మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 02:15:15

తొమ్మిది రోజులు లాక్‌డౌన్‌

తొమ్మిది రోజులు లాక్‌డౌన్‌

 • 31 దాకా రాష్ట్రంలో సర్వం బంద్‌: సీఎం
 • జనతా కర్ఫ్యూ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం
 • చారిత్రాత్మక అద్భుతాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సమాజం 
 • సంఘీభావం తెలిపిన ప్రతి తెలంగాణబిడ్డకు ధన్యవాదాలు
 • ఆదివారంతో విదేశాల నుంచి వచ్చేవారి బాధపోయింది
 • ఇప్పటికే వచ్చినవారు అధికారులకు సహకరించండి
 • ఇటలీ దేశంలో నెలకొన్న దుర్గతి మనకు రావొద్దు
 • వైరస్‌వ్యాప్తిని నిరోధిస్తే కరోనాపై విజయాన్ని సాధించినట్టే
 • ‘మేమంతా ఒకటి.. దేన్నైనా ఎదుర్కోగలం’ అనే సంఘీభావ సంకేత ప్రదర్శన
 • ప్రగతిభవన్‌లో మీడియాతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 

ఇదొక మాయా యుద్ధం. శత్రువు కంటికి కనిపించడు. కానీ ప్రాణానికే సవాల్‌ విసురుతాడు. మాయాసురుడు మార్మికంగా దూరి మనిషిని మనిషికి అనుమానితుడుగా మారుస్తాడు.

మానవ జాతి చరిత్రలో ఎరుగని సంక్షోభమిది. ప్రపంచమే ఒక కుగ్రామం అన్న గ్లోబలైజేషన్‌ యుగం లో, దేశాలకు దేశాలు, రాష్ర్టాలకు రాష్ర్టాలు, జిల్లాలకు జిల్లాలు, ఊర్లకు ఊర్లు, కాలనీలకు కాలనీలు, ఇండ్లకు ఇండ్లు, చివరికి మనిషికి మనిషి అడ్డుగోడలు కట్టుకునే విపత్కర పరిస్థితి. కరోనా దాడిని ఎదుర్కొనేందుకు తెలంగాణ మరో అడుగు ముందుకేసింది. చరిత్రలో తొలిసారి జనతా కర్ఫ్యూ పేరుతో రాష్ట్రవ్యాప్త బంద్‌ పాటించిన తెలంగాణ, ఇప్పుడు ఏకంగా 9 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించుకుంది. సోమవారం నుంచి నెలాఖరుదాకా సర్వం బంద్‌ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అదే సమయంలో పేదలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం అందజేయనున్నారు.


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నెల 31దాకా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణకు విదేశాల నుంచి వచ్చేవారి రాక ఆదివారంతో నిలిచిపోయిందని.. ఇక వైరస్‌ వ్యాప్తిని నిరోధించినట్టయితే కరోనాపై విజయాన్ని సాధించినట్టేనని అన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూను తెలంగాణ సమాజం కనీవినీ ఎరుగని రీతిలో చారిత్రాత్మకంగా విజయవంతం చేసిందంటూ.. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బంది, ఇతర సిబ్బందికి.. చప్పట్లతో సంఘీభావ సంకేతాన్ని అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం నాటి స్ఫూర్తిని ఈ నెల 31దాకా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. 1897 ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ ప్రకారం ప్రకటించిన ఈ లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ తూ.చ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తిచేశారు. మీడియా సమావేశంలో సీఎం పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. 

అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు

‘ప్రపంచాన్ని భయకంపితంచేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ప్రధాని మోదీతోపాటు నేనుకూడా ఒక (జనతా కర్ఫ్యూ) పిలుపునిచ్చాం. కనీవినీ ఎరుగనిరీతిలో, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ప్రజలు ఇండ్లకే పరిమితమై అద్భుతాన్ని ఆవిష్కరించారు. నేను ఏదైతే కోరానో దాన్ని గౌరవించి రెండు పనులుచేశారు. ఒకటి.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఇండ్లకే పరిమితమై ప్రపంచంలోని మానవాళికి తెలంగాణ మంచి కంట్రిబ్యూషన్‌ ఇచ్చింది. రెండోది.. సంఘీభావ సంకేతం. కొందరికి పిచ్చిపిచ్చి ఆలోచన ఉండొచ్చు గానీ.. ఇది మంచిదని నేను ముందుగానే విజ్ఞప్తిచేశా. సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లు చరిచి సంఘీభావ సంకేతం ప్రదర్శించాలని కోరాను. తెలంగాణ సమాజం అద్భుతంగా ఆ సంకేతాన్ని ప్రకటించింది. ‘మేమంతా ఒకటి.. దేన్నైనా ఎదుర్కోగలం’ అనే ఒక సంఘీభావ సంకేత ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇంతమంచి ప్రదర్శన, ఐక్యత, విజ్ఞతను చాటిచెప్పిన ప్రతి తెలంగాణ బిడ్డకు పేరుపేరునా నా తరఫున, ప్రభుత్వం తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు తెలుపున్నా. 

సురక్షితంగానే 26 మంది

దురదృష్టవశాత్తు ఆదివారం కూడా ఐదు కేసులు పాజిటివ్‌గా వచ్చినయి. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే. ఇద్దరు లండన్‌, ఇద్దరు దుబాయ్‌, ఒకరు స్కాట్లాండ్‌ నుంచి వచ్చారు. అయితే ఎవరి పరిస్థితి కూడా విషమంగా లేదు. వాళ్లు మంచిగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నరు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన 26 మంది చికిత్స పొందుతున్నరు. వాళ్లంతా మంచిగ తిరిగి ఇంటికి పోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. 

విదేశీయుల రాక బంద్‌

అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ ద్వారా సంభవిస్తున్న అనేక పరిణామాలను రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై చర్చించింది. ఆదివారం నుంచి ఒక ప్రమాదం తప్పిపోయింది. ఇతర దేశాలనుంచి దేశానికి వచ్చే వ్యక్తులు ఆగిపోతున్నరు. పోర్టులు, విమానాశ్రయాలు బంద్‌ అయినవి. ఒక్క విమానం మాత్రం అమెరికా చికాగో నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రావాల్సి ఉన్నది. అది ఇప్పటికే ఢిల్లీకి వచ్చింది. అక్కడినుంచి ఇక్కడికి వస్తది. ఇక విదేశాల నుంచి దిగుమతి అయ్యే బీమారీ అవస్థ తప్పిపోయింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చినవారు హోం క్వారంటైన్‌గానీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లోగానీ ఉన్నరు. మిగతా పాజిటివ్‌ వచ్చినవారు చికిత్సలో ఉన్నరు. ఒకేఒక్క స్థానిక వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమించింది. ఇక వేరే రిపోర్టులు లేవు. అంటే వేగంగా ఇతరవ్యక్తులకు సంక్రమిస్తున్నట్టుగా లేదని తెలుస్తున్నది. 


ఇక వ్యాప్తిని కట్టడిచేయడమే బాధ్యత

విదేశాల నుంచి వచ్చేవారు ఎలాగూ ఆగిపోయినందున ఇక్కడ వైరస్‌ వ్యాప్తికాకుండా కట్టడిచేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉన్నది. ఎవరో వచ్చి సాయంచేసే సమయం కాదిది. మనం కోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం అందరం.. పరితపించి, పట్టుదలతో పనిచేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే దయచేసి ఈ రోజు (ఆదివారం) చూపిన క్రమశిక్షణ, పట్టుదల కచ్చితంగా మార్చి 31 దాకా చూపించాలి. అప్పటివరకు ఇదేవిధంగా ఇంటికే పరిమితమైతే మనం అద్భుతంగా విజయం సాధించవచ్చు. ఈ కరోనాను తరిమికొట్టొచ్చు. మన సమాజం, మన కుటుంబం, మన పిల్లలు కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండొచ్చు. ఇది సర్వజనుల హితం కోరి చెప్పే మాటయినందున అందరూ తూ.చ. తప్పకుండా పాటించాలి. 

