గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 01:51:19

రోజూ 40 శ్రామిక్‌ రైళ్లు

రోజూ 40 శ్రామిక్‌ రైళ్లు

  • వలస కార్మికుల తరలింపునకు వారం రోజులపాటు ప్రత్యేక రైళ్లు
  • నేటి నుంచే ప్రారంభం
  • హైదరాబాద్‌, ఖమ్మం, రామగుండం,వరంగల్‌,  దామరచర్ల నుంచీ రైళ్లు
  • సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం 
  • ఠాణాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే అంశంపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఖర్చులతోనే కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ర్టాలకు వారంపాటు రోజూ 40 ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది. వలస కార్మికుల అంశంపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాతో మాట్లాడిన సీఎం మంగళవారం నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా వరంగల్‌, రామగుండం, దామరచర్ల, ఖమ్మం నుంచి కూడా ఈ రైళ్లు నడుపనున్నారు. బీహార్‌, ఒడిషా, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ర్టాలకు రైళ్లను నడుపనున్నారు. 

కార్మికుల తరలింపులో తెలంగాణే ముందు

వలస కార్మికుల తరలింపుపై జాతీయస్థాయిలో రాజకీయ వివాదం నడుస్తుండగానే సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కేంద్రప్రభుత్వం సహకరించకున్నా సొంత ఖర్చులతో కార్మికులను తరలించాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు రేల్వేశాఖ డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించటంతో ఆ ఖర్చులను తాము భరిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు. దాంతో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ వివాదం రాజుకుంది. సీఎం కేసీఆర్‌ మాత్రం రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జార్ఖండ్‌కు 1230 మంది కార్మికులతో తరలివెళ్లిన రైలును సైతం రాష్ట్రప్రభుత్వమే సొంతఖర్చులతో నడిపింది. ఈ రైలులో వెళ్లిన ఒక్కో కార్మికుడి టికెట్‌ కోసం ప్రభుత్వం రూ.460 చొప్పున మొత్తం రూ.5,65,800 రైల్వేశాఖకు చెల్లించింది. దేశంలో వలస కార్మికులను తీసుకెళ్లిన తొలిరైలు ఇదే కావడం గమనార్హం.

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో

భారీ సంఖ్యలో ఉన్న కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపే కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇద్దరు సీనియర్‌ అధికారులను నియమించింది. ఐఏఎస్‌ అధికారి సందీప్‌ సుల్తానియా, ఐపీఎస్‌ అధికారి జితేందర్‌రెడ్డి సంయుక్తంగా కార్మికుల తరలింపు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సొంత ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తున్న కార్మికులు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కార్మికులు ఇప్పటికే  పేర్లు నమోదు చేసుకున్నారు. వారిని ఈ ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు పంపనున్నారు. కార్మికులకు వారు వెళ్లాల్సిన రైలు వివరాలు, అవి బయలుదేరే వేళలకు సంబంధించిన వివరాలను పోలీస్‌స్టేషన్లలో తెలుపుతారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రైల్వేస్టేషన్లకు తరలించి లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత దూరం పాటిస్తూ రైళ్లలో వెళ్లేలా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భారీ మొత్తంలో రైళ్లను నడుపుతున్నందున కార్మికులందరూ తమతమ స్వస్థలాలకు వెళ్లటానికి అవకాశం ఉంటుందని సీఎం సూచించారు.

8 లీటర్ల తాగునీరు.. చపాతీలు

ఇటీవల జార్ఖండ్‌లోని హతియా వెళ్లిన శ్రామిక్‌ రైల్‌లో 1230 మంది కార్మికులను ప్రభుత్వం పంపింది. గమ్యంచేరేవరకూ అధికారులు కార్మికుల యోగక్షేమాలను పర్యవేక్షించారు. లింగంపల్లి నుంచి హతియా వరకు వెళ్లేందుకు అయ్యే సమయాన్ని లెక్కించి ప్రతీ వలస కార్మికుడికి 8 లీటర్ల మంచి నీటిని, ప్రతీ ఒక్కరికి అవసరమైన చపాతీలు, అన్నం కూడా ప్రత్యేకంగా ప్యాక్‌ చేయించి ఇచ్చారు. 


logo