శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 01:07:06

ప్రతి చోట కరోనా వేట

ప్రతి చోట కరోనా వేట

  • విదేశాల నుంచి వచ్చినవారిపై నజర్‌
  • జల్లెడ పడుతున్న ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు
  • ఎక్కడికక్కడే గుర్తిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది
  • రాష్ట్రవ్యాప్తంగా 5,274 బృందాలతో తనిఖీ
  • అక్కడికక్కడే స్క్రీనింగ్‌.. ఇతర పరీక్షలు
  • అనుమానం వస్తే గాంధీకి తరలింపు
  • స్టాంపులు వేసి ఇంట్లోనే స్వీయనిర్బంధం  
  • 14 రోజులు ఎక్కడికీ కదలవద్దని షరతు
  • అడుగు బయటపెట్టకుండా పోలీసుల కట్టడి

ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఆశాలు, అంగన్‌వాడీలు, పురపాలక సిబ్బంది లొల్లి లేదు.. లోకాంతం లేదు గడబిడ  లేదు.. గందరగోళం లేదు 

ప్రశాంతంగా ఎవరికివారు, ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనాపై నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నది. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసులు, నర్సులు, వైద్యులు, మంత్రులు.. ఒకరేమిటి, ఏ విభాగం దాని  పని అది చేసుకుపోతున్నది. అవరోధాలను లెక్క చేయకుండా, పనిలో లెక్క తప్పకుండా! విదేశాల నుంచి వస్తున్న వారిపై గ్రామ, నగర స్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఓ కన్నేసి ఉంచుతున్నారు. వచ్చిన విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు సదరు వ్యక్తులను గుర్తిస్తున్నారు. గంటలోపే ఏడెనిమిది మంది వైద్యులు ఆ ఇంట్లో వాలిపోయి, వారిని పరీక్షిస్తున్నారు. కరోనా లక్షణాలుంటే తక్షణమే దవాఖానకు! లేదంటే 14 రోజులు ఇంట్లోనే ఉండాలని ఆదేశిస్తున్నారు. వివిధ విభాగాలను సమన్వయం చేస్తూ, ప్రజలకు ధైర్యం చెప్తూ, సీఎం కేసీఆర్‌ ప్రతి నిమిషం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చారు. ఎవరి కంటపడకుండా ఇంట్లో ఉంటున్నారు. గ్రామంలోని ఆశ వర్కర్‌ గమనించి ఏఎన్‌ఎం, సర్పంచ్‌కు తెలియజేసింది. నిమిషాల వ్యవధిలోనే ఆ సమాచారం మండల్‌ పరిషత్‌ ఆఫీసర్‌, స్థానిక ఎైస్సె, వైద్యాధికారికి చేరింది. గంటలో అధికారుల బృందం దుబాయ్‌ నుంచి వచ్చిన వారి ఇంటిముందు ప్రత్యక్షమైంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయగా ఆరోగ్యంగానే ఉన్నారని తేలింది. అయినప్పటికీ 14 రోజులపాటు ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టవద్దని చెప్పివెళ్లారు. పోలీసులు వీరి కదలికను నిరంతరం గమనిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన విషయం, ఒకే వీధిలో ఉండే తమకే తెలియదని.. ఇంతమంది అధికారులకు ఎలా తెలిసిందని గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.  

స్పెయిన్‌ నుంచి ఓ వ్యక్తి వారం కిందట శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడే అతనికి థర్మల్‌ స్క్రీనింగ్‌, సామగ్రికి శానిటైజ్‌ చేసి ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. వివరాలు తీసుకొని 14 రోజులపాటు స్వీయనిర్బంధంలో ఉండాలని సూచించారు. సరేనన్న ఆ వ్యక్తి బంజారాహిల్స్‌లోని ఇంట్లో ప్రత్యేకగదిలోనే ఉన్నారు. మూడురోజులకు ఒకసారి చొప్పున ఇప్పటికే రెండుసార్లు పోలీసులు, వైద్యుల బృందం ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసింది. గడువు ముగిసేవరకు ఇంట్లోనే ఉండాలని, ఎవరినీ కలువొద్దని.. సమస్య ఉంటే  తెలియజేయాలని ఫోన్‌నంబర్‌ ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో ఇంటిఅడ్రస్‌ ఎక్కడా పేర్కొనలేదని, ఎలా వచ్చారని అతను ప్రశ్నించగా, విమానయానసంస్థ నుంచి అందరి చిరునామాలు తీసుకున్నామని చెప్పారు. 

ఈ రెండు సంఘటనలు పరిశీలిస్తే, ఇటీవల రాష్ట్రంలోకి అడుగుపెట్టినవాళ్లు ఎక్కడున్నా గుర్తించి వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం పక్కా నిఘావ్యవస్థ ఏర్పాటుచేసుకున్నట్టు స్పష్టమవుతున్నది. విదేశాల నుంచి వచ్చేటప్పటికే కొంతమందికి వైరస్‌సోకి ఉంటున్నది. కనీసం పదిరోజులు గడిస్తేనే దానిప్రభావం కనిపిస్తున్నది. వీరే వాహకాలుగా మారడంతో వైరస్‌ వ్యాపిస్తున్నది. అంతేతప్ప రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరికి వైరస్‌ సోకిన దాఖలాలు లేవు. అందుకే ప్రభుత్వం విదేశాల నుంచి వస్తున్నవారిపై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 20 వేల మంది విదేశాల నుంచి వచ్చినట్టు సమాచారం. వీరందరికీ ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నప్పటికీ, సొంతప్రాంతలకు వెళ్లాక అజాగ్రత్తంగా ఉండే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు కొందరు వేర్వేరు రాష్ట్రాల్లో విమానాలు దిగి, రైలు, రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని జిల్లాలకు చేరుకొనే అవకాశం ఉన్నది. అందుకే వీరందరినీ తక్షణం గుర్తించి ఇంటికే పరిమితం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ  మంత్రి ఈటల కూడా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కంటిమీద కునుకులేకుండా నిరంతరం కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 


అంతటా అప్రమత్తం 

వాడవాడలా ఇంటింటికి పరిచయం ఉండే ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో నిఘా సభ్యులుగా ఉంటున్నారు. గ్రామంలోకి విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరువచ్చినా ఉన్నతాధికారులకు తక్షణం సమాచారం చేరవేస్తున్నారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కొత్తవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని డప్పు చాటింపు చేయిస్తున్నారు. మండల పరిషత్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి, పోలీసులు, వైద్యాధికారులు సమాచారం అందగానే 108లో వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి స్వీయనిర్బంధంలో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ జాగ్రత్తలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, ప్రముఖ పట్టణాలు సహా, అన్ని మున్సిపాలిటీలపరిధిలోనూ మున్సిపల్‌ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తిస్తున్నారు. 

ప్రత్యేకంగా వైద్య సిబ్బంది 

హైదరాబాద్‌లో గాంధీ, చెస్ట్‌, ఫీవర్‌, కింగ్‌కోఠి దవాఖానల్లో 1200 మంది వైద్య సిబ్బంది కరోనాపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ సోకినవారిని గుర్తించడానికి సర్వేలైన్స్‌ బృందాలు శ్రమిస్తున్నాయి. హైదరాబాద్‌లో 300 మంది బృందాలుగా విడిపోయి నగరాన్ని జల్లెడ పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారి ఎడమచేయి మణికట్టుపై 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలంటూ ప్రత్యేకంగా స్టాంపు వేస్తున్నారు. ఎన్నికలపుడు వేసే సిరాను ఉపయోగిస్తున్నారు. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు తమకు వైరస్‌ సోకుతుందనే భయాన్ని సైతం పక్కనపెట్టి పౌరుల క్షేమమే ధ్యేయంగా అలుపెరగకుండా పనిచేస్తున్నారు. 

రంగంలో 5,274 పర్యవేక్షణ బృందాలు 

కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులతో 5,274 బృందాలు ఏర్పాటయ్యా యి ఈ బృందాలు ఇప్పటివరకు 11 వేల మందిని గుర్తించి ఇండ్లలో నిర్బంధించి నిఘాపెట్టాయి. కరోనాపై వదంతులు వ్యాప్తిచేసే వారిపై కేసులు సైతం నమోదయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో సోషల్‌మీడియాలో నకిలీ సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు నిఘాపెట్టారు. 


logo