e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home Top Slides మన కోసం పెట్టిన పథకమిది

మన కోసం పెట్టిన పథకమిది

  • సంక్షేమశాఖ మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితబిడ్డపై ఉన్నదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. మనసుపెట్టి పనిచేసుకుందామని, దేశానికి రోల్‌మోడల్‌గా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ దళిత బంధు అవగాహన సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో ఈ తరహా పథకం ఏ రాష్ట్రంలోనూ లేదని, దళిత జాతిని శాశ్వతంగా కష్టాల నుంచి గట్టేక్కించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని అమలు చేయాలని తలపెట్టారని చెప్పారు. హుజురాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుంటున్నారని, ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులువుగా ఉంటుందని అన్నారు. మన రాష్ట్రంలో ఈ పథకం విజయవంతమైతే దేశంలోని దళితులందరికి మంచి చేసినవాళ్లమవుతామని, మనను చూసి ఇతర రాష్ట్రాలవారు కూడా ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నదని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఎనిమిది గంటలకుపైగా సదస్సు..

సోమవారం ఉదయం పదకొండున్నరకు మొదలైన సదస్సు రాత్రి ఏడున్నర వరకు కొనసాగింది. సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మాట్లాడించారు. ప్రతి మండలం నుంచి ఐదారుగురు సభ్యులు మాట్లాడారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 500 మంది సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా దళిత ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. సదస్సుకు వచ్చిన ప్రతినిధులు దళితబంధు పథకంపై నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పారు. కార్యక్రమంలో దళిత సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్‌, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు బాల సుమన్‌, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌, రసమయి బాలకిషన్‌, గ్యాదరి కిశోర్‌, చంటి క్రాంతికిరణ్‌, సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్‌ షిండే, సుంకె రవిశంకర్‌, కే మాణిక్‌రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్‌, జీ సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు వెంకట్‌, బాలనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితాసబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌, టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సీఎంవో అధికారి ప్రియాంక వర్గీస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ కరుణాకర్‌, కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్‌, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

దళిత ప్రతినిధులతో సీఎం మాటామంతి

- Advertisement -

భోజన విరామానంతరం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులతో, దళిత బంధు పథకంపై ముఖాముఖి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పలువురితో మాట్లాడి వారి అభిప్రాయాలను
తెలుసుకున్నారు. అనంతరం వారి స్వయం నిర్ణయాధికారం గొప్పదని ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

డోజర్‌ కొనుకుంటం

నా భర్తకు డోజర్‌ నడుపొస్తది. ఇపుడు మేం దళితబంధు పథకంతో ట్రాక్టర్‌ డోజర్‌ కొనుకుంటం. దీంతో మా బతుకుకు భరోసా ఏర్పడుతది.
శారద, మల్లారెడ్డిపల్లి

ట్యాక్సీ కొనుకుంటా

నేను కారు డ్రైవర్‌ను. మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కొనుకొని స్వయంగా కిరాయిలకు తిప్పుకుంట’.
దాసారపు చిరంజీవి,లస్మకపల్లి, వీణవంక మండలం

ఫర్టిలైజర్‌ లేదా

కిరాణం షాపు పెట్టుకుంటఆసరా లేని వాళ్లకు దళితబంధు పథకం చాలా బాగా ఉపయోగ పడుతది. నేను ఫెర్టిలైజర్‌ లేదా కిరాణం షాపు పెట్టుకుంట.
హరీశ్‌, శ్రీరాములపేట

మేం బతికినంతకాలం కేసీఆర్‌ మా దేవుడు

పది లక్షలు మాకు ఇస్తాడంటే నమ్మబుద్ధి అయిత లేదు. కేసీఆర్‌ సారు చెప్పిండని నమ్ముతున్నం. నా భర్త వ్యవసాయ పనులు చేస్తడు. మాది పేద కుటుంబం. పది లక్షలు మాకు ఇస్తే బతికినంతకాలం కేసీఆరే మా దేవుడు. మా జీవితాలు బాగు చేసుకుంటాం. ముఖ్యమంత్రి స్వయంగా మాకు పథకం ఎట్ల ఉంటుందో చెప్పిన్రు. మాకు నమ్మకం కుదిరింది.
-పుల్లూరి శారద, కోరపల్లి, జమ్మికుంట మండలం

