బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:38

పది పరీక్షల రద్దుపై హర్షం

పది పరీక్షల రద్దుపై హర్షం

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల కృతజ్ఞతలు
  • స్వాగతించిన పాఠశాలల యాజమాన్యాలు.. ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్నల్‌ మార్కుల ద్వారా గ్రేడ్‌లు ఇచ్చి, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌చేయడాన్ని స్వాగతించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్‌టీఎస్‌ రాష్ట్ర నాయకుడు జంగయ్య, చావ రవి, ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకుడు సదానందంగౌడ్‌, పర్వతరెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర నాయకుడు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య, టీపీయూఎస్‌ రాష్ట్ర నాయకుడు హన్మంతురావు, నవాత్‌ సురేశ్‌, టీఆర్‌ఎస్వీ నాయకుడు శ్రీనివాసయాదవ్‌, కిషోర్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పది పరీక్షల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ట్రస్మా నాయకులు ఎస్‌ మధుసూధన్‌, పీ నాగేశ్వర్‌రావు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బాలల హక్కులసంఘం కన్వీనర్‌ గుండు కృష్ణయ్య, కో కన్వీనర్‌ ఇంజమూరి రఘునందన్‌ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. 

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

టవర్‌ సర్కిల్‌ (కరీంనగర్‌): కొవిడ్‌-19 నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దుచేసిన సీఎం కేసీఆర్‌కు ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాల తరపున కృతజ్ఞతలు. ఇందుకు సహకరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో 5,34,903 మంది పదో తరగతి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ప్రజల ఆకాంక్షలను నేరవేర్చే సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులను వైరస్‌ భయాందోళన నుంచి దూరం చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి లోకం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి విద్యాభివృద్ధిలో తెలంగాణను ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి కంకణబద్ధులై ఉంటాం. 

- యాదగిరిశేఖర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ట్రస్మా 


logo