శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 06, 2020 , 02:54:46

మీరు ఇవ్వండి లేదా అధికారాలు ఇవ్వండి

మీరు ఇవ్వండి లేదా అధికారాలు ఇవ్వండి

  • ఎఫ్‌ఆర్‌బీఎంపై ఉలుకూ పలుకూ లేని కేంద్రం
  • డబ్బులు మీరు ఇవ్వరు.. తెచ్చుకోనివ్వరా
  • నెలకు రూ.15000 కోట్లు రావాలి.. రూ.1600 కోట్లే వచ్చింది
  • ఎలక్ట్రిసిటీ బిల్లుపై తాడోపేడో తేల్చుకుంటం
  • కేంద్రంపై సీఎం కేసీఆర్‌ నిప్పులు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : లాక్‌డౌన్‌ కారణంగా జరిగిన నష్టాలను పరిష్కరించాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఉలుకూ పలుకూలేకుండా ఉందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం క్యాబినెట్‌ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర వైఖరిపై సీఎం వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. దేశ ఆర్థిక పరిస్థితి కరోనా కంటే ముందు నుంచే చాలా ఘోరంగా ఉంది. అది ఇట్ల ఉంటే పులిమీద పుట్రలాగా కరోనా దెబ్బపడింది. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. వాస్తవంగా మన తెలంగాణ రాష్ర్టానికి అన్నిరకాలుగా కలిపి ప్రతినెల రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సిఉంది. అందులో మన రాష్ర్టానికి సొంతంగా వచ్చే ఆదాయం కేంద్రం ఇచ్చేది కాకుండా (దాదాపు రూ.10,800 చిల్లర) రూ.11వేల కోట్లు. ఈరోజు మనకు వచ్చింది రూ.1600 కోట్లు. జీతాలివ్వాలంటేనే రూ.3000 కోట్లు కావాలి రాష్ర్టానికి. ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి. 

ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రికి చెప్పిన. పీఎం దగ్గర కూడా డబ్బులుండవు. రాష్ర్టానికి ట్యాక్స్‌ రాకుంటే కేంద్రానికి కూడా రాదు. కాకుంటే ఈ దేశంలో ఆర్థిక నియంత్రణ కేంద్ర ప్రభుత్వందగ్గర ఉన్నది. అధికారం వాళ్లదగ్గర ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలన్నాం. మీరు మాకు అనుమతి ఇవ్వకపోతే మీదగ్గర అధికారం ఉంది. ఆ అధికారాన్ని మాకు బదిలీ చేయండి లేదా డబ్బులు ఇవ్వండి అని అడిగాం. డబ్బులు లేవు. మీరు డబ్బులు ఇవ్వలేరు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అవలంభిస్తున్న విధానాలేలా ఉన్నాయో వాటిప్రకారం డబ్బులివ్వడానికి కేంద్రానికి ఒకమార్గం సూచించా. అటువంటి సమయం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తం. కేంద్రం మౌనం పాటించాలనుకోవడం కరెక్టు కాదు. బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటం.. మీరేమైనా రాసుకోండి.. మేం సప్పుడు చేయమంటే ఇదేం పద్దతి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఒక్క తెలంగాణ కాదు కదా. మొత్తం దేశం సమస్య.. ఏమాత్రం ఉలుకూ లేదు, పలుకూ లేదు. ఇది పద్దతైతే కాదు, నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించేది కాదు.. తమాషా మాటలు మాట్లాడుతా మంటే కథ నడువదు, దేశం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలకు, ఇతర రుణాలకు డిఫర్మెంట్‌ ఇవ్వండని ప్రధానిని అడిగాను.. ఇది చిన్న పని కదా.. కేంద్రం ఎందుకు చేయడం లేదు?

పేదోళ్ల దగ్గర కష్టకాలంలో ట్రైన్‌ టికెట్‌ వసూలు చేస్తారా..?

డబ్బులు ఇవ్వకపోగా కేంద్రం ఇరకాటం మనస్తత్వంతో వ్యవహరిస్తున్నది. వలస కూలీలకు రైలు ఛార్జీ టికెట్‌ పెట్టినరు. ఇది  అన్యాయం. తెలంగాణలో మేము కడుతున్నాం. ఈ రోజే రూ.4 కోట్లు కట్టినా. వలసకూలీలను పంపేందుకు రైళ్లకు అడ్వాన్స్‌ పొద్దునే కట్టినా. ఇంత అన్యాయమా? రైల్వే ఛార్జీలు ఇచ్చే పైసలు కేంద్రం దగ్గర లేవా? సిగ్గుపోతది. ఇంత అధ్వానమా? 

ఎలక్ట్రీసిటీ బిల్లును పాస్‌ కానీయం..

 ఇంకొకటి కేబినెట్‌లో డిస్కస్‌ చేశాం. పవర్‌ బిల్లు తెస్తున్నారు. ఇప్పుడు ఈఆర్సీలను అపాయింట్‌ చేసే అధికారం మనకు ఉంది.  ఈ అధికారాన్ని తీసివేస్తారంట.  కేంద్రమే అపాయింట్‌ చేస్తదట. ఇదేమి అన్యాయమండీ. ఇంతకు ముందున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అంశాలను తీసి కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చింది. వాళ్లు ఒక్కాకంటే బీజేపీ వాళ్లు రెండాకుల్లాగా ఉన్నరు. బీజేపీ ప్రభుత్వం మొత్తం సెంట్రలైజ్‌ చేస్తదంట. ఇది కరెక్టు కాదు. వంద శాతం ఫెడరల్‌ స్పూర్తికి విఘాతం. కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లును చాలా స్ట్రాంగ్‌గా వ్యతిరేకిస్తాం. పార్లమెంటులో భూమిని ఆకాశాన్ని ఒకటిచేస్తాం. ఆ బిల్లు పాస్‌ కానీయం. ఈ బిల్లురాష్ట్రాల హక్కులను సమాధి చేస్తుంది. మన రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ఈ బిల్లు వస్తే వాళ్లు చెప్పినట్లు  కరెంటు ఇవ్వాలి.  ఇందులో పంపిణీ అంతా కూడా ప్రైవేట్‌కు అప్పగించే వ్యవస్థ వస్తుంది. బిల్లులు ముక్కుపిండి వసూలు చేస్తరు. సబ్సీడీ ఇవ్వద్దంట. ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నం. లేదు 14 గంటలే ఇవ్వాలంటే మన రైతులకు ఇచ్చే కరెంటు కట్‌చేస్తరా? వ్యవసాయానికి చార్జీ వసూలు చేయాలని చార్జీలు పెడతరా? ఖచ్చితంగా మీటర్లు పెట్టాలంటా? కొత్తగా వచ్చే చట్టం ప్రాతిపదిక ప్రకారం వందశాతం మీటర్లు పెట్టాలి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలి.. సబ్సీడీ ఇచ్చుకునేది ఉంటే నేరుగా రైతుకు ఇచ్చుకో అంటే.. ఇదేం పద్దతో ముక్కు ఏదంటే వెనుక నుంచి చూపించినట్లుగా ఉంది.


logo