మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:38:43

త్వరలో హైదరాబాద్‌లో సివిల్‌ రైట్స్‌డే

త్వరలో హైదరాబాద్‌లో సివిల్‌ రైట్స్‌డే

  • పకడ్బందీగా పీసీఆర్‌, పీవోఏ చట్టాల అమలు
  • చార్జిషీట్‌ దాఖలు చేయడంలో జాప్యం వద్దు
  • ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించేందుకు రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల పర్యవేక్షణలో హైదరాబాద్‌తో సివిల్‌ రైట్స్‌డే నిర్వహించే యోచనలోఉన్నట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు.   పీసీఆర్‌, పీవోఏ చట్టాల అమలుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో గురువారం మంత్రి కొప్పుల.. రాష్ట్రస్థాయి హైపవర్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, లైంగికదాడులను అరికట్టేందుకు తీసుకువచ్చిన పీసీఆర్‌, పీవోఏ చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. చార్జిషీట్‌ వేయటంలో జాప్యం జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో వేగం పెంచాలని అధికారులను మంత్రి కోరారు.  

సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టండి : ఎర్రోళ్ల

పీవోఏ చట్టం రూల్‌ 7(2) ప్రకారం 60 రోజుల్లో విచారణ పూర్తిచేసి, ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాలని, కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సూచించారు. చార్జ్‌షీట్‌ వేయడం, సాక్ష్యాలను సేకరించడంలో పోలీసు అధికారులది కీలకపాత్ర అన్నారు. 2018 నుంచి 2020 వరకు నిర్దోషులుగా తేలిన పలు కేసుల్లో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని చెప్పా రు.  ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం కోసం విక్టి మ్‌ రిలీఫ్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌, కమిషనర్‌ యోగితారాణా, అడిషనల్‌ డీజీ గోవింద్‌ సింగ్‌, డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.