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లకు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు విజ్ఞప్తిచేస్తున్నా.. మీమీ గ్రామాల్లో, బస్తీల్లో విదేశాలనుంచి వచ్చినవారు ఎక్కడ ఉన్నా వెంటనే సమాచారమివ్వండి. మన రాష్ర్టాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  

 ఇరవైవేల మంది వచ్చారు 

మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకు విదేశాలనుంచి మన రాష్ట్రంలోకి 20వేల మంది వరకు  వచ్చారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచే కాకుండా, ఇతర రాష్ర్టాల్లోని విమానాశ్రయాల్లో దిగి మన రాష్ర్టానికి వచ్చినవారున్నారని చెప్పారు. ‘నిన్నరాత్రి విదేశాల నుంచి హైదరాబాద్‌కు 1,500 మంది వచ్చారు. విదేశాలనుంచి వచ్చేవారిని సాధారణ పరిపాలన, ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల విమానాశ్రయాల్లో దిగి మన దగ్గరకు వచ్చేవారిని గుర్తించడం కష్టంగా ఉంటున్నది. వారి వివరాలు తెలియడంలేదు.

కరీంనగర్‌ ఘటన తర్వాత నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ల సమావేశంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసుకొన్నాం. రాష్ట్రమంతటా 5,274 పర్యవేక్షణ బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 11 వేల మందిని గుర్తించి అదుపులోకి తీసుకొన్నాం. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించాం. పర్యవేక్షణ బృందాలు ఉదయం, సాయంత్రం క్వారంటైన్‌లో ఉన్నవారిని కలిసి అవసరమైన మందులు, కౌన్సెలింగ్‌ ఇవ్వడం వంటి పనులుచేస్తాయి. ఎవరైనా ప్రమాదకరస్థితిలో ఉంటే.. వారిని వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలిస్తారు. 700 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించాం. వాళ్లకు అన్ని పరీక్షలు అవుతున్నాయి. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 21 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీళ్లంతా బయటి దేశాలనుంచి వచ్చినవాళ్లే’ నని సీఎం కేసీఆర్‌ చెప్పారు.


logo
>>>>>>