నంబర్‌వన్‌ హైదరాబాద్‌

జనతా కర్ఫ్యూకు సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు ప్రజలు చాలా గొప్పగా సహకరించారు. జాతీయ న్యూస్‌ చానళ్లలో హైదరాబాద్‌, ముంబై నంబర్‌వన్‌ స్థాయిలో లాక్‌డౌన్‌ అయ్యాయని చెప్పారు. ఇది మన అందరికీ గర్వకారణం. మనల్ని మనం కాపాడుకోవడంలో ఎంత గొప్పగా ముందుకుపోతున్నాం. చప్పట్లు కొట్టే రూపంలో సంఘీభావ సంకేతాన్ని గొప్పగా పంపించాం. అందరికీ ధన్యవాదాలు. ఈ వారం రోజులు ఎవరి ఇండ్లలో వారు ఉండి, ఇంట్లో చేయదగ్గ పనులు చేయండి. మొక్కలు నాటండి. గడపలోపల చేసే పనులు చేయండి. ఈ వారం రోజులు గడిపితే మనం మొత్తం మహమ్మారి బాధ నుంచి తప్పించుకోవచ్చు. దానినుంచి సమాజాన్ని, మనల్ని, మన పిల్లలను కాపాడుకోవచ్చు. ఇది మన అందరి పౌరబాధ్యత. 

కుక్కలు మాట్లాడుకుంటున్నయ్‌

ఈ రోజు సోషల్‌మీడియాలో ఒక జోక్‌ తిరుగుతున్నది.. ‘వీధుల్లో మనుషులు ఎవరూ కనపడుతలేరు, మనషులను మున్సిపాలిటీ వాళ్లు పట్టుకపోయారా’ అని కుక్కలు మాట్లాడుకుంటున్నాయట. అంటే జనతా కర్ఫ్యూకు ఎంత సీరియస్‌గా ప్రజలు సహకరించారో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలకు మరోసారి థ్యాంక్స్‌ చెప్తున్న. అద్భుతంగా కర్ఫ్యూ పాటించారు. హైదరాబాద్‌ సిటీనే కాకుండా అన్ని పట్టణాల్లో పాటించారు. మండలకేంద్రాలు, మారుమూల గ్రామాల్లో స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించారు.

ఆ దుర్గతి మనకు రావొద్దు

ఒకసారి వ్యాధి విస్తరిస్తే దానిని తట్టుకోలేం. అందుకే నియంత్రణ పాటిద్దాం. మరో వారంరోజులు నియంత్రణ పాటిస్తే చాలు. ఒక మహమ్మారి, విపత్తు, కఠినసమయం ఇది. ప్రపంచంలో ఇప్పటివరకు 3,08,547 మంది మహమ్మారి బారినపడ్డారు. ఆదివారం ఒక్కరోజే 3,557 కేసులు నమోదయ్యాయి. 13,069 మంది దాకా చనిపోయారు. ప్రధానంగా దెబ్బతింటున్నది ఇటలీ దేశం. వాళ్లింటిని వాళ్లే చెడగొట్టుకున్నారు. నియంత్రణ చేసుకోలేదు. కాబట్టి అక్కడ రోజుకు 500 నుంచి 700 మంది వరకు చనిపోతున్నారు. ఆ దుర్గతి మనకు రావద్దంటే మనమందరం స్వీయ నియంత్రణ పాటించాలి. అదే మనకు శ్రీరామరక్ష.