స్కీం అమలుపై సీఎంకు పట్టుదల ఉంది

మా ఎస్సీలకు చాలామంది చాలా స్కీంలు పెట్టారు. కానీ, ఎవ్వరూ ఏ స్కీంను పూర్తిగా ఇవ్వలేదు. కానీ, కేసీఆర్‌ పెట్టిన దళితబంధు స్కీంను చూసిన తర్వాత మాకు ఆయనపై, స్కీంపై నమ్మకం కుదిరింది. స్కీంను అమలు చేయడంపై ఆయనకు పట్టుదల ఉన్నట్టు కనిపించింది. మా కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందనడంలో సందేహంలేదు.
కే వీరస్వామి, మరువానిపల్లె, ఇల్లందకుంట మండలం

నేను ట్రాక్టర్‌ డ్రైవర్‌ను.. ఓనర్‌ అవుతా

దళిత బంధు పథకంలో ముందుగా అర్హత పొందుతా. నాకు ఆర్ధిక సాయం అందితే.. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అయిన నేను ట్రాక్టర్‌ను కొనుకొని స్వయంగా నడుపుకుంట.
కల్లెపల్లి సమ్మయ్య, వీణవంక మండలం కిష్టంపేట గ్రామం

మెడికల్‌ షాపు పెట్టుకుంటా

మా దళిత కాలనీ.. మా ఊరు మామిడాలపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటది. అందుకే మా కాలనీలో మెడికల్‌, జనరల్‌ స్టోర్‌ షాపు పెట్టుకుంటా.
దరిపల్లి తిరుమల, మామిడాలపల్లి

డెయిరీ ఫామ్‌ పెట్టుకుంటం

నాకు పాల డెయిరీ మీద అవగాహన ఉన్నది. నేను బర్లు కొనుకొని డెయిరీ ఫాం పెట్టుకుందామని అనుకుంటున్న. దళితబంధు పథకంతో నా కల నెరవేరుతది.
తాండ శంకర్‌, చల్లూరు

ఆటోమొబైల్స్‌ షాపు పెట్టుకుందామనుకుంటున్నా.
తేజ, జమ్మికుంట పట్టణం

జిరాక్సు, కంప్యూటర్‌ డీటీపీ, ఇంటర్నెట్‌ షాపు పెట్టుకుంటా.
రమేశ్‌, జమ్మికుంట

ఇంతకాలం మాకెవరూ ఇలాంటి పథకాలు చెప్పలేదు, మా కొడుకు, కోడలు మెడికల్‌ షాపు పెడదామనుకుంటున్నరు.
-సారయ్య, రిటైర్డు టీచర్‌, హుజూరాబాద్‌.

సెంట్రింగ్‌ ప్లేట్లతో వ్యాపారం చేసుకుంటా.
దాసారపు గురువయ్య, నర్సింగాపూర్‌

పాడి బర్రెలతో డెయిరీ ఫాం పెట్టుకుంటా.
-స్టీఫెన్‌, ఎల్బాక గ్రామం

లైటింగ్‌ డెకరేషన్‌ వ్యాపారం పెట్టుకుంటా.
రాకేశ్‌కుమార్‌, ఇల్లందకుంట

నేను పౌల్ట్రీ ఫాం పెట్టుకుంటా.
-మాదాసు మహేందర్‌, గడ్డివానిపల్లి

ట్రాక్టర్‌ కొనుకుంటం.
-కమల, ఇల్లందకుంట

మినీ సూపర్‌ మారెట్‌ పెట్టుకుంటా.
-సురేందర్‌, బోజనూరు

వరికోతల హార్వెస్టర్‌ మిషన్‌ కొనుకొంటా.
-నరేశ్‌, శంభునిపల్లి, జమ్మికుంట మండలం

నాటుకోళ్లు, కడక్‌నాథ్‌ కోళ్లు పెంచి, అమ్మే వ్యాపారం పెట్టుకుంటా.-
-సారంగం, మడిపల్లి

పండ్ల వ్యాపారం పెట్టుకుంటా.
ఎలపల్లి దేవేందర్‌, శాలవాడ,జమ్మికుంట పట్టణం.

