శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:34

45 రోజుల్లో 90 లక్షలు లూటీ

45 రోజుల్లో  90 లక్షలు లూటీ

  • ఐదు బ్యాంకు ఖాతాల నుంచి మాయం
  • సైబర్‌ నేరగాళ్లకు వలకు చిక్కిన ఖాతాదారులు 
  • తమకేం తెలియదంటున్న బ్యాంకులు

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి డీసీబీ బ్యాంకులో ఉన్న మూడు బ్యాంకు ఖాతాలనుంచి రూ.36 లక్షలు మాయమయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు అతని ఈ-మెయిల్‌ ఐడీలను హ్యాక్‌చేశారు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లూటీ చేశారు. అమీర్‌పేటకు చెందిన ఓ వ్యాపారి ఈ-మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. దాని ద్వారా కొత్త సిమ్‌కార్డు పొందారు. దీని సాయంతో కర్ణాటక బ్యాంకులో ఉన్న ఖాతానుంచి రూ.50 లక్షలు కాజేశారు. కెనరా బ్యాంకు ఖాతాదారు అయిన ఓ గృహిణి ఖాతానుంచి రూ. 3.6 లక్షలు మాయమయ్యాయి.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేవలం 45 రోజుల్లో హైదరాబాద్‌లోని ఐదు బ్యాంకు ఖాతాలనుంచి రూ.90 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. ఖాతాదారు ప్రమేయం లేకుండానే ఖాతాలోని సొమ్ము మాయమైంది. హైదరాబాద్‌లో ఒకే తరహాలో జరిగిన ఈ మూడు ఘటనలు కలవరపెడుతున్నాయి. దీనిపై బ్యాంకులను సంప్రదిస్తే తమకేం తెలియదంటూ చేతులెత్తేస్తున్నారని బాధితులు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యంతో సేవలు సులభతరంచేసిన బ్యాంకులు, వాటి రక్షణకు చర్యలు తీసుకోకపోవడమే గందరగోళానికి కారణమని ఖాతాదారులు అంటున్నారు. 

కెనరా బ్యాంకు ఖాతాదారైన గృహిణికి ఈ నెల 9వ తేదీన ‘మీ ఖాతాను ఎవరో తెరిచేందుకు ప్రయత్నించారు. అది మీరు కాకపోతే వెంటనే కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌కు ఫోన్‌ చేయండి’ అని సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ వచ్చింది. ఆమె కస్టమర్‌కేర్‌ నంబర్‌కు పలుసార్లు ఫోన్‌చేసినా ఎత్తలేదు. మరుసటి రోజే ఆమె ఖాతాలోనుంచి డబ్బు మాయమైంది. ఇక్కడ కస్టమర్‌కేర్‌ సర్వీస్‌ సరిగ్గా పనిచేసి ఉంటే ఆ ఖాతాను బ్లాక్‌చేసే అవకాశాలు ఉండేవి. ఈ-మెయిల్‌ ఐడీలను హ్యాక్‌ చేయడంతోపాటు బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సైబర్‌నేరగాళ్లు డార్క్‌నెట్‌ నుంచి కొని ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఖాతాలను హ్యాక్‌ చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

బ్యాంకులు అనుమానించాలి

సాధారణంగా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాను దగ్గరలో ఉండే ప్రాంతాల్లోనే తెరుస్తారు. వారు తన సొంత జిల్లా, పట్టణం, రాష్ట్రం వదిలి ఇతర రాష్ర్టాల్లోకి వెళ్లినప్పుడు బ్యాంకింగ్‌ లావాదేవీలు జరుపడం చాలా తక్కువ. బ్యాంకు ఖాతాలు హ్యాక్‌ అవుతున్నది, డెబిట్‌, క్రెడిట్‌కార్డులు డ్రా అవుతున్న ఘటనలు ఖాతాదారుడికి సంబంధం లేని ఇతర రాష్ర్టాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక ఖాతాదారుడికి సంబంధం లేని ప్రాంతాల్లో ఖాతాను యాక్సెస్‌ చేస్తే వెంటనే బ్యాంకులు అనుమానించాలి, దాన్ని నిలువరించాలి. కానీ ఇది పూర్థిస్థాయిలో జరుగడంలేదని పోలీసులు అంటున్నారు. బ్యాంకులు పటిష్టచర్యలు తీసుకోకపోవడం, ఖాతాదారులకు తగిన అవగాహన కల్పించకపోవడం వల్లే సైబర్‌నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ చెప్పారు. 

హ్యాకింగ్‌పై సీరియస్‌

సైబర్‌ నేరగాళ్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేకదృష్టి పెట్టారు. ముగ్గురికి సంబంధించిన ఐదు బ్యాంకు ఖాతాల్లోని రూ.90 లక్షలు కాజేయడం కోల్‌కతా సైబర్‌ నేరగాళ్ల పనేనని సైబర్‌క్రైం పోలీసులు నిర్ధారించారు. ఆ డబ్బు కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకులో జమఅయ్యిందని గుర్తించారు. కోల్‌కతాకు వెళ్లి ఈ సైబర్‌ ముఠా ఆటకట్టించాలని నిర్ణయించారు. స్థానికులతో కలిసి నైజీరియన్‌ సైబర్‌ నేరగాళ్లు నెట్‌ బ్యాంకింగ్‌ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు.


logo