శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 13, 2020 , 02:35:47

లాభాలొస్తే కార్మికులకే..

లాభాలొస్తే కార్మికులకే..
  • ఉద్యోగుల సమస్యలు రెండునెలల్లో తీరుస్తాం
  • సీఎం కేసీఆర్‌ వ్యూహంతో విద్యుత్‌శాఖ పురోభివృద్ధి
  • విద్యుత్‌ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ సంస్థలు అన్నివిధాలా లాభాల్లోకి వస్తే వాటిని కార్మికులకే పంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను రెండునెలల్లో తీరుస్తామని, ఎవరూ ఆగం కావొద్దని భరోసా ఇచ్చారు. బుధవారం మింట్‌కాంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్‌శాఖ వణికిస్తున్నదని, ఆ భయంతోనే తెలంగాణ మీద విషం కక్కుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో సృష్టించిన సంపద అందరికీ సమానంగా అందుతున్నదని, అదే గుజరాత్‌లో 10 శాతం మంది చేతుల్లోకి వెళ్లిపోతున్నదని, అందుకే అక్కడ పేదరికం పెరిగిపోయిందని చెప్పారు. అన్ని రంగాల్లో ఎక్కువ వేతనం అందుకుంటున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారని తెలిపారు.


అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వ్యూహంతో విద్యుత్‌శాఖను పురోభివృద్ధివైపు నడిపించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశంలోనే విద్యుత్‌ను అతి ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. మరో 20 ఏండ్ల వరకు అవసరాలు తీర్చేవిధంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేసిన ఘనత తెలంగాణ సొంతమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్‌ కోతలకు అవకాశం లేదన్నారు. రెప్పపాటు కరంటు పోకుండా చూస్తామని ఆనాడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడితే.. అదే నిజమైతే పార్టీకి రాజీనామా చేస్తానని జానారెడ్డి అన్నమాటలు ఇంకా గుర్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వనమాలతోపాటు విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సాయిలు, శ్రీధర్‌గౌడ్‌, కార్మికులు పాల్గొన్నారు.
logo