వెలివాడల వాకిల్లలో వెన్నెల్లే కురువాలె

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేదర్‌ తర్వాత దళితుల గురించి ఆలోచన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. చిన్న లోన్‌ కోసం తండ్లాడిన దళితులకు పదిలక్షల రూపాయలు దళితబంధు ద్వారా ఉపాధి కోసం ఉచితంగా ఇవ్వడం గొప్ప నిర్ణయం. ఇది దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న తెలంగాణ అభివృద్ధిలో.. మా లాంటి వాళ్లను ప్రజా ప్రతినిధులను చేసి, భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవంతో నిలిచినప్పుడే.. దళితులు సీఎం కేసీఆర్‌కు నిజమైన కృతజ్ఞత తెలిపిన వాళ్లయితరు. దళితబంధు పథకం.. దళితుల జీవితాల్లో మౌలిక మార్పుకు శ్రీకారం చుట్టాలె.. సామాజిక సాధికారతకు దారులు వేయాలె.. వివక్షతల అంతానికి చరమగీతం పాడాలె. వెలివాడల వాకిల్లలో వెన్నెల్లే కురువాలె.
గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ

దేశానికి దిక్సూచి హుజూరాబాద్‌ ప్రాజెక్ట్‌

దళితుల అభివృద్ధి, ఆత్మగౌరవ సాధన దిశగా ముందుకు వెళ్లాలన్న అంబేద్కర్‌ ఆశయాన్ని సాకారంచేస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్‌. చిత్తశుద్ధితో దళితబంధు పథకం అమలుచేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. రాజకీయాలకు అతీతంగా పది లక్షల రూపాయలతో సీఎం కేసీఆర్‌ అమలు పరుస్తున్న దళితబంధు.. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు దారులు వేయనున్నది. డబ్బులు వచ్చాయని జల్సాలకు వెళ్లకుండా రూ.10 లక్షలను రూ.30 లక్షలకు పెరిగేలా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉన్నది.
బాలనర్సింహులు, సీపీఐ రాష్ట్ర నేత

దళితులను పులులుగా మార్చే అవకాశం
మేకలనే బలిస్తారు. పులులను కాదు.. అనే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా దళితులను పులులుగా మార్చే అవకాశం సీఎం కేసీఆర్‌ అమలు చేయబోయే దళితబంధు పథకం ద్వారా సాధ్యం కానున్నది. ఆ విశ్వాసం కలిగిన తర్వాతే ఈ మీటింగ్‌కు వచ్చాను. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణలో విజయం సాధించిన అనంతరం దేశమంతా దళితబంధు లాంటి పథకాన్ని అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
వెంకట్‌, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి.

ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతరు

దళితబంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతరు. అణగారిన జీవితాల్లో వెలుగులు నింపే సాహసోపేత పథకం తెచ్చినందుకు దళిత జాతి తరఫున కృతజ్ఞతలు. ఇప్పటికే విదేశీ విద్యను దళితులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుంది. అరవై లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే గురుతర బాధ్యత హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టు విజయం మీద ఆధారపడి ఉంది.
రసమయి బాలకిషన్‌, సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే

మాకూ పాల్గొనే అవకాశం కల్పించండి

అద్భుతమైన సీం. ఈ ఆలోచన రావడమే గొప్ప. మీకు జాతి రుణపడి ఉంటది. పథకం పటిష్ఠ అమలు కోసం నోడల్‌ ఏజెన్సీని నియమించాలి. దళిత ప్రజా ప్రతినిధులకు పైలట్‌ నియోజకవర్గంలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తే నేర్చుకుంటం. రేపటినాడు మా నియెజకవర్గాల్లో అమలుకు మార్గం సులువవుతుంది.
గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌

ఏ పథకం పెట్టినా సక్సెస్సే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ పథకం పెట్టినా విజయవంతం అవుతది. రైతుబంధును ఆదర్శంగా తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు కొంత ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నది. బ్యాంకుల ప్రమేయం లేకుండా, గ్యారెంటీ లేకుండా నేరుగా ఒకో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana