సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:01

షాట్‌ రెడీ.. యాక్షన్‌!

షాట్‌ రెడీ.. యాక్షన్‌!

 • షూటింగ్‌ల అనుమతిపై ఉత్తర్వులు
 • థియేటర్లు తెరువొద్దని ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ.. సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. వాటికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకోవచ్చని తెలిపింది. సినిమా సెట్స్‌, సినిమా, టీవీ షూటింగ్‌లలో  కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టంచేసింది. థియేటర్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసిఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

సినిమా, టీవీ షూటింగ్‌లలో పాటించాల్సిన నిబంధనలు

 • ఆఫీసులు, స్టూడియో ప్రాంగణాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. 
 • ప్రతిఒక్కరూ కార్యాలయాలకు, స్టూడియోలకు వచ్చే ముందు, తిరిగి వెళ్లేటప్పుడు చేతులు శుభ్రంచేసుకోవాలి.
 • అన్ని ప్రవేశ, వెళ్లేమార్గాల వద్ద శానిటైజర్లను ఏర్పాటుచేయాలి.
 • ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించాలి.
 • కార్యాలయాలు, స్టూడియోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగాకు, పాన్‌ వంటివి వాడకూడదు. ఉమ్మి వేయకూడదు.  
 • కొవిడ్‌ చికిత్సచేసే దవాఖానల జాబితాను పనిప్రదేశాల్లో ప్రదర్శించాలి. నిర్మాత ప్రతి వ్యక్తి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి.
 • జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే అంబులెన్స్‌ తెప్పించాలి. తదుపరి పరీక్షల కోసం కింగ్‌కోఠి దవాఖానకు పంపించాలి.
 • తరచూ తాకే ప్రదేశాలు, మౌస్‌, కీబోర్డు, డోర్‌ హ్యాండిల్స్‌, ఇంటీరియర్స్‌ వంటి పరికరాలను నిత్యం క్రిమిరహితం చేయాలి.
 • 10 ఏండ్లలోపు, 60 ఏండ్లు దాటిన తారాగణం, సిబ్బందిని మెడికల్‌ క్లియరెన్స్‌ లేకుండా అనుమతించకూడదు.
 • షూటింగ్‌ ప్రదేశాలలో 40 మంది కంటే తక్కువగా ఉండాలి.
 • కంటైన్మెంట్‌ జోన్లలో షూటింగ్‌లకు అనుమతి లేదు.

ఏపీలోనూ షూటింగ్‌లకు అనుమతి 

సినిమా, సీరియళ్ల షూటింగ్‌లకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 15 తర్వాత షూటింగ్‌లు చేసుకోవచ్చని, దీనిపై విధివిధానాలు రూపొందిస్తామని ప్రకటించింది. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ను సినీ నటులు చిరంజీవి, నాగార్జున, దర్శక, నిర్మాతలు సురేశ్‌బాబు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సీ కల్యాణ్‌, దిల్‌రాజు తదితరులు కలిశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీలో కూడా సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్‌ అనుమతి ఇచ్చారని చెప్పారు. విశాఖలో స్టూడియోకు గతంతో వైఎస్‌ చేసిన భూ కేటాయింపులను పునఃపరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.


logo