1897 చట్టం ప్రకారం లాక్‌డౌన్‌

 వ్యాధులు ప్రబలినపుడు అత్యవసర సమయాల్లో అమలుచేసే 1897 ఎపిడమిక్స్‌ డిసీస్‌ యాక్ట్‌ (అంటువ్యాధుల నియంత్రణ చట్టం) కింద ఈ లాక్‌డౌన్‌ను నోటిఫై చేసినం. ఈ చట్టానికి విశేషాధికారాలుంటయి. దాని కిందనే ఉత్తర్వులు జారీచేసినం. ఆ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ మొత్తం మార్చి 31 వరకు లాక్‌డౌన్‌లో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లుదాటి బయటకు రావొద్దు. ఐదుగురికి మించి ఎట్టి పరిస్థితుల్లో బయట కూడవద్దు. బయటికొచ్చినా కూడా ఇద్దరి మధ్య మూడుఫీట్ల దూరం ఉండాలి. ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసరాల వంటి అత్యవసరవస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక్కవ్యక్తిని మాత్రమే అనుమతిస్తరు. అది కచ్చితంగా తూ.చ. తప్పకుండా పాటించాలి. వీలైనంతవరకు బయటకు వెళ్లినపుడు 2-3 రోజులకు సరిపడా వస్తువులు, సరుకులు తెచ్చుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలనే సోయిఉండాలే తప్ప ఇంకెవరో చెప్తరు, ఇదో బలవంతం అని అనుకోవద్దు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి.. ఏ కుటుంబానికి ఆ కుటుంబం.. ఆదివారం చూపించిన స్ఫూర్తిని ప్రదర్శించాలి. పౌరులందరికీ పదే పదే విజ్ఞప్తిచేస్తున్నాం. మీరు ఇండ్లకే పరిమితమవ్వాలి. లేని ఇబ్బందులు కొనితెచ్చుకోకండి. సమాజానికి ఇబ్బందులు తీసుకురాకండి. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహయింపు ఉంటుంది. వాటర్‌సైప్లె, విద్యుత్‌ సరఫరా, ఫైర్‌ సర్వీస్‌, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు వంటి సర్వీసులు పనిచేస్తాయి.

ఇవీ నిర్ణయాలు

 • రాష్ట్రంలో అత్యవసర సేవలు కొనసాగుతాయి
 • లాక్‌డౌన్‌ సమయంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు జీతాలు
 • అసంఘటిత కార్మికులకు యాజమాన్యాలు చెల్లించాల్సిందే
 • రాష్ట్ర సరిహద్దులన్నీ మూత
 • ప్రజా రవాణా పూర్తిగా బంద్‌
 • సరుకుల వాహనాలకు అనుమతి
 • విద్యాశాఖ సంబంధ కార్యకలాపాలు అన్నీ బంద్‌
 • అంగన్‌వాడీలూ మూత.. నేరుగా ఇండ్లకే సరుకులు
 • అత్యవసర ప్రభుత్వశాఖల ఉద్యోగులే  వందశాతం విధులకు హాజరు
 • కరోనా కట్టడికి 1897 ఎపిడమిక్స్‌ డిసీజెస్‌ యాక్ట్‌ అమలు
 • ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల కోసం అమ్మఒడి వాహనాలు సిద్ధం
 • అందుబాటులో కూరగాయలు, పాలు, కిరాణా షాపులు 
 • నీరు, విద్యుత్‌ సరఫరా, ఫైర్‌ సర్వీసు, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయి
 • అత్యవసరంకాని శస్త్రచికిత్సలు వాయిదా
 • డాక్టర్లకు ఓవర్‌ బర్డెన్‌ కాకుండా చూస్తాం
 • ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గుమిగూడవద్దు
 • ఇండ్లకే పరిమితం అవ్వండి


 ఎవరో వచ్చి సాయం చేసే సమయం కాదిది. మన కోసం మనం.. జనం కోసం జనం.. అందరి కోసం అందరం.. పరితపించి పట్టుదలతో పని చేసుకోవాల్సిన పరిస్థితి ఇది.  ఆదివారం చూపిన క్రమశిక్షణ ఈ నెల 31 దాకా  చూపించాలి.

- ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు


logo
>>>>>>