శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 00:39:16

చప్పట్లు కొట్టాలి

చప్పట్లు కొట్టాలి

  • ప్రధానిని అవహేళన చేయడం సరికాదు
  • ముఖ్యమంత్రి  కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం ప్రజలంతా బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఈ పిలుపుమీద కొందరు సోషల్‌మీడియాలో అవహేళనచేసేలా పోస్టులు పెట్టారని, అది సరికాద న్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో వందల పిలుపులిచ్చాం. బెల్స్‌ కొట్టమన్నం. లేకుంటే ఇండ్లల్లో ప్లేట్లు, చెంచాలు కొట్టమన్నం. అది ఐక్యతకు నిదర్శనం. సిటీల్లో, అపార్ట్‌మెంట్లలో ఉన్నవాళ్లు బాల్కనీలకు వచ్చి, గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో సాయంత్రం ఐదుగంటలకు బయటకు వచ్చి రెండు చేతులతో చప్పట్లు కొట్టాలని చెప్పారు. ఎందుకంటే అది జాతి ఐక్యతను ప్రదర్శించే ప్రక్రియ. రూపాయి ఖర్చు పెట్టమనలేదు. 

బరువులు మోయమనలేదు కదా.. రెండు చేతులతో చప్పట్లు కొట్టితే తప్పేంది? ఊరంతా చప్పట్లు మారుమోగుతయి. దీనికి కొంతమంది వక్రబుద్ధితో పనిలేకుండా ప్రధానిని కూడా అవహేళన చేసేలా పోస్టులు పెడుతున్నారు. డీజీపీకి చెప్పుతున్నా.. ఇటువంటి వారిని అరెస్ట్‌చేయాలి. ప్రధాని అంటే గౌరవించాలి. ఐదు గంటలకు నేను కూడా ఎక్కడున్నా చప్పట్లు కొడతా.. మా కుటుంబ సభ్యులంతా కొడుతరు. మా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ చప్పట్లు కొడుతరు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రం నలుమూలల సైరన్‌ వినిపించేలా ఏర్పాటుచేశాం. ఇంట్లో ఉన్నోళ్లందరూ బయటకు వచ్చి నాలుగు నిమిషాలు చప్పట్లు కొట్టాలని కోరుతున్నా’ అని సీఎం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.


logo