ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:49:38

కల్యాణ వైభోగమే..!

కల్యాణ వైభోగమే..!

  • ఘనంగా సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం
  • రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో వేడుక 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష, హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన ఉడుముల చరణ్‌రెడ్డి వివాహాన్ని సోమవారం మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్ధుమాత చర్చి ఆవరణలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వధువు ప్రత్యూష మెడలో వరుడు చరణ్‌రెడ్డి తాళికట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వివాహ తంతు రెండు గంటలపాటు సాగింది. వధువు తరఫున సాక్షిగా మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ సంతకం చేయగా, వరుడు చరణ్‌రెడ్డి తరఫున తల్లి ఉడుముల జైన్‌ మేరీ సాక్షి సంతకంచేశారు. ఆ తర్వాత చర్చి ఫాదర్స్‌ నూతన వధూవరులకు వివాహ ధ్రువీకరణ పత్రం అందజేశారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఆర్‌అండ్‌బీ కమిషనర్‌ విజయేంద్ర బోయి, జాయింట్‌ డైరెక్టర్‌ కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, రీజినల్‌ డైరెక్టర్‌ శారద, శిశు సంక్షేమశాఖ రంగారెడ్డి జిల్లా అధికారిణి మోతీ, ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, జెడ్పీటీసీ సభ్యురాలు తాండ్ర విశాల, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఐసీడీఎస్‌ అధికారులు వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రత్యూష, చరణ్‌రెడ్డిల కొత్త జీవితం సంతోషంగా సాగాలని దీవించారు.  పాటిగడ్డలో సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక వివాహం జరుగడంపై స్థానికులు సంతోషం వ్యక్తంచేశారు.