ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 01:28:47

మరోసారి విజ్ఞప్తిచేసి చెప్తున్నా..

మరోసారి విజ్ఞప్తిచేసి చెప్తున్నా..

  • ఇది ఎంజాయ్‌ చేసే సమయం కాదు
  • స్వీయనియంత్రణ పాటించండి
  • విదేశాల నుంచి వచ్చినవారికి సీఎం విజ్ఞప్తి

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ: ‘మరొకసారి చెపుతున్న. దయచేసి మీంతట మీరే రిపోర్ట్‌ చేయండి. జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు, వైద్యాధికారులకు, మున్సిపాలిటీలకు చెప్పవచ్చు. మీకు ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేస్తారు’ అని ఇటీవల విదేశాల నుంచి తెలంగాణ రాష్ర్టానికి వచ్చినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తిచేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నవారు మాకు పెద్దఇండ్లు ఉన్నాయి. అక్కడికి పోతామంటే అనుమతించాం. కానీ, కొంద రు బయటతిరుగుతున్నరు. ఎన్నికలకు ఉపయోగించే ఇంకుతో స్టాంపువేయడంతో ప్రజలు వారిని గుర్తించి వాహనాలు, రైళ్ల నుంచి దించుతున్నారు. 

ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు’ అని కోరారు. ఇది హాలిడేస్‌ లాగా ఎంజాయ్‌ చేసే సమయం కాదు.. ప్రపంచమంతా బయోత్పాతంతో ఉన్నదని.. దీనిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటించాలని, ఒక వారం రోజుల నియంత్రణ ఒక జీవితాన్ని.. భవిష్యత్‌తరాన్ని కాపాడుతుందని చెప్పారు. సికింద్రాబాద్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన దంపతులు క్వారంటైన్‌లో ఉండకుండా ఇంటికి వెళ్లి.. వారి కుమారుడికి వైరస్‌ అంటించారు. ఇలాంటివి మనకు గుణపాఠం కావాలి.. మన కుటుంబాన్ని మనమే ధ్వంసం చేసుకుందామా..? అని ప్రశ్నించారు. ‘మీరు ఇండ్లను వదలకండి. రాష్ట్రంలో దాదాపుగా 6 వేల బృందాలు పనిచేస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోకూడా ఇన్ని బృందాలు లేవు. ప్రపంచమంతా మనల్ని ప్రశంసిస్తున్నది. మనం చాలాహైపర్‌ యాక్టివ్‌గా ఉన్నాం. క్వారంటైన్‌లో ఉన్నవారితో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నాయి’ అని సీఎం పేర్కొన్నారు. 

డేగకండ్లతో ప్రభుత్వ పర్యవేక్షణ 

1897 యాక్ట్‌ ప్రకారం ఎలాంటి అధికారమైనా ప్రభుత్వానికి ఉంటుంది.. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎదుర్కొవడానికి విశేషమైన అధికారాలు ఉన్న చట్టం అని కేసీఆర్‌ తెలిపారు. ఈ అధికారాలను కలెక్టర్లకు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఆదివారం కలెక్టర్లు, ఎస్పీలతో రెండుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారని.. ప్రభుత్వం అన్ని పరిస్థితులను డేగకండ్లతో పర్యవేక్షిస్తుందని చెప్పారు. ‘రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా కాపాడుకుంటాం. ఏ ఇబ్బంది కూడా రానివ్వం. ప్రజల సహకారం కావాలి. సంక్షోభం సమయమిది. భూతం పట్టిపీడిస్తున్నది. పౌర బాధ్యత, స్వయం నియంత్రణకు సంబంధించిన విషయమిది’ అని పేర్కొన్నారు.


logo