ఫలితాలపై మధ్యాహ్నం 3 గంటలకు స్పష్టత

హైదరాబాద్: మరికొద్దిసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. అయితే 18 ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. దీంతో ఫలితాలు కొంత ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉన్నది. కాగా, మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం ఉది. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడవుతాయి.
మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈసారి 1926 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. తొలి పది నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తవుతుంది. తర్వాత ప్రాథమిక లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
రెండు దశల్లో లెక్కింపు
రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. మొదట బాక్సుల్లోని ఓట్లను ప్రాథమికంగా లెక్కిస్తామని, తర్వాత అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసీ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు ప్రాథమిక లెక్కింపు పూర్తవుతుందని, వివరణాత్మక లెక్కింపు మధ్యాహ్నం 3 గంటల్లోపు పూర్తవుతుందని వెల్లడించింది. ఒక్కో రౌండ్లో 14 వేట్ల ఓట్లను లెక్కిస్తామని తెలిపింది. ఓట్ల లెక్కింపుకోసం 150 డివిజన్లలో 30 కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కౌంటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని వెల్లడించింది. ఓట్ల లెక్కింపు కోసం 8152 సిబ్బందిని కేటాయించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి పరిశీలకుడిని నియమించింది. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫి, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7.45 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లను తెరుస్తారు.
ఆర్ఓదే తుదినిర్ణయం
సందేహాత్మక ఓట్లు, రీకౌంటింగ్‌పై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని ఎస్ఈసీ ప్రకటించింది. కౌంటింగ్ పరిశీలకుని అనుమతి తీసుకున్నతర్వాతే ఫలితం ప్రకటిస్తామని వెల్లడించింది. అందువల్ల ఫలితం ప్రకటించేకంటే ముందే రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా ఫలితం తేలుస్తామని వెల్లడించింది.
150 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 150 స్థానాల్లో పోటీచేయగా, కాంగ్రెస్ 146, బీజేపీ 149, ఎంఐఎం 51, టీడీపీ 106 స్థానాల్లో పోటీచేశారు. జంగంమెట్ డివిజన్లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులుండగా, ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌కుంట, జీడిమెట్ల, టోలిచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, ఎన్నికల్లో పోటీచేసినవారిలో 420 మంది వ్యాపారులు, 317 మంది గృహిణులు, 27 మంది విద్యార్థులు, 9 మంది లాయర్లు, ముగ్గురు చొప్పున టీచర్లు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు.
46.55 శాతం పోలింగ్
డిసెంబర్ 1న గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే గుర్తులు తారుమారు కావడంతో పాత మలక్‌పేటలో ఓల్డ్ మలక్పైటలో నిన్న రీపోలింగ్ జరిగింది. మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇప్పటివరకు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఇదే అత్యధికం. గత ఎన్నికల్లో (2016) 45.29 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఈ ఎన్నికల్లో మొత్తం 34,50,331 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.