సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 21, 2020 , 21:25:29

నగర సర్వేలో హైదరాబాద్ ప్రజలు పాల్గొనాలి:జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

నగర సర్వేలో హైదరాబాద్ ప్రజలు పాల్గొనాలి:జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్: ఉత్తమ జీవన ప్రమాణాలున్న నగరాలకు ర్యాంకులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ఈ నెల 29 వరకు నిర్వహిస్తోన్న సిటిజన్ సర్వేలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్ కుమార్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీలు, 10 లక్షలు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో విద్యుత్, బ్యాంకింగ్‌, ఏటీఎం, స్వచ్ఛ్ భారత్‌, విద్య, ఉపాధి, వసతి, అద్దెలు, ట్రాన్స్‌పోర్టు, ఎమర్జెన్సీ సేవలు తదితర 23 ముఖ్య పౌర సదుపాయాలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రశ్నావళికి సానుకూలంగా స్పందించాలని ప్రజలను కోరారు.

ఈ నెల 7 నుంచి నిర్వహిస్తున్న సర్వేలో శుక్రవారం నాటికి హైదరాబాద్‌ నగరం మూడో స్థానంలో నిలిచిందని మొదటి స్థానంలో సూరత్‌, రెండో స్థానంలో అహ్మదాబాద్‌ నగరాలు నిలిచాయన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా హైదరాబాద్‌ నగర ప్రతిష్టను ఇనుమడింప జేసేందుకు ఇదొక అవకాశంగా భావించాలని అన్నారు. సిటిజన్‌ సర్వేలో పాల్గొనేందుకు మరో వారం పాటు ఉన్న వెసులుబాటును వినియోగించుకోవాలని నగర ప్రజలు, వర్తక, వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు సూచించారు. ఫేస్‌బుక్‌తో పాటు జీహెచ్ఎంసీ ట్విటర్, మైజీహెచ్ఎంసీ యాప్‌ ద్వారా కూడా సర్వేలో పాల్గొనవచ్చని   లోకేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


logo