శనివారం 06 జూన్ 2020
Telangana - May 18, 2020 , 01:20:57

పది వారాలపాటు పది నిమిషాలు!

పది వారాలపాటు పది నిమిషాలు!

  • ప్రజలను భాగస్వామ్యంచేయాలి 
  • అందరిలో చైతన్యం తీసుకురావాలి
  • కరోనా నేర్పిన పరిశుభ్రత కొనసాగాలి
  • రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు మంత్రి కే తారకరామారావు లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతను పాటిద్దామని, దీనిని ఓ సామాజిక కార్యక్రమంగా భావించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రజాప్రతినిధులకు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టడంలో ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నామని, వారి ఇండ్లనుంచే ఈ కార్యక్రమం ప్రారంభంకావాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించి వ్యాధులను దరిచేరకుండా చూద్దామన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో పురపాలకశాఖ ఇప్పటికే ఒక ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించి, వాటిని అరికట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేసిందని వివరించారు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేఖ రాశారు.

 ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ అనే కార్యక్రమంలో స్వయంగా భాగస్వాములవుతూ, ప్రజలందరినీ చైతన్యం చేస్తూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధులు రాకుండా చూద్దామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు రాసిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నదని, వైరస్‌ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలందరి సహకారంతో పోరాడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశించారని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

వ్యాధుల నివారణ మన చేతుల్లోనే..

ప్రతి వర్షాకాలంలో అనేక సీజనల్‌ వ్యాధులు మనల్ని పట్టిపీడిస్తున్న విషయం తెలుసని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. దోమల నివారణ కోసం కొన్ని జాగ్రత్తలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించే అవకాశం మన చేతుల్లోనే ఉన్నదన్నారు. ఇందుకు కావాల్సిందల్లా వారానికోసారి కనీసం పది నిమిషాలపాటైన మన కోసం, మన పరిసరాల శుభ్రత కోసం సమయం కేటాయించుకోవడమేనని తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా ఆరోగ్యశాఖ సహకారంతో పురపాలకశాఖ ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. దోమల నివారణ కార్యక్రమాల్లో భాగంగా స్ప్రే, మలాథియాన్‌ ఆయిల్‌ బాల్స్‌, ఫాగింగ్‌ చేయాలని సూచించామన్నారు. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణ స్ప్రే సైతం వారానికోసారి చేయనున్నామని తెలిపారు. మురికి కాల్వల పూడికతీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎత్తిపోయడంవంటి కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా చేపట్టాలని పురపాలక సంఘాలకు ఆదేశాలిచ్చామని వివరించారు. 

పది వారాలపాటు పది నిమిషాల కార్యక్రమం

ప్రజలను, పట్టణాలను కాపాడుకొనే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రానున్న పది వారాలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఇండ్లు, పరిసరాల్లో దోమలు నిలిచేందుకు ఆస్కారమున్న వాటిని శుభ్రం చేసుకోవడం, యాంటి లార్వా కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా లేఖలో కోరారు. ఎమ్మెల్యేలు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇండ్లనుంచే ప్రారంభించాలని సూచించారు. తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రజారోగ్యంపై చైతన్యం తీసుకొచ్చేలా పరిసరాల పరిశుభ్రత ఓ సామాజిక కార్యక్రమంగా ప్రజలు భావించేలా ప్రచారం చేయాలని తెలిపారు. పురపాలకశాఖ ద్వారా పూర్తి సహాయసహకారాలు అందిస్తామని, సీజనల్‌ వ్యాధుల కట్టడికి చేపట్టే కార్యక్రమాలు కరపత్రాలు, స్థానిక మీడియా వంటి మార్గాలను సంపూర్ణంగా ఉపయోగించుకొని ప్రజలకు చేరేలా చూడాలన్నారు. అందరం కలిస్తే వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించగలమన్న నమ్మకం ఉన్నదని విశ్వాసం వ్యక్తంచేశారు.  


logo