మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 17:02:19

విదేశాల నుంచి వచ్చేవారికి దండం పెట్టి చెబుతున్నా...

విదేశాల నుంచి వచ్చేవారికి దండం పెట్టి చెబుతున్నా...

హైదరాబాద్‌ : విదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన వారు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో గానీ, తహసీల్దార్‌ కార్యాలయంలో గానీ రిపోర్ట్‌ చేయాల్సిందిగా చేతులు ఎత్తి మొక్కుతున్నా.. దండం పెట్టి చెబుతున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... కరోనా వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. మనకున్న ప్రమాదమల్లా విదేశాల నుంచి వచ్చినవారితోనేనన్నారు. అది మన రాష్ట్రంవారు కావచ్చు. మన దేశస్థులు కావచ్చు. ఇతర దేశస్తులు కావచ్చన్నారు. మార్చి 1వ తేదీ నుండి ఇప్పటి వరకు విదేశాల నుంచి 20 వేల పైచిలుకు రాష్ట్రంలోకి వచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 21కు చేరుకుందన్నారు. వీరిలో అందరికి అందరూ బయటి దేశం నుంచి వచ్చినవారేనన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు జాయింట్‌ యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 11 వేల మందిని గుర్తించి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీళ్లను 14 రోజులు పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వైద్యులు వారిని కలిసి కౌన్సెలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. వీరిలో ఎవరికైనా అస్వస్థత అయితే వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తారన్నారు. 

అంతరాష్ట్ర సరిహద్దులో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో సీఎంవో, సీఎస్‌, డీజీపీ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి మీద సీరియస్‌గా నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికి పరిస్థితి ప్రభుత్వ కంట్రోలోనే ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లందరికి కూడా చేతులెత్తి.. దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే విదేశాల నుంచి వచ్చినరో.. వారు మా బిడ్డలే. మావోళ్లే.. మీరు అత్యుత్సాహంలో బయటకు పోయి.. మీ కుటుంబాన్ని చెడగొడతరు.. సమాజాన్ని చెడగొడుతారు.. అది మంచిది కాదు. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చినరో వారు సమాజహితం కోరి సహకరించాలన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా తమ ప్రయాణ వివరాలను అందించాలన్నారు. దేశం, ప్రపంచం పరేషాన్‌లో ఉన్న సమయంలో తప్పించుకు తిరగడం తగదన్నారు. మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా.. మీ అంతట మీరే.. పీఎస్‌లోనో, తహసీల్‌ ఆఫీస్‌లోనే రిపోర్ట్‌ చేయాల్సిందిగా సీఎం కోరారు. 

విదేశాల నుంచి వచ్చినవారిని అరెస్టేం చేయరని.. వ్యాధి లక్షణాలు ఉంటే రిఫర్‌ చేస్తరని.. లేకపోతే ఒక స్టాంప్‌ వేసి మీ ఇంట్లోనే ఉంచుతారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉదయం సాయంత్రం వైద్యులు వచ్చి వారిని పరీక్షించి యోగక్షేమాలు తెలుసుకుంటారన్నారు. అంతే తప్ప వారినేం ఇబ్బంది పెట్టరన్నారు. సహకరిస్తే మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం, మన రాష్ట్ర క్షేమం, మన దేశం క్షేమం, మన ప్రపంచ క్షేమం, మొత్తం మానవ జాతి క్షేమం ఉంటుందన్నారు. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల నుంచి వస్తే స్వచ్ఛందంగా చెప్పాల్సిందిగా కోరుతున్నట్లు సీఎం అన్నారు. ఇది మీ సామాజిక బాధ్యత అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే తక్షణమే రిపోర్ట్‌ చేయాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి జరిగేటటువంటి ప్రయత్నాల్లో మీ సహకారం చాలా చాలా అవసరమన్నారు. మీకేం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ప్రభుత్వమే అన్ని భరించి చికిత్స అందిస్తుందన్నారు. మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండద కావునా మీఅంతట మీరే రిపోర్ట్‌ చేయాల్సిందిగా సీఎం సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్లాగు తప్పించుకోలేరు. 63 వేల పోలీస్‌ సిబ్బంది, మొత్తం ప్రభుత్వ సిబ్బంది వారి ఆచూకీకై సర్వే చేస్తుందన్నారు. రాష్ర్టాన్ని కాపాడుకోవాలి కాబట్టి గ్రామ సర్పంచ్‌లకు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు తాను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మీ మీ గ్రామాల్లో, మీ మీ బస్తీల్లో విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే తక్షణమే సమాచారం ఇవ్వండని సీఎం పేర్కొన్నారు.


logo
>>>